శ్రీసత్యసాయి జిల్లా, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా (satyasai district ) కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో (zp high school ) మెగా పీటీఎం-2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (nara lokesh ) గురువారం పుట్టపర్తి వచ్చారు. కప్పలబండ పారిశ్రామిక వాడలో ప్రజలు, కార్యకర్తలను మంత్రి కలుసుకున్నారు. అనంతరం ప్రతి ఒక్కరితో కలిసి ఫొటోలు దిగారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై అర్జీలు (petitions ) స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి (MLA chaitanya reddy ) , ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కడపలోని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు మంత్రి లోకేశ్ ను కలుసుకున్నారు. యూనివర్సిటీ గుర్తింపు విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంతో పాటు జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంత్రి లోకేశ్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. తల్లికి వందనం పథకం కింద సాయం పొందిన పి.మాధవి, ఆమె నలుగురు పిల్లలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కొత్త చెరువు బీసీ కాలనీకి చెందిన పి.మాధవికి ఎనిమిదో తరగతి చదివే బాలు, ఏడో తరగతి చదివే నరసమ్మ, ఐదో తరగతి చదివే బేబీ, మూడో తరగతి చదివే సన అనే నలుగురు పిల్లలు ఉన్నారు. మాధవి నలుగురు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద రూ.52వేల సాయం అందింది. ఈ సందర్భంగా మాధవితో మంత్రి మాట్లాడుతూ.. పాఠశాలలో వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. యూనిఫాం, మధ్యాహ్న భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగుందని ఈ సందర్భంగా విద్యార్థులు చెప్పారు.
అనంతరం మాధవి మాట్లాడుతూ.. తల్లికి వందనం పథకం కింద తమకు రూ.52 వేల సాయం అందిందని, ఆ మొత్తాన్ని పిల్లల పేరుమీద బ్యాంకులో వేశామని మంత్రికి తెలిపారు. దీనిపై మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తంచేస్తూ.. పిల్లలను బాగా చదివించాలని, వారి ఉన్నత చదువుల బాధ్యత తీసుకుంటామని మాధవికి హామీ ఇచ్చారు. మధాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నామని, పుస్తకాల బ్యాగ్ బరువు తగ్గించేందుకు సెమిస్టర్ విధానం తీసుకువచ్చామని, వర్క్ బుక్ లు అందజేశామని మంత్రి వివరించారు. బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని పిల్లలకు సూచించారు. కాగా, తల్లికి వందనం కింద నలుగురు పిల్లలకు సాయం అందించడంతో పాటు.. మంత్రి నారా లోకేశ్ తమ పట్ల చూపించిన ఆప్యాయత పట్ల మాధవి, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.