జమ్మూకశ్మీర్‌లోని కిష్త్‌వార్‌ జిల్లా గురువారం (ఆగస్టు 14) ఘోర విషాదానికి వేదికైంది. ఛాసోటీ గ్రామంలో సంభవించిన క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పటివరకు 40 మంది మృతదేహాలు వెలికితీయగా, 200 మందికి పైగా గల్లంతైనట్లు అంచనా. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మార్పులు చేశారు. శుక్రవారం జరగాల్సిన ‘ఎట్‌ హోమ్‌’ టీ పార్టీ, ఉద‌యం జ‌ర‌గాల్సిన‌ సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తూ, మార్చ్‌పాస్ట్‌ వంటి అధికారిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. శ్రీనగర్‌ బక్షి స్టేడియంలో జరిగే మార్చ్‌పాస్ట్‌లో ఆయన గౌరవ వందనం స్వీకరించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం మచైల్‌ మాతా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Leave a Reply