April-1-Deadline : ఏపీ హాస్పిటల్స్ వార్నింగ్ Andhra Prabha News

April-1-Deadline : ఏపీ హాస్పిటల్స్ వార్నింగ్ Andhra Prabha News
- ఎన్టీఆర్ వైద్య సేవలు..బ్రేక్
- భారీ బకాయిలు, సేవా రుసుములు
- ఆందోళనలో ఆసుపత్రులు.
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )
ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో పనిచేస్తున్న గుర్తింపు పొందిన ఆసుపత్రులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించాయి. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే 2026 ఏప్రిల్ 1 నుంచి పథకం కింద సేవలను నిలిపివేయాల్సి వస్తుందని జిల్లా సమన్వయకర్తకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నోటీసు ఇచ్చాయి. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి సంబంధించిన చికిత్స బిల్లుల పరిష్కారంలో నెలల తరబడి ఆలస్యం జరుగుతుండటంతో పాటు, దీర్ఘకాలంగా సేవా రుసుములు సవరించకపోవడం ఆసుపత్రుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తోందని నిర్వాహకులు తెలిపారు. పెరుగుతున్న ఖర్చులు, నిలిచిపోయిన బకాయిల కారణంగా ఆసుపత్రులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.
April-1-Deadline : ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు..
రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులకు కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ తో పాటు ఇతర సమస్యలను పలు మార్లు పథక ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపినా స్పష్టమైన పరిష్కారం లభించలేదని తెలిపారు. డిసెంబర్ నాటికి బకాయిల చెల్లింపులు, సేవా రుసుముల సవరణ జరుగుతాయని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఆసుపత్రులు కొనసాగించడం కష్టసాధ్యమైందని, వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించడం, సేవా రుసుములను సవరించడం, భవిష్యత్లో సమయానికి చెల్లింపులు జరుగుతాయనే హామీ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఏప్రిల్ 1 నుంచి సేవలను నిలిపివేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
April-1-Deadline : ప్రత్యామ్నాయం తప్పదు
ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ సేవలను నిలుపుదల చేస్తామని నోటీసులో హెచ్చరించారు.అత్యవసర, కొనసాగుతున్న చికిత్సలు పొందుతున్న రోగులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆసుపత్రులు విజ్ఞప్తి చేశాయి.
