విద్యార్థుల చేతిలో ఆర్గానిక్ కార్న్

విద్యార్థుల చేతిలో ఆర్గానిక్ కార్న్
- స్వయంగా పండించిన మారిస్ స్టెల్లా కళాశాల విద్యార్థులు
- వారి చేతుల మీదుగా ఆర్గానిక్ స్వీట్ కార్న్ కోత
- సరికొత్త ప్రయోగంతో విద్యార్థులకు ఆదాయం
ఆంధ్రప్రభ, విజయవాడ ; విజయవాడలోని మారిస్ స్టెల్లా కళాశాలలో వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి విభాగానికి చెందిన 8వ సెమిస్టర్ తుదివ సంవత్సరం విద్యార్థులు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన స్వీట్ కార్న్ పంటను విజయవంతంగా కోత కోశారు. విద్యార్థులు స్వయంగా సాగు నుంచి కోత వరకు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అగ్రోనమీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి. గౌతమి మాట్లాడుతూ.. ఆర్గానిక్ వ్యవసాయ విధానాలతో స్వీట్ కార్న్ పంటకు మెరుగైన దిగుబడి లభించిందని తెలిపారు.

స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్లు, ఆహార రేశాలు, మాగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండి, శరీరానికి శక్తినిచ్చేలా రోగనిరోధక శక్తిని పెంపొందించేలా ఉపయోగపడుతుందని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఇన్న్యాసమ్మ మాట్లాడుతూ, చదువు దశలోనే సంపాదించండి అనే ప్రాజెక్ట్ ద్వారా విద్యార్థులు ఆర్గానిక్ పద్ధతిలో పంట సాగు చేసి, విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్టైపెండ్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానం తో పాటు ఆర్థిక ప్రోత్సాహం లభిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. సిస్టర్ ఆశ, విభాగాధిపతి డా. లక్ష్మణ స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు రవితేజ, తేజశ్రీ, లావణ్య, భావ్య పాల్గొన్నారు. తుదివ సంవత్సరం విద్యార్థులు తమ కృషి ఫలితంగా మంచి దిగుబడి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.
