AP | జల్ జీవన్ మిషన్‌.. ప్రకాశం జిల్లాలో నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం !

ప్రకాశం జిల్లా వాసులకు త్రాగునీటి సమస్యల నుంచి శాశ్వత విముక్తి కలిగించే దిశగా మరో పెద్ద అడుగు పడింది. జల్ జీవన్ మిషన్ ద్వారా రూపుదిద్దుకున్న రూ.1,290 కోట్ల భారీ త్రాగునీటి పథకానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు.

ఈ ప్రాజెక్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దీర్ఘకాలంగా వేధిస్తున్న ఫ్లోరైడ్ నీటి సమస్యకు, భూగర్భ జలాల అనిశ్చితికి తగిన పరిష్కారం అందించేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది. గుండ్లకమ్మ, రామతీర్థం మరియు వెలిగొండ రిజర్వాయర్ల నుండి నీటిని తీసుకుని 7 నియోజకవర్గాల్లోని మొత్తం 1,386 గ్రామాలవాసులకు శుద్ధమైన త్రాగునీటిని సరఫరా చేయనుంది.

ఈ పథకం పూర్తయిన తర్వాత దాదాపు 21.80 లక్షల మంది ప్రజలకు తాగునీటి సమస్యలు తీరనున్నాయి. ఇది జిల్లాలోని ఆరోగ్యానికి, జీవన నాణ్యతకు గణనీయమైన మార్పుని తీసుకురానుంది.

ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని అధికార వర్గాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలు నివారించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్‌లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.

ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ప్రాంతీయ ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడమే కాకుండా, వలసల అభివృద్ధి కూడా గణనీయంగా మెరుగవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply