4thAprileditorial | మాల్డా ఘటన పై రాజకీయ తుఫాన్..

4thAprileditorial | మాల్డా ఘటన పై రాజకీయ తుఫాన్..

4thAprileditorial | పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన
మాల్డా జిల్లాలో జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం ఘటన
మమతా బెనర్జీ-కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఘర్షణ
సీబీఐ, ఎన్‌ఐఏ దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆదేశాలు
ఎన్నికల కమిషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు
ప్రజాస్వామ్య వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనలు

4thAprileditorial |పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదనీ, మూక స్వామ్యం రాజ్యమేలుతోందని స్వయంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం.. ఆ రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోంది. ఓటర్ల జాబితాల ముమ్మర సవరణ కార్యక్రమాన్ని (సర్‌) సరిచూసేందుకు వెళ్ళిన జ్యుడీషయల్‌ అధికారులను అల్లరిమూక ఘెరావ్‌ చేసి ఏడు గంటల సేపు నిర్బంధించిన ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలా ఎన్నడూ జరగలేదు. ఈ ఘటన పై ఫిర్యాదు చేసినా రాష్ట్ర పోలీసు డైరక్టర్‌ జనరల్‌ కానీ, కేంద్ర ఎన్నికల కమిషన్‌ కానీ ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం అంతకన్నా దారుణమైన విషయం. రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల జాబితాల సవరణ కార్యక్రమం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకీ, కేంద్ర ఎన్నికల సంఘంకి ఈ విషయమై యుద్ధంలాంటి ఘర్షణ జరుగుతోంది. ఈ వ్యవహారం పై సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ హాజరై స్వయంగా తన వాదనను వినిపించారు.

రాష్ట్రంలో పరిస్థితిపై సీబీఐ చేత కానీ, ఎన్‌ఐఏ చేత కానీ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ముమ్మర సవరణను సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించిన తీరు మరీ వింతగా ఉంది. మాల్డాలో జరిగిన ఈ సంఘటన గురించి ఏ ఒక్కరూ తనకు చెప్పలేదనీ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కేంద్రం లాగేసుకుందని ఆరోపించారు. ఆమె కేంద్రంతో యుద్ధమే చేస్తున్నారు. మాల్డా జిల్లాలో కాలయా చౌక్‌ ప్రాంతంలో జ్యుడీషియల్‌ అధికారులు ఓటర్ల జాబితాల సమగ్ర సవరణను పరిశీలన జరుపుతుండగా, మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఐదారు గంటల సేపు అల్లరి మూక వారిని చుట్టుముట్టి వారి పనిని చేసుకోనివ్వకపోవడం ఏ పాటి ప్రజాస్వామ్యంని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ఘటన పై చర్యలు తీసుకునేందుకు తాను అశక్తురాలిననీ, కేంద్రం తన అధికారాలను లాగేసుకుందని మమతా బెనర్జీ చెబుతున్నారు.

ఈ సంఘటన గురించి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం. పరిశీలనకు వెళ్ళిన జ్యుడీషియల్‌ అధికారులకు కనీసం మంచి నీరు కూడా అందించకుండా నిర్బంధించారంటే ఎంత దుర్మార్గమో స్పష్టం అవుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకున్న తర్వాత రాత్రి పది గంటలకు వారు విడుదల అయ్యారని సుప్రీంకోర్టుకు సమాచారం అందింది. అంతా అయిన తర్వాత మూక దాడులను అంగీకరించబోమని ఎన్నికల కమిషన్‌ ప్రకటించడం సిగ్గు చేటు. ఈ విషయమై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాసిన లేఖను పరిశీలించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుబాటులో లేకపోవడం మరింత దారుణం. అధికార గణం కొందరు ఒక వైపు, మరి కొందరు మరో వైపు చేరి సమీకరణ అయినట్టు కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య సమంజసంగానే ఉంది.

Leave a Reply