చిత్తూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

చిత్తూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

  • రూ.34 లక్షల విలువైన బంగారం, వెండి స్వాధీనం
  • రెండు కార్లు కూడా పట్టివేత

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఇళ్లలో తాళాలు వేసి వెళ్లిన సందర్భాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను చిత్తూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.34 లక్షల విలువ గల 151 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.6 కిలోల వెండి వస్తువులు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిత్తూరు పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో నివాసముంటున్న వరదరాజులు అనే వ్యక్తి కుటుంబంలో కుమారుడు మరణించడంతో ఫిబ్రవరి 5న ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం ప్రాంతంలో తాళం వేసిన ఇళ్లను పరిశీలిస్తూ తిరుగుతున్న నిందితులు లల్లూ ప్రసాద్, జనార్ధన్ ఆ ఇంటిని గమనించారు.

రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో ఇంటి తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయారు. ఫిబ్రవరి 6న ఇంటికి తిరిగి వచ్చిన బాధితుడు చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో, చిత్తూరు ఎస్‌డీపీఓ టి. సాయినాథ్ ఆధ్వర్యంలో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య మరియు ఎస్‌ఐ రమేష్‌బాబు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. కేసు పరిష్కారానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుల కార్యకలాపాలపై విస్తృతంగా విచారణ నిర్వహించారు.

ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ కీలక సమాచారం సేకరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి 11న సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో చిత్తూరు, గుడిపాల రోడ్డులో కొత్త కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పనిచేయని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న బంగారు, వెండి వస్తువులు మరియు రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం రాత్రి 9.30 గంటలకు వారిని అధికారికంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో నిందితులు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడు లల్లూ ప్రసాద్ (34)పై తమిళనాడులోని సేలం, ఈరోడ్, నామక్కల్ జిల్లాల్లో రెండు హత్య కేసులు, రెండు హత్యాయత్నం కేసులు, 11 దోపిడీ కేసులు, 16 ఇంటి దొంగతనాల కేసులు నమోదు అయ్యాయి.

అతను అక్కడ రౌడీ షీటర్‌గా కూడా ఉన్నట్లు వెల్లడైంది. మరో నిందితుడు జనార్ధన్ (31)పై తమిళనాడులోని సేలం, ఈరోడ్, నామక్కల్ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల దొంగతనాలు మరియు గాంజా అక్రమ రవాణాకు సంబంధించిన మొత్తం ఏడు కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు కృషి చేసిన టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య, ఎస్‌ఐ రమేష్‌బాబు, ఏఎస్‌ఐ దేవరాజులు, హెడ్ కానిస్టేబుళ్లు బాబు, శ్రీనివాసులు, రవి రెడ్డి, సుధాకర్, కానిస్టేబుళ్లు భరత్, ధర్మారావు, కుమార్, రఫీ, తవరాజ్, మహిళా కానిస్టేబుల్ సురేఖలను జిల్లా ఎస్పీ అభినందించారు.

Leave a Reply