TG | ఆయ‌న‌కు ఆ హక్కు లేదు : మంత్రి సీతక్క

సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ కు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుల గణనపై బీఆర్ఎస్ నాయకులు పదే పదే విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. 50 రోజుల పాటు సమగ్ర సర్వే కొనసాగినా.. కేటీఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదని, పైగా ప్రభుత్వాన్ని నిందించడం ఏంటని ప్రశ్నించారు.

అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే అధికారుల నిరంతర పర్యవేక్షణలో జరిగిందని అన్నారు. బీసీ డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై సీఎం రేవంత్ రెడ్డితో రిజర్వేషన్లపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. మరో నాలుగు రోజుల్లో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రకటన వస్తుందని తెలిపారు. కులగణన రిపోర్ట్‌ పై బీసీల్లో కొంత అసంతృప్తి ఉందని ప్రశ్నించగా.. మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.

బీసీల్లో ఎక్కడా అసంతృప్తి లేదని.. కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లో లేనిపోని అనుమానాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కులగణనపై బీసీలకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ప్రభుత్వం దృష్టి తీసుకురావొచ్చని మంత్రి సీతక్క కామెంట్ చేశారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రిజర్వేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. సమావేశంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *