పాల్వంచ, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో ఆందోళన జరిగింది. మాజీ మంత్రి, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పాల్వంచలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే సస్పెన్షన్ పై సమరభేరి మోగించిన బీఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ తీశారు. వనమా నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చకు రాకుండా చిల్లర రాజకీయాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి తగదుని ఈ సందర్భంగా వనమా అన్నారు.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తెయ్యడమే కాకుండా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు, సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరావు, పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్, పాల్వంచ మండలాల అధ్యక్షులు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామ్ మూర్తి , మాజీ ఎంపీపీలు మడివి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.