అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం…

అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం…

కర్నూలులో ఘనంగా జయంతి వేడుకలు…
నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు…

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని, ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్ గుప్తా పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విగ్రహానికి పూలమాల వేసి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన శక్తివంతమైన రాజ్యాంగం వల్లే దేశం స్థిరత్వంతో ముందుకు సాగుతోందన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న భావనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడారు. కర్నూలులో ఓర్వకల్లులో పరిశ్రమల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు విస్తరించనున్నాయని వెల్లడించారు.

జయంతి సందర్భంగా మౌర్య ఇన్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ఎంపీ స్థాయికి చేరుకోవడం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లేనని అన్నారు. సమాజంలో ఉన్న కుల వివక్ష, అంటరానితనం వంటి సమస్యలను ఎదుర్కొని సమానత్వానికి పునాది వేసిన మహనీయుడని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా అంబేద్కర్ కృషి చేశారని తెలిపారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లుతో సామాజిక న్యాయం మరింత బలపడుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ, అంబేద్కర్ కాలంలో నెలకొన్న అంటరానితనం, కుల వివక్షను గుర్తుచేస్తూ, అలాంటి పరిస్థితుల్లో కూడా విద్యను ఆయుధంగా చేసుకుని ఆయన ఎదిగారని పేర్కొన్నారు. సమానత్వం, హక్కులు, న్యాయం కల్పించే రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహానుభావుడని కొనియాడారు.

కార్మిక హక్కులు, మహిళల సంక్షేమం, రిజర్వ్ బ్యాంక్ స్థాపన వంటి అంశాల్లో కూడా ఆయన ఆలోచనలు కీలకమని వివరించారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ, అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. రాజ్యాంగం వల్లే ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు లభించాయని తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత శాతం పెంపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలే సమానత్వ సమాజానికి మార్గదర్శకం అని వక్తలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు.

Leave a Reply