Condolence | ఉగ్ర‌దాడి మృతుల‌కు జ‌న‌సేనాని సంతాపం … మూడు రోజుల పాటు పార్టీ జెండా అవ‌న‌తం

వెల‌గ‌పూడి – జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలువురు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఈ ఉగ్రదాడి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంతాపం తెలిపారు. ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంతాప దినాలను పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్‌కల్యాణ్ ఓ ప్రకటన చేశారు.

జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేస్తున్నట్లు పవన్‌కల్యాణ్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్‌లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఈ దుశ్చర్యను ఖండించి, మృతులకు సంతాపం తెలిపామనిఅన్నారు. జనసేన పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. నేటి ఉదయం అన్ని జనసేన పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకూ దించి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ఏపీ వ్యాప్తంగా మానవ హారాలు నిర్వహించి ఉగ్రవాద దాడిని ఖండించాలని నేతలకు పవన్‌కల్యాణ్ సూచించారు.

యూపీఎస్సీ విజేతలకు అభినందనలు…

ఇక యూపీఎస్సీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పలువురు విజేతలుగా నిలవడం సంతోషదాయకమని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్‌కల్యాణ్ ఓ ప్రటన చేశారు.11వ ర్యాంకుతో ఇ.సాయి శివాని, 15వ ర్యాంకుతో బాన్న వెంకటేష్ తొలి 20 మందిలో నిలిచారని చెప్పారు. పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్ 94వ ర్యాంకు సాధించడంపై పవన్‌కల్యాణ్ ప్రశంసలు కురింపించారు.

రావుల జయసింహారెడ్డి (46వ ర్యాంకు), శ్రవణ్ కుమార్ రెడ్డి (62వ ర్యాంకు), సాయిచైతన్య జాదవ్ (68వ ర్యాంక్), ఎన్.చేతన రెడ్డి (110 ర్యాంక్ ), చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి (119 ర్యాంక్), చల్లా పవన్ కల్యాణ్ (146 ర్యాంక్), ఎన్.శ్రీకాంత్ రెడ్డి (151వ ర్యాంక్), నెల్లూరు సాయితేజ (154వ ర్యాంక్), కొలిపాక శ్రీకృష్ణసాయి (190వ ర్యాంక్) సాధించి సత్తా చాటుకున్నారని పవన్‌కల్యాణ్ ఉద్ఘాటించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకులు సాధించిన విజేతలు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. దేశ అభివృద్ధిలో సివిల్ సర్వీసులకు ఎంపికైన యువత పాత్ర కీలకమైనదని.. ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ‘ప్రజలే దేవుళ్లు అనే సూత్రాన్ని పాటించాలి’ అని చెప్పిన మాటలను వీరంతా గుర్తుంచుకోవాలని ఆకాంక్షిస్తున్నానని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply