జనసేన పార్టీకి జన్మస్థలం తెలంగాణ అయితే.. ఖర్మ స్థలం ఆంధ్రప్రదేశ్ అని ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో శుక్రవారం నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
తనకు పునర్జన్మ ఇచ్చిన తెలంగాణకు ఎంతో రుణపడి ఉన్నానని పేర్కొన్నారు. అనేక ఇబ్బందులుపడి జనసేన పార్టీని నడిపానని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాకవి గద్దర్ గజ్జకట్టి ప్రజలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. ఖుషి సినిమా చూసి గద్దర్ తననెంతో ప్రోత్సహించారని తెలిపారు.
దాశరథి కృష్ణమాచార్యుల గురించి గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ దాశరథి సాహిత్యం చదివి తాను ప్రభావితం అయినట్లు తెలిపారు. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తాం.. అనే మాటలు నిజం చేశామని పవన్ కళ్యాణ్ అన్నారు.
2019లో జనసేన ఓటమిపాలైనప్పుడు మీసాలు మెలేశారని, ఓటమి భయం లేదు కాబట్టే అసెంబ్లి, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశామని పేర్కొన్నారు. జనసేన 11వ వార్షికోత్సవాన 11 సీట్లకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశామని ఆయన అన్నారు.
భాషా వివాదంపైనా పవన్ కళ్యాణ్ పరోక్షంగా స్పందించారు. బహు భాషలే భారతదేశానికి మంచిదని పేర్కొన్న జనసేనాని.. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని తెలిపారు.