32 people |ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం…

32 people | ప్రభుత్వ వైఫల్యమే డయేరియాకు కారణం…
32 people | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలి పదుల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల పాలు కావడానికి కూటమి ప్రభుత్వ అసమర్థతే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రహదారి మరమ్మతు పనుల వల్ల తాగునీరు కలుషితం అవుతుందని తెలిసినా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
అధికారులు, పాలకులు క్షేత్రస్థాయి పరిస్థితులను గాలికొదిలేయడం వల్లే నేడు 32 మంది అమాయక ప్రజలు మంచాన పడ్డారని ఆయన ఆరోపించారు. జిల్లాలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, బాధితులకు అందుతున్న వైద్యంపై తమకు నమ్మకం లేదని కృష్ణదాస్ విమర్శించారు. తక్షణమే బాధితులందరికీ మెరుగైన ఉచిత వైద్యం అందించడంతో పాటు, కలుషిత నీరు సరఫరా కావడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ ప్రభుత్వం, తక్షణమే స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాలని, లేనిపక్షంలో వైకాపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
