“బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ న అపరః ఏకమేవ అద్వితీయం బ్రహ్మ” బ్రహ్మ ఒక్కటే ! దానిని మించి వేరొకటి లేదు. బ్రహ్మమే సత్యము. జగత్తు మిథ్య, మాయ అని శ్రీ ఆది శంకరులు తన అద్వైత సిద్ధాంతంలో విశద పరిచారు. మరి ఈ కంటికి కనబడే ఈ జగత్తు మాటేమిటి? బ్రహ్మం అంటే ఎవరు? బ్రహ్మ ఏవ జీవః స్వయం” సాక్షాత్తు బ్రహ్మమే జీవుడు.

అద్వైత సారం అవగాహన కావాలంటే జ్ఞాన సాధన చేయాలి. ఈ జన్మలో జ్ఞానోదయం అయిన వారు కారణ జన్ములే. అయితే, బాహ్యదృష్టితో సాధన చేస్తే ఫలితం ఉండదు. ఖచ్చితంగా జ్ఞానదృష్టి అవసరం. దానికి సద్గురువు తప్పనిసరి. కానీ సద్గురువు మార్గదర్శి మాత్రమే. స్వయంగా తమకు తాము గురువు చూపిన సుపథంలో ప్రయాణం చేస్తూ సాధన చేసి పరమ సత్యాన్ని తెలుసుకోవాలి. జ్ఞానదృష్టితో పరతత్వాన్ని ప్రకాశింప చేసుకోవడం సాధకుని బాధ్యతని శ్రీ రమణ మహర్షి పలుమార్లు బోధించేవారు. ఓసారి శ్రీ శంకరుల ప్రశిష్యులలో ఒకరు సంధ్యావందనం ముగించుకొని నది నుండి ఆశ్రమానికి బయలుదేరాడు.

సదా బ్రహ్మను ధ్యానిస్తూ వెళుతున్న అతనికి ఎదురుగా ఒక భద్రగజం వస్తోంది. బ్రహ్మ సత్యము మరియు ఈ జగత్తులో ఉన్నవన్నీ మాయ. అని కదా గురు ఉవాచ. అని భావించి ఏనుగు పైనున్న మావటి వాడు ప్రక్కకి తొలగమని హెచ్చరించినా లక్ష్య పెట్టక ఎదురేగాడు. అంతే ! ఆ గజము తన తొండముతో పట్టి ప్రక్కకు విసిరి వేసింది. విషయము తెలుసుకున్న అతని సహాధ్యాయులు ప్రాణాపాయ స్థితిలోనున్న అతనిని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. శుశ్రూషల అనంతరం కోలుకున్న అతనితో గురువు “నాయనా బ్రహ్మ రూపంలో నున్న మావటి వాడే సత్యం. జగము మిథ్య. కానీ గజము మిథ్య కాదేనను తత్వమును హెచ్చరిక రూపంలో తెలియజేశాడు.

కానీ నీవు అజ్ఞానంతో గ్రహించ లేక పోయావు. జీవుడే బ్రహ్మ. మరి ముయు ఆత్మజ్ఞాని అయితే పొగ చేత అగ్ని, మావి చేత శిశువు, ఎట్లు కప్పబడియుండునో అటుల కామము చేత జ్ఞానము కప్పబడియుండునను గీతాచార్యుడు నుడివిన సత్యాన్ని గుర్తించుకోవాలి. అని మిథ్య యొక్క సత్వాన్ని విశ్లేషణ చేసి వివరించారు. బ్రహ్మమనే సత్యము సృజించిన ఈ మాయ అను జగత్తులో మానవ జన్మ దుర్లభము. కావున లభించిన ఈ జన్మలో జ్ఞాన దృష్టితో పరమాత్మను తెలుసుకొని జన్మరాహిత్యం పొందడం తప్ప వేరొక గతి లేదు.


-వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు

Leave a Reply