అకాల వర్షాలతో అన్నదాత కుదేలు..

అకాల వర్షాలతో అన్నదాత కుదేలు..
ఎన్టీఆర్ జిల్లా పైనే అధిక దెబ్బ…
వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం..
4,362 హెక్టార్లలో పంట నష్టం
5,983 మంది రైతులపై ప్రభవం
మొక్కజొన్న పూర్తిగా నేలమట్టం
వత్సవాయి మండలంలో అధిక ప్రభావం
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. కోత దశలో ఉన్న పంటలపై ప్రకృతి విరుచుకుపడటంతో వేలాది ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. ముఖ్యంగా మొక్కజొన్న, వరి, మినుము, జొన్న పంటలు భారీగా దెబ్బతిన్నాయి. వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లావ్యాప్తంగా 4,362 హెక్టార్లలో పంట నష్టం సంభవించగా, మొత్తం 5,983 మంది రైతులు ప్రభావితమయ్యారు.
అత్యధికంగా వత్సవాయి మండలంలో..
జిల్లాల కురిసిన అకాల వర్షాల ప్రభావం అత్యధికంగా వత్సవాయి మండలంలో నమోదైంది. ఒక్క మండలంలోనే 2,020 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, 3,380 మంది రైతులు నష్టపోయారు. పెనుగంచిప్రోలు మండలంలో 631 హెక్టార్లలో 740 మంది రైతులు నష్టాలను చవిచూశారు. మొత్తం 94 గ్రామాలు ఈ ప్రకృతి విపత్తు ప్రభావానికి లోనైనట్లు అధికారులు గుర్తించారు. పంటల వారీగా చూస్తే మొక్కజొన్న పంటపై తీవ్ర ప్రభావం పడింది. దాదాపు 4,062 హెక్టార్లలో మొక్కజొన్న పూర్తిగా దెబ్బతింది. వరి పంట 275.5 హెక్టార్లలో నేలకొరిగింది. మినుము, జొన్న పంటలకూ గణనీయమైన నష్టం సంభవించింది. కోత దశలో ఉన్న పంటలు నీటమునిగిపోవడం, గాలివానలకు మొక్కలు కూలిపోవడం వల్ల రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు. వత్సవాయి, నందిగామ, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, విజయవాడ గ్రామీణం, విస్సన్నపేట, కంచికచర్ల, గంపలగూడెం, ఇబ్రహీంపట్నం మండలాల్లో నష్టం అధికంగా నమోదైంది. అనేక ప్రాంతాల్లో పంట పొలాలు నీటితో నిండిపోవడంతో రైతులు పంటను పూర్తిగా కోల్పోయిన పరిస్థితి నెలకొంది.
క్షేత్రస్థాయిలో అంచనాలు..
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటల నష్టాల అంచనాల కోసం అధికారులు గ్రామాల వారీగా సర్వేలు చేపట్టారు. పంటల వారీగా నష్టం శాతాన్ని ఖరారు చేసి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా క్లెయిమ్‌ల ప్రక్రియ వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో తక్షణ సహాయం అందించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో అకాల వర్షాల తీవ్రత పెరుగుతున్నది. ముఖ్యంగా కోత దశలో వర్షాలు కురవడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.
