AP | సీమ విద్యుత్ గణాంకాల్లో పొరపాటు.. సీజీఎంకు సీఎండీ ఛార్జ్‌షీట్
తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో రైతులకు విద్యుత్ సరఫరా చేసే సమయాల వివరాల విషయంలో చోటు చేసుకున్న పొరబాటు చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) కు సదరన్ డిస్కం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) ఛార్జ్ షీటు జారీ చేయడానికి దారితీసిన అరుదైన ఉదంతం ఇది. సదరన్ డిస్కం పరిధిలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల పరిధిలోని రైతులకు 9గంటల విద్యుత్తు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నాయి.
కాగా అనూహ్యంగా రోజుకు నిర్దేశిత పద్దతిలో 7 గంటల పాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేయాలని నిర్దేశిస్తూ తిరుపతిలోని డిస్కం ప్రధాన కార్యాలయం నుంచి ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ అంశం సోషియల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ఆ అంశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రంగంలోకి దిగిన డిస్కం అధికారులు వేసవిలో విద్యుత్ వినియోగానికి అనుగుణంగా వ్యవసాయానికి 9గంటల విద్యుత్ సరఫరా అంశంపై జిల్లా అధికారులకు చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఆదేశాలిచ్చే క్రమంలో సమయ గణాంకాల్లో పొరపాటు దొర్లిందని గుర్తించారు.
ఇటువంటి కీలక అంశంలో తమనుంచి అవసరమైన నోట్ అప్రూవల్ తీసుకోకుండానే ఆదేశాలు జారీ చేసినందుకు చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) డీఎస్ వరకుమార్ కు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి కె.సంతోషరావు ఈరోజు ఛార్జ్ షీటు జారీ చేశారు. మరోవైపు జరిగిన తప్పిదాన్ని సరిచేస్తూ రోజుకు 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నిర్దేశించే ఉత్తర్వులను అన్ని జిల్లాలకు పంపిణీ చేశారు.