హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆదాయం కోసం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ భూముల వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎంకు రాసిన లేఖలో హైచ్‌సీయూలో ఉన్న 400ఎకరాల భూమి వేలం ప్రక్రియను విరమించుకోవాలని కోరారు. అలాగే గతంలో ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం వేలానికి నోటిఫికేషన్ ఇచ్చిన భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. అది పూర్తిగా అటవీ సంపద, జింకలు, నెమళ్లు, వేలాది పక్షులు ఉన్నాయని వాటిని పరిరక్షించే అవసరం ఉందని, యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి. ఇదే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.