AP | త్వరలోనే విశ్వ గురువుగా భారత్…

  • ఆధ్యాత్మిక విలువలు పెంచిన యోగ
  • అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : అతి తొందరలోనే విశ్వ గురువుగా భారత్ నిలవబోతుందని శ్రీ శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ వెల్లడించారు. ఇటీవల ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా వేడుకలు ఆధ్యాత్మిక విలువలను పెంచాయన్నారు.

అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతిని గుర్తించాల్సిన అవసరం ఉందన్న ఆయన సంస్కృతి సాంప్రదాయాలకు కూడా గుర్తింపు తీసుకురావాలన్నారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో బుధవారం జాతీయ హిందూ ధార్మిక సదస్సును సాధు పరిషత్తు గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసనంద సరస్వతీ స్వామీజీ,పి వి ఎన్ మాధవ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించాలని, భారతీయ అత్యుత్తమ విలువలను ఇప్పటికీ కూడా ప్రపంచంలో 80% ప్రజలు తెలుసుకో లేకపోతున్నారన్నారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ఇటీవల నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. భారతదేశం విశ్వగురు అయ్యే రోజు దగ్గరలోనే ఉందని అభిప్రాయపడ్డారు.

సదస్సులో తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం

విజయవాడలో నిర్వహించిన జాతీయ హిందూ ధర్మిక సదస్సులో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు ఏకగ్రీవంగా అందరూ ఆమోదముద్రవేశారు. ముఖ్యంగా దేవాలయాల పైన ఇచ్చిన వివాదాస్పద జీవోను వెంటనే రద్దు చేయాలనీ, దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో ధార్మికులను మాత్రమే నియమించాలన్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా ప్రకటించి, మద్యం, మాంసం రహితంగా చేయాలన్నారు. హిందువుల పండుగలు, ఊరేగింపులకు ప్రభుత్వం రక్షణ కలిగించాలనీ, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలన్నారు.

అయోధ్య, కాశీయాత్రలకు వెళ్లే భక్తులకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. ప్రతి ఆలయ అర్చకుడికి గౌరవ వేతనాలు 10000 రూపాయలు ఇవ్వాలనీ, దేవాలయ భూముల్లో గోశాలలు ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు. బంజరు భూములు గోశాలలోని గోవుల గడ్డి పెంచేందుకే వాడాలనీ, టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ నూతన విద్యాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ప్రతి దేవాలయము యొక్క ఆదాయ వ్యయాలు, ఆభరణల వివరాలు, భూములు, ఆస్తులు వివరాలు ఆన్లైన్లో ఉంచాలనీ, ఆశ్రమాల నిర్వహణకు నిధులు కేటాయించాలన్నారు.

రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగాలు పొంది మతం మారిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలనీ, 60 సంవత్సరాలు దాటిన ధార్మిక వానప్రస్థ గురువులకు వేతనాలు ఇవ్వాలన్నారు. టిటిడి స్వయంగా గోశాల నిర్వహించి ఆ గోవుల నెయ్యిని లడ్డు తయారీకి ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధికార ప్రతినిధి తురగా శ్రీరాం, ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, రవి సాధువులు 300 మంది కి పైగా పాల్గొన్నారు.

Leave a Reply