Iran War Toll : అమెరికా తూచ్.. Andhra Prabha Analysis
Iran War Toll : అమెరికా తూచ్.. Andhra Prabha Analysis
- చమురు ఆంక్షలు లేవ్
- రష్యా ట్యాంకర్లకు టానిక్
- త్వరలోనే యుద్ధానికి బ్రేక్
- తగిన ఫలితం దక్కలే
- ఇరాన్ తగ్గలేదంతే
- తెరమీదకు వార్ టోల్
- భారత్, చైనాకు నో కప్పం
- పశ్చిమాసియాలో అలజడి యథాతథం
( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్)
పశ్చిమాసియాలో ఇరుగు పొరుగు దేశాల మధ్య పొరపొచ్చాలే ఆయుధంగా మలిచే వార్ గేమ్ క్రియేటర్ అమెరికా పరిస్థితి.. ప్రస్తుతం డెలమాలో పడింది. పెద్దన్నగా.. గ్లోబల్ పోలీసు అవతారంలో ప్రపంచాన్ని గడగడలాడించే.. అమెరికా మాటను తాజాగా ఏ మిత్ర దేశమూ పట్టించుకోవటం లేదు. ఎందుకంటే.. వెనిజులాలో నియంతను తొలగిచాం. ఇక ఇరాన్ అణ్వాయుధాల సంగతి తేల్చేస్తాం, అంటూ ఇజ్రాయెల్ తో జత కట్టి ఇరాన్ పై ఆపరేషన్ ఎథిక్స్ ఫ్యూరీకి శంఖం పూరించిన అమెరికా.. ఫలితం లేని ఈ యుద్ధం త్వరలో ముగిస్తోందని ప్రకటించటం సరికొత్త అంశం. వాస్తవానికి అణ్వాయుద రహిత ఇరాన్ స్థాపనే లక్ష్యమని, ఇక్కడ పాలకుల మార్పుతో సాధ్యమని అమెరికా భావించింది. అందుకు అనుగుణంగా ఇరాన్ సుప్రీం అయాతుల్లా ఖమేనీ బృందాన్ని అంతం చేసి.. మరి రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ ఎథిక్స్ ఫ్యూరీ విజయగాథను ప్రపంచానికి చాటి చెప్పాలనే గంపెడాశ.. అమెరికా గుండెల్లో కుంపట్లు రగిల్చింది. అక్కడ అమెరికాను వ్యతిరేకించిన సుప్రీం ప్రాణాలతో లేడు. కానీ అతడి కంటె కరుడు గట్టిన మతవాది తండ్రిని మించిన తనయుడు ముజ్తబా ఖమేనీకి పగ్గాలు అందాయి. ఇప్పుడే అమెరికాతో ఇరాన్ అసలు యుద్దం ఆరంభమైంది.
Iran War Toll : ఇదిగో ఇదే.. అణుగుట్ట

ఫోర్డో, నటాంజ్ ప్రాంతాల్లో ఇరాన్ భారీ స్థాయిలో యురేనియం నిల్వలు ఉన్నాయని, ఈ నిల్వలను నిర్వీర్యం చేసి ప్రపంచ దేశాలకు తమ సత్తా చూపాలని అమెరికా ఆశించింది. కానీ ఇరాన్ అంతకంటే అత్య ధిక ప్రాణనష్టానికి సమానమైన ఆర్థిక విధ్వంసం సృష్టించి..ప్రపంచాన్ని కకావికలం చేసింది. హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకలకు బ్రేక్ వేసింది. అంతే తూర్పు ఆసియా దేశాలన్నీ అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడింది. బేరల్ క్రూడ్ ఆయిల్ ధర $ 125 కు చేరింది. ఫలితంగా.. శ్రీలంక ఆయిల్ ధరలను పెంచేసింది. దక్షిణ కొరియా ఏకంగా ఆయిల్ ధరలకు తాళం వేసింది. ఇక అమెరికాలోనూ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. ఈ స్థితిలో అమెరికా వెనుకడుగు తప్పలేదు.
Iran War Toll : తగిన ఫలితం లేదు..

