America | విద్యార్ధుల‌పై ట్రంప్ మ‌రో పిడుగు – వీసా ఇంట‌ర్వ్యూలు నిలిపివేత

వాషింగ్ట‌న్ డిసి – ప్రపంచవ్యాప్తంగా ఉన్న దౌత్య కార్యాలయాల్లో స్టూడెంట్ వీసాల ఇంటర్వ్యూలను అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై కఠిన తనిఖీలకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోన్న నేపథ్యంలో అమెరికాలో తమ భవిష్యత్తుపై అంతర్జాతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

త్వరలో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ‘ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది. విద్యార్థి లేదా ఎక్స్చేంజ్ విజిటర్ వీసాల (F, M, J వర్గాలు) కోసం సోషల్ మీడియా స్క్రీనింగ్, పర్యవేక్షణలో భాగంగా కొత్త వీసా అపాయింట్‌మెంట్‌లను ఇకపై షెడ్యూల్ చేయవద్దు’అని రూబియో ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే బుక్ అయిన ఇంటర్వ్యూలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని డిప్లొమాటిక్ కేబుల్ స్పష్టం చేసింది.

ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్థుల ప్రవేశ నియమాలను మరింత కఠినతరం చేసే ప్రయత్నాల్లో భాగమని దీనిని భావిస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీతో పాటు క్యాంపస్‌లలో ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళనలను సాకు చూపుతూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ లేదా హోంల్యాండ్ సెక్యూరిటీ దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఆందోళనల్లో పాల్గొనడానికి వస్తున్నారు: రూబియో
వీసా ఇంటర్వ్యూ నిలుపుదల ఉత్తర్వుల జారీకి ముందు కూడా కఠిన విధానం అమలుచేస్తామనే సంకేతాలు ఇచ్చేలా రుూబియో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘కొంతమంది విద్యార్థులు చదవడానికే కాకుండా ఆందోళనల్లో పాల్గొనడానికి అమెరికా వస్తున్నారు’ అన్నారు. ఉదాహరణకు, టఫ్ట్స్ యూనివర్సిటీలో డాక్టోరల్ విద్యార్థి రుమేయ్సా ఓజ్టర్క్ ‘గాజా’కు మద్దతుగా ఓ కథనం రాసినందుకు అరెస్టైన విషయాన్ని ఆయన ఉదహరించారు. ‘వీసా కోసం దరఖాస్తు చేసే విద్యార్థి, అమెరికా వచ్చి యూనివర్సిటీలను ధ్వంసం చేయడం, ఇతర విద్యార్థులను వేధించడం, భవనాల మీద కబ్జా చేయడం వంటి చర్యల్లో పాల్గొనాలనుకుంటే మేము వీసా ఇవ్వం’ అని ఆయన స్పష్టం చేశారు.

హార్వర్డ్‌లో అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేత
కాగా, హార్వర్డ్ యూనివర్సిటీ, ట్రంప్ యంత్రాంగం మధ్య వివాదం నేపథ్యంలో వీసా నిలుపుదలపై ప్రకటన చేయడం గమనార్హం. కొద్ది రోజుల కిందట హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం హార్వర్డ్‌లో అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లను నిలిపివేయాలని ప్రయత్నించింది. అయితే ఫెడరల్ న్యాయమూర్తి ఆ చర్యను అడ్డుకున్నారు. అంతేకాదు, ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్‌కు ఉన్న దాదాపు 100 మిలియన్ డాలర్లు విలువైన ఫెడరల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించింది. మరోవైపు, యూనివర్సిటీకి బిలియన్ల విలువైన గ్రాంట్లను ఇతరత్రాలను కూడా నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వైఖరిపై నిపుణులు తీవ్రంగా మండిపడుతున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌ లెక్చరర్ కెవిన్ ఓలీరి.. ఫాక్స్ బిజినెస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ అసాధారణ ప్రతిభ కలగిన ఈ విద్యార్థులు అమెరికాను ద్వేషించడంలేదు. మేము ముందు వీరి నేపథ్యాన్ని పరిశీలించి, వారు ఇక్కడ చదువు పూర్తి చేస్తే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అవుతారు. వాళ్లకు ఇక్కడే వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్లు ఇక్కడికి అందుకోసం వచ్చారు’ అన్నారు.

Leave a Reply