హైదరాబాద్ : ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందని వ్యంగ్యంగా అన్నారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి అని పేర్కొన్నారు. తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి! అంటూ వ్యంగ్యంగా అన్నారు
న్యూఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖమంత్రు సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.
.బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి…. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు…. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో…ఈ రోజుతో తేలిపోయిందని స్పష్టం చేశారు.
నీ గురువుపై విశ్వాసం చూపించడానికి.. తెలంగాణ విధ్వంసం కావలసిందేనా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి.. చెరిపేయి సరిహద్దులు! అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో! జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమో!.. ఒక్క మాట గుర్తు పెట్టుకో.. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో పోరాటం చూస్తావంటూ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతాం! ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం! తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పకపడతామని కేటీఆర్ హెచ్చరించారు.