ఫ్లోరిడాలోని డోరల్ రిసార్ట్‌లో జరిగిన రిపబ్లికన్ల సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధంపై పరస్పర విరుద్ధ ప్రకటనలు చేశారు. అమెరికా ఈ యుద్ధంలో దూసుకు పోయింది. తన సైనిక లక్ష్యాలను చేరుకుంది. దాదాపు దాడులు పూర్తయ్యాయి” (pretty well complete) అని ట్రంప్ వివరించారు. ఇరాన్ నౌకాదళం, వాయుసేన, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆయన చెప్పారు. కానీ.. అంతక ముందు రిపబ్లికన్లతో ఆయన మాట్లాడుతూ, మనం “తగినంతగా గెలవలేదు అన్నారు. “మనం చాలా రకాలుగా గెలిచాం, కానీ ఇంకా తగినంతగా గెలవలేదు” (we haven’t won enough) అని అన్నారు. శత్రువు పూర్తిగా ఓడిపోయే వరకు అమెరికా వెనక్కి తగ్గదని ఆయన స్పష్టం చేశారు. ఈ యుద్ధం ఒక “చిన్న విహారంష అని ట్రంప్ అభివర్ణించారు. ఇక ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాత్రం ఇది “కేవలం ఆరంభం మాత్రమే” అని పేర్కొనడం గమనార్హం.
Iran War Toll : అమెరికా బ్రేక్ అప్

అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌లో 5,000 కంటే ఎక్కువ వ్యూహాత్మక లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేశాయని ట్రంప్ ప్రకటించారు. సైన్యం అన్ని లక్ష్యాలను ఒకేసారి తాకడం లేదని, అత్యంత కీలక లక్ష్యాలను (important targets) ప్రస్తుతం వదిలివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ ఆ లక్ష్యాలను ధ్వంసం చేస్తే, ఆ దేశం కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుందని హెచ్చరించారు. ఇంతకీ ఆ కీలక లక్ష్యాలంటే.. ఏవో కాదు, ఇరాన్ తన అత్యంత సంపన్న యురేనియంను ఫోర్డో (Fordow) , నటాంజ్ (Natanz) పర్వతాల లోపల, 300 వందల అడుగుల లోతులోని భూగర్భ కేంద్రాల్లో దాచింది. వైమానిక దాడులతో (Air Strikes) యురేనియం కేంద్రాలను ధ్వంసం చేయటం అసాధ్యం. అందుకే తూచ్.. అంటూ అమెరికా.. వార్ కు బ్రేక్ అప్ చెబుతోంది.
Iran War Toll : ఆయిల్ పై ఆంక్షలు లేవ్..

తెల్లవారితే చాలు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. ఎలాంటి ఆంక్షలు ప్రకటిస్తారోనని.. గత రెండు మూడేళ్లుగా.. ప్రపంచ దేశాలు గజగజలాడాయి. చైనాతో్ టారిఫ్ వార్ పేరిట .. అనేక దేశాలపై ఆంక్షలతో ట్రంప్ విరుచుకుపడ్డాడు. భారత్ కూ టారిఫ్ ఆంక్షల చేదు రుచి చూపించాడు. ధరలను అదుపు చేయడానికి కొన్ని దేశాలపై చమురు కొనుగోళ్లు, దిగుమతులపై ఆంక్షలను (oil-related sanctions) తాత్కాలికంగా ఎత్తివేచినట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. మార్చి 2026 నాటికి ప్రధానంగా రష్యా , ఇరాన్ వంటి దేశాల చమురుపై కఠిన ఆంక్షలను అమెరికా అమలు చేస్తోంది. ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం కారణంగా ప్రపంచ రష్యావ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరగడంతో అమెరికా కొన్ని ఆంక్షలను సడలించడం ప్రారంభించింది.
Iran War Toll : రష్యాకే ఆయిల్ టానిక్

ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రోస్‌నెఫ్ట్ (Rosneft), లుకోయిల్ (Lukoil) వంటి ప్రధాన రష్యా చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఇరాన్ చమురు ఎగుమతులపై దశాబ్దాలుగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజకీయ అస్థిరత, ప్రజాస్వామ్య ఉల్లంఘనల ఆరోపణలతో వెనిజులా చమురు రంగంపై కూడా ఆంక్షలు ఉన్నాయి.

సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును కొనుగోలు చేయడానికి భారతీయ రిఫైనరీలకు అమెరికా 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. ఈ గడువు ఏప్రిల్ 3, 2026 వరకు ఉంటుంది. రష్యా నుంచి వచ్చే ఇతర చమురు రకాలను కూడా “అన్‌సాంక్షన్” (ఆంక్షల నుండి తొలగించడం) చేసే ఆలోచనలో ఉన్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ తెలిపారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా రవాణా సాధారణ స్థితికి వచ్చే వరకు చమురుపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
Iran War Toll : వార్ యథాతథం

పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగానే ఉంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. యుద్ధం “చాలా త్వరగా” ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఇవి అత్యంత తీవ్రమైన దాడులుగా పరిగణిస్తన్నారు. ఇజ్రాయెల్‌పైనే కాకుండా, అమెరికా స్థావరాలకు ఆతిథ్యం ఇచ్చిన పలు దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్, ఇరాక్ లోని
అమెరికా సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేస్తోంది.
Iran War Toll : ఇరాన్ ప్లాన్ బీ

ఇరాన్ ఇకపై ఒక టన్ను కంటే తక్కువ బరువున్న వార్‌హెడ్లను ప్రయోగించబోమని, మరింత శక్తివంత క్షిపణులను వాడతామని హెచ్చరించింది. కనీసం ఆరు నెలల పాటు ఇంటెన్సివ్ యుద్ధం చేసే సామర్థ్యం తమకు ఉందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని మూసివేసి, ప్రపంచ చమురు సరఫరాకు విఘాతం కలిగించి పశ్చిమ దేశాలపై ఒత్తిడి తీసుకురావడం ఇరాన్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.
Iran War Toll : తెర మీదకు వార్ టోల్

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సరికొత్త వ్యూహం రంగంలోకి దించింది. ఈ ఎత్తుగడ అంతర్జాతీయ సమాజంలో సంచలనంగా మారింది. యుద్ధం పన్ను (వార్ టోల్)ను తెరమీదకు తీసుకు వచ్చింది. ఈ జలసంధి గుండా వెళ్లే అమెరికా మిత్రదేశాల (UK, ఫ్రాన్స్, జర్మనీ, కొన్ని గల్ఫ్ దేశాల) చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు భారీ మొత్తంలో ‘ట్రాన్సిట్ ఫీజు’ చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఈ ‘కప్పం’ కట్టకపోతే, ఆ నౌకలను స్వాధీనం చేసుకోవడం లేదా డ్రోన్లతో దాడులు చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే యుద్ధంతో సరఫరా దెబ్బతిని చమురు ధరలు పెరిగాయి. ఇప్పుడు ఇరాన్ అదనపు వసూళ్లు మరింత ఆర్థిక భారంగా మారాయి.

అమెరికా మిత్రదేశాలు ఈ వసూళ్లను “సముద్ర దొంగతనం” (Maritime Piracy) గా అభివర్ణిస్తున్నాయి. కానీ, యుద్ధం తీవ్రత దృష్ట్యా చాలా కంపెనీలు గత్యంతరం లేక రహస్యంగా ఇరాన్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన మిత్రదేశాల నౌకలకు అమెరికా నౌకాదళం (US Navy) రక్షణ కల్పించలేకపోవడం దాని వైఫల్యంగా కనిపిస్తోంది. ఇరాన్ వసూలు చేస్తున్న ఈ నిధులు తిరిగి యుద్ధంలో అమెరికాకు వ్యతిరేకంగానే (ఆయుధాల కొనుగోలుకు) ఉపయోగపడుతున్నాయి. ఆసక్తికర విషయం ఏమిటంటే, తనతో మంచి సంబంధాలు ఉన్న భారత్, చైనా దేశాలను ఈ ‘కప్పం’ నుండి మినహాయించినట్టు మాచారం. అందుకే భారతీయ నౌకలు ప్రస్తుతానికి సురక్షితంగా ముందుకు సాగుతున్నాయి.
ALSO READ : Trump Self Goal : అమెరికా బొక్క బోర్లా Andhra Praprabha Analysis
