HYDRAA | నాలాలు పొంగొద్దు.. శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలి : హైడ్రా కమిషనర్

నాలాలు పొంగ‌కుండా శాశ్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలి అని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ అధికారుల‌కు సూచించారు. నాలాల‌కు ఉన్న ఆటంకాల‌న్నీ తొల‌గితే చాలా వ‌ర‌కు ముంపు స‌మ‌స్య త‌లెత్త‌ద‌న్నారు. వ‌ర్షాల వేళ‌.. న‌గ‌రంలోని ప‌లు ప్ర‌ధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ గురువారం ప‌రిశీలించారు.

నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసి వెంట‌నే తొల‌గించ‌డానికి ఆదేశాలు జారీ చేశారు. భారీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు మూసీ న‌దీ ప‌రీవాహ‌కం కంటే.. ఎక్కువ కూక‌ట్‌ప‌ల్లి, జీడిమెట్ల నాలాలే ప్ర‌మాద‌క‌రంగా మారుతున్నాయ‌ని గ్ర‌హించామ‌న్నారు. ఈ రెండు నాలాలు సాఫీగా సాగ‌క‌పోవ‌డంతో భ‌ర‌త్‌న‌గ‌ర్‌, మూసాపేట‌, బాలాన‌గ‌ర్‌, జింక‌ల‌వాడ‌, దీన్‌ద‌యాల్‌న‌గ‌ర్, వినాయ‌క్‌న‌గ‌ర్‌, క‌ల్యాణ్ న‌గ‌ర్ ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని.. ఈ ఏడాది ముప్పు లేకుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు.

స‌గానికి పైగా క‌బ్జాల‌కు గురైన నాలాలు..

జీడిమెట్లలోని ఫాక్స్ సాగ‌ర్ నుంచి వ‌చ్చే వ‌ర‌ద కాలువ ఎక్క‌డిక‌క్క‌డ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై కుంచించుకుపోయిన విష‌యాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు క్షేత్ర స్థాయిలో ప‌రిశిలించారు. ఫాక్స్ సాగ‌ర్ అలుగు కాలువ ఆన‌వాళ్లే లేకుండా పోయింది. జీడిమెట్ల ప్రాంతంలో ఆ కాలువ 30 మీట‌ర్ల వెడ‌ల్పులో ఉంటే.. క‌ల్వ‌ర్టుల వ‌ద్ద ఉన్న వెడ‌ల్పు కాల‌నీలు, బ‌స్తీలకు వ‌చ్చేస‌రికి లేకుండా పోయింది.

బాలాన‌గ‌ర్ జింక‌ల‌వాడ, దీన్‌ద‌యాల్‌న‌గ‌ర్ క‌ల్వ‌ర్టు కింద 22 మీట‌ర్లు వెడ‌ల్పుతో ఉన్న నాలా.. బ‌స్తీల‌కు వ‌చ్చేస‌రికి 10 మీట‌ర్ల‌కు ప‌రిమిత‌మైంది. వాస్త‌వానికి 22 మీట‌ర్ల వెడ‌ల్పు, నాల‌కు ఇరువైపులా 9 మీట‌ర్ల చొప్పున బ‌ఫర్‌ని క‌లిపి మొత్తం 40 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఉండాల్సిన నాలా 10 మీట‌ర్ల‌కు ప‌రిమిత‌మ‌వ్వ‌డంతోనే జీడిమెట్ల నాలా పొడుగునా.. ఫ‌తేన‌గ‌ర్‌, బాలాన‌గ‌ర్ బ‌స్తీల‌న్నీ నీట మునుగుతున్నాయ‌ని గుర్తించారు. వెంట‌నే జీడిమెట్ల నుంచి వ‌చ్చే ఈ నాలాను డ్రోన్ కెమేరాతో ప‌రిశీలించి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించాల‌ని అధికారుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు. ఫాక్స్‌సాగ‌ర్ చెరువు కింద‌న నాలాలో పోసిన మట్టిని వెంట‌నే తొల‌గించాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

నాగిరెడ్డి కుంట‌తో స‌హా ఔట్లెట్ నాలాలు క‌బ్జా..

అల్వాల్ మండ‌లం యాప్రాల్ లో నాగిరెడ్డి కుంట క‌బ్జాల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. దాదాపు 19 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న చెరువు 6 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జాకు గురైంద‌ని గ్ర‌హించారు. చెరువు గ‌ర్భంలో పోసిన మ‌ట్టిని తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

నాగిరెడ్డి కుంట నుంచి కాప్రా చెరువుకు వెళ్లాల్సిన వ‌ర‌ద కాలువ‌లు ఎక్క‌డిక‌క్క‌డ దారిత‌ప్ప‌డంతో పాటు.. క‌బ్జాల‌కు గురి కావ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. కొన్ని చోట్ల నాలాల‌కు ఏర్ప‌డిన ఆటంకాల‌ను త‌నిఖీ చేశారు. గోల్ఫ్ ప్రై డ్ హోమ్స్‌, మ‌ల్బార్ గీన్స్ విల్లాస్‌, హ‌రిప్రియ‌న‌గ‌ర్‌, గోల్ఫ్ వ్యూ ప్యార‌డైజ్‌, స్వ‌ర్ణాంధ్ర ఫేజ్ 01, 02 ఇలా ప‌లు గేటెడ్ క‌మ్యూనిటీలలో వాగులు రూటు మార‌డాన్ని, కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్ప‌డ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు.

నాలా ఆరంభంలో ఎంత వెడ‌ల్పులో ఉందో.. కాప్రా చెరువులో క‌లిసే వ‌ర‌కూ అదే కొన‌సాగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఇక్క‌డి వివిధ కాల‌నీ వాసుల‌తో త్వ‌ర‌లోనే స‌మావేశం ఏర్పాటుచేసి.. గ‌తంలో నాలాలు ఏ మార్గంలో వెళ్లేవి.. ఇప్పుడు వాటిని పున‌రుద్ధ‌రించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చిస్తామ‌న్నారు.

హైడ్రా క‌మిష‌న‌ర్ గారి ఆదేశాల మేర‌కు.. యాప్రాల్‌లోని స్వ‌ర్ణాంధ్ర ఫేజ్ 01కు వ‌ర‌ద ముప్పును త‌ప్పించే కాలువ నిర్మాణ ప‌నులు వెంట‌నే పూర్తి చేశారు. మ‌ధ్యాహ్నం ప‌రిశీలించ‌గా.. ఆ వెంట‌నే హైడ్రా స‌హ‌కారంతో మ‌ల్కాజిగిరి స‌ర్కిల్ అధికారులు ప‌నులు ప్రారంభించి పూర్తి చేశారు.

Leave a Reply