కౌలాలంపూర్: భారత సీనియర్ బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ప్రవేశించాడు. ప్రపంచ ర్యాంకింగ్‌లో 33వ స్థానంలో ఉన్న ఐర్లాండ్ ఆటగాడు నాట్ గ్వెన్‌పై శ్రీకాంత్ 59 నిమిషాల పాటు జరిగిన పోరులో 23-21, 21-17 తేడాతో విజయం సాధించాడు.
శ్రీకాంత్ తన తదుపరి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన తోమా పోపోవ్‌ను ఎదుర్కోనున్నాడు.
ఇదిలా ఉండగా, పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్‌లో భారత ఆటగాడు హెచ్.ఎస్. ప్రణయ్… జపాన్‌కు చెందిన యుషి తనాకా చేతిలో 9-21, 18-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. అదే విధంగా అయుష్ శెట్టి, సతీష్ కుమార్ కరుణాకరన్ కూడా తమ మ్యాచ్‌లలో వరుస గేముల్లోనే పరాజయాన్ని చవిచూశారు.
అయుష్ శెట్టి ఫ్రాన్స్ ఆటగాడు తోమా పోపోవ్ చేతిలో 13-21, 17-21తో ఓడగా, సతీష్ కుమార్ కరుణాకరన్ క్రిస్టో పోపోవ్ చేతిలో 14-21, 16-21తో ఓడిపోయాడు.
మహిళల డబుల్స్‌లో ప్రేరణ ఆల్వేకర్ – మృణ్మయీ దేశ్‌పాండే జోడీ… తైవాన్‌కు చెందిన హ్సూ యిన్ హుయ్ – లిన్ ఝిహ్ యున్ జోడీ చేతిలో 9-21, 14-21తో ఓటమి పాలైంది.
మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత జోడీ ధ్రువ్ కపిలా – తనీషా క్రాస్టో 21-17, 18-21, 21-15తో ఫ్రాన్స్‌కు చెందిన జూలియన్ మాయో – లియా పలెర్మోపై విజయం సాధించింది. వారు తదుపరి రౌండ్‌లో చైనా జోడీ జియాంగ్ జెన్ బాంగ్, వే యా షిన్‌ను ఎదుర్కొంటారు.