యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు మరికొందరు వ్యోమగాములు ఈ నెల 14న భూమికి తిరుగు పయనం కానున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 4:35కి అన్‌డాకింగ్ ప్రక్రియ జరగనుందని నాసా తెలిపింది.
తుది దశలో వీరు ప్రయాణించే క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ జూలై 15న అమెరికా కాలిఫోర్నియా తీరంలో ల్యాండ్ కానుంది. భూమికి చేరిన వెంటనే వ్యోమగాములను 7 రోజులు ప్రత్యేక క్వారంటైన్‌లో ఉంచుతారని నాసా వెల్లడించింది.
18 రోజుల పరిశోధనా యాత్ర
18 రోజుల అంతరిక్ష యాత్రలో శుక్లా బృందం అనేక కీలక పరిశోధనలు చేపట్టింది. శుభాంశుతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియొస్కీ, టిబర్ కపులు లాంటి వ్యోమగాములు భారరహిత స్థితిలో ప్రయోగాలు చేశారు.
మనుగడపై కీలక పరిశోధనలు
శుక్లా అంతరిక్ష కేంద్రంలో మైక్రోఆల్గేలపై పరిశోధనలు నిర్వహించారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలకు ఆహారం, ఆక్సిజన్, బయోఫ్యూయల్ వంటి వనరులను అందించగల నమూనాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. భవిష్యత్తులో భూమికి ఆవల జీవితం సాధ్యమేనని సూచించడానికి ఈ పరిశోధన దోహదపడుతుందని యాక్సియం తెలిపింది.
వాయేజర్ డిస్‌ప్లేస్ అధ్యయనం
శుక్లా బృందం వాయేజర్ డిస్‌ప్లేస్ అధ్యయనం కూడా చేసింది. అంతరిక్షంలో వ్యోమగాముల కంటి కదలికలు, కూర్పు సామర్ధ్యం ఎలా ప్రభావితమవుతుందో పరిశీలించారు. కక్ష్యలో వ్యోమగాములు పరిసరాలను ఎలా గుర్తిస్తారు, అక్కడ ఎలా సమన్వయం సాధిస్తారో కూడా అధ్యయనం జరిగింది. దీర్ఘకాల మిషన్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో నివాస స్థలాల రూపకల్పనకు ఇది మార్గదర్శకం అవుతుందని యాక్సియం వెల్లడించింది.
అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ, అధిక కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు వ్యోమగాముల సెరిబ్రల్ రక్తప్రవాహం, హృదయనాళ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా బృందం పరిశోధించింది. ఈ ఫలితాలు భవిష్యత్ వ్యోమగాములకు మాత్రమే కాకుండా, భూమిపైనే కొన్ని రకాల రోగులకూ ఉపయోగపడతాయని యాక్సియం స్పష్టం చేసింది.