BCCI | అండర్-19 ఉమెన్స్ టీ20 టీమ్‌కు అయిదు కోట్ల నజరానా…
అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. జట్టు మొత్తానికి రూ. 5 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నగదును జట్టుతో పాటు సిబ్బందికి కూడా అందించనున్నట్లు పేర్కొంది. కాగా, ఆదివారం మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ పోరులో యువ భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. తద్వారా వరుసగా రెండో సారి ప్రపంచకప్ టీ20 టైటిల్‌ను భారత అమ్మాయిలు కైవసం చేసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలను టీమిండియా 82 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది.
తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. బౌలింగ్ లో 3 వికెట్లు పడగొట్టిన ఆమె.. ఓపెనర్ గా బరిలో దిగి 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో త్రిష మొత్తం 309 పరుగులు చేసింది. బౌలింగ్ లో 7 వికెట్లు తీసి సత్తా చాటింది.
ఇలా టోర్నమెంట్‌లో ఆల్ రౌండర్ షోతో అదరగొట్టిన ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డులు లభించాయి. అటు టీమిండియా బౌలింగ్ విభాగంలో వైష్ణవి శర్మ (17 వికెట్లు), ఆయుశి శుక్లా (14 వికెట్లు) కూడా అద్భుతంగా రాణించారు. తద్వారా 2023 తర్వాత వరుసగా రెండోసారి యువ భారత్ ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో భారత అమ్మాయిలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.