శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఘనారంభం
వేద మంత్రోచ్చారణల నడుమ అంకురార్పణ, అభిషేకాలతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
నేడు స్వామివారి కల్యాణ మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం నున్నలో వేంచేసి ఉన్న 123 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. శైవాగమ సంప్రదాయం ప్రకారం త్రయాహ్నిక దీక్షతో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి పీఠం పీఠాధిపతి మునీంద్ర మహారాజ్ నేతృత్వంలో, శివాచార్య గూడూరు గోపీకృష్ణ సాన్నిహిత్యంలో గోపూజతో అంకురార్పణ నిర్వహించారు.
అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, రక్షాబంధనం, దీక్ష స్వీకరణ, అఖండ స్థాపన, స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, హారతి, తీర్థప్రసాద వినియోగం వంటి పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తర్వాత స్వామివారు యాగశాలలో ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు అంగజాల శివయ్య, దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎస్. హేమలతా దేవి, ప్రధానార్చకుడు డాక్టర్ మామిళ్లపల్లి ఫణికుమార్ పర్యవేక్షణలో అనేక మంది దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఉత్సవ మూర్తులకు అంగరంగ వైభవంగా అభిషేకం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఆలయ ఈఓ దంపతులు శ్రీ వేణుగోపాలస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలి రోజు సాయంత్రం నిత్యార్చన, శాల ప్రవేశం, వాస్తు పూజ, వాస్తు హోమం, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల రెండో రోజైన సోమవారం శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆరుబయట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఈఓ హేమలతాదేవి తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం పొందాలని ఆలయ అధికారులు సూచించారు.
