- ఓడలోని కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు
- సాగర జలాల కలుషితంపై ఆందోళన.. తీరంలో హై అలర్ట్..
లైబీరియా నౌక ఒకటి కొచ్చి తీరంలో ప్రమాదానికి గురైంది. ఈ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం మునిగింది. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) ప్రకటించింది. నౌకలో మొత్తం 640 కంటైనర్లు ఉండగా, వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగతా వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు పేర్కొంది.
రసాయనాలు లీకైతే సముద్ర జలాలు కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. తీరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కంటైనర్లను, అందులోనుంచి బయటకొచ్చిన ఇంధనాన్ని తాకొద్దని ప్రజలకు కేరళ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీచేసింది.
లీకైన రసాయనాలు, ఇంధనం సముద్రంలో ఏమేరకు వ్యాపించిందనే విషయాన్ని పరిశీలించడానికి ఆయిల్ స్పిల్ మ్యాపింగ్‌కు ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ నౌక విరి&ుంజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరింది. 184 మీటర్ల పొడవైన ఈ ఎంఎస్పీ ఎల్సా -3 శనివారం మధ్యాహ్నానికి కొచ్చిన్ తీరం చేరాల్సివుంది. మరికొద్ది గంటల్లో తీరానికి చేరుతుందనగా ఇంతలో ప్రమాదానికి గురైంది. కాగా, నౌకలోని 24మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు ఐసీజీ అధికారులు వెల్లడించారు.