మీ ఇంటి నుంచే ఇంటి వివ‌రాలు న‌మోదు చేయండి…

మీ ఇంటి నుంచే ఇంటి వివ‌రాలు న‌మోదు చేయండి…

స్వీయ గ‌ణ‌న ప్ర‌క్రియ‌లో భాగ‌స్వాములు కండి
అందుబాటులో పోర్ట‌ల్..
జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : దేశంలో మొట్ట‌మొద‌టి డిజిట‌ల్ జ‌న గ‌ణ‌న తొలిద‌శ‌లో భాగంగా ప్రారంభ‌మైన స్వీయ గ‌ణ‌న (సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ – ఎస్ఈ)లో ప్ర‌జ‌లు ఉత్సాహంగా పాల్గొని త‌మ ఇంటి నుంచే స‌మాచారాన్ని న‌మోదు చేయాల‌ని జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ కోరారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వ‌ర‌కు స్వీయ గ‌ణ‌న జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ గురువారం క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక స్టాల్‌ను ప్రారంభించారు.

ఈ స్టాల్ ద్వారా ప్ర‌జ‌ల‌కు సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్‌పై అవ‌గాహ‌న కల్పించ‌నున్నారు. క‌చ్చిత‌మైన డేటాతో పాటు కీల‌క‌మైన జ‌న‌గ‌ణ‌న‌లో విస్తృత ప్ర‌జాభాగ‌స్వామ్యాన్ని ప్రోత్స‌హించాల‌నే ఉద్దేశంతో ఈ సౌక‌ర్యాన్ని క‌ల్పించిన‌ట్లు వివ‌రించారు. https://se.census.gov.in పోర్ట‌ల్ ద్వారా ప్ర‌జ‌లు త‌మ వివ‌రాల‌ను పొందుప‌రుచుకోవ‌చ్చ‌న్నారు. సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ వ‌ల్ల స‌మ‌యం ఆదా అవ‌డంతో పాటు క‌చ్చిత‌మైన డేటా పొందేందుకు వీలుంటుంద‌న్నారు.

34 అంశాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఇచ్చిన అనంత‌రం ప్రివ్యూ చేసుకొని, ఫైన‌ల్‌గా స‌బ్‌మిట్ చేయాల‌న్నారు. ఆ స‌మ‌యంలో హెచ్ అక్ష‌రంతో మొద‌ల‌య్యే 11 అంకెల విశిష్ట సంఖ్య (ఎస్ఈ ఐడీ) జ‌న‌రేట్ అవుతుంద‌ని.. భ‌విష్య‌త్తులో గ‌ణాంక సిబ్బంది (ఎన్యూమ‌రేట‌ర్‌) వ‌చ్చిన‌ప్పుడు ఎస్ఈ ఐడీని వారికి చూపించడం ద్వారా డేటా ధ్రువీక‌రణ పూర్త‌వుతుంద‌ని తెలిపారు. అదే విధంగా ఈ నెల 30 వ‌ర‌కు 15 రోజుల అవుట్‌రీచ్ క్యాంప‌యిన్‌లో భాగంగా ఒక్కోరోజు ఒక్కో వ‌ర్గం ల‌క్ష్యంగా స్వీయ గ‌ణ‌నపై ప్ర‌చార కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

స్వీయ గ‌ణ‌న‌లో ప్ర‌జ‌లంద‌రూ పాల్గొని జిల్లాను అగ్ర‌స్థానంలో నిల‌పాల‌ని జేసీ ఇల‌క్కియ కోరారు. సమావేశంలో విజ‌య‌వాడ ఆర్‌డీవో టీవీ స‌తీష్‌, క‌లెక్ట‌రేట్ ఏవో శ్రీనివాస్‌రెడ్డి, మెజిస్టీరియల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఎం.వెంకట రామయ్య, సీపీవో వై.శ్రీల‌త, సెన్స‌స్ మాస్ట‌ర్ ట్రైన‌ర్ డా. కొల్లేటి ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply