zimbabwe| అదిరిపోతున్న అద‌ర్ టీమ్స్‌

zimbabwe| అదిరిపోతున్న అద‌ర్ టీమ్స్‌

  • ద‌డ పుట్టిస్తున్న జింబాబ్వే
  • టీ20ప్ర‌పంచ‌క‌ప్‌లో దూకుడు
  • పెద్ద‌పెద్ద జ‌ట్ల‌కు షాక్‌
  • సూప‌ర్ 8లోకి ఎంట్రీ
  • 22న సౌత్ ఆఫ్రికా, 26న టీం ఇండియాతో ఢీ
  • అప్ర‌మ‌త్త‌మైన బిగ్ టీమ్స్‌

zimbabwe| ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : క్రికెట్‌లో జింబాబ్వే జ‌ట్టు గురించి చాలా త‌క్కువ మంది మాట్లాడుకుంటారు. ఆ జ‌ట్టును ప్ర‌త్య‌ర్థులు ఓ ప‌సికూన‌