అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లోని లింగోజిగూడెం గ్రామం వద్ద జాతీయ రహదారి 65 విస్తరణ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అండర్‌పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని 3వ వార్డు (లింగోజిగూడెం) కౌన్సిలర్ పల్లె లావణ్య సురేందర్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ లావణ్య సురేందర్ రెడ్డి మాట్లాడుతూ లింగోజిగూడెం హైవే రోడ్డును దాటే సమయంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు సుమారు 25 నుండి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు తీవ్ర గాయాలకు గురయ్యారని తెలిపారు.
ఇటీవల జరిగిన ప్రమాదాలలో గ్రామానికి చెందిన పలువురు బాధితులుగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే బ్రతుకుతెరువు కోసం ఇక్కడకు వచ్చిన బీహార్, ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన పలువురు కూడా ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. ఈ ప్రమాదాల కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా లింగోజిగూడెం హైవేపై అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరిగా ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆమె ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మెల్యేలను కలిసి వారిలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తొర్పునూరి శ్రీకాంత్ గౌడ్, పర్నె శివారెడ్డి తదితరులు ఉన్నారు.
