హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రావతరణ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని అధికార కాంగ్రెస్ పార్టీ.
రాష్ట్రం ఆవిర్భవించి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. నేడు 12వ వసంతంలోకి తెలంగాణ అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను అట్టహాసంగా జరుపుతోంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పోరాటంలో ప్రాణాలను అర్పించిన తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.
కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందని అన్నారు.సుదీర్ఘ తెలంగాణ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, రైతులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరినీ రేవంత్ రెడ్డి ప్రశంసించారు. వారి సేవలను కొనియాడారు. అమరుల త్యాగాలు చిరస్మరణీయమని, తెలంగాణ సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రం.. బలమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగమించేలా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి సంకల్పించామని ఆయన అన్నారు. తమ పాలనలో సామాజిక, ఆర్థిక పురోగమనం వైపు రాష్ట్రం ప్రయాణం సాగిస్తోందని, దీన్ని మరింత ప్రోత్సహించేలా తమ ప్రజా ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తుందని అన్నారు. కొత్త విధానాలను ప్రవేశపెడుతుందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా.. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద గల అమర వీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఆయన నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు బయలుదేరి వెళ్తారు. అక్కడ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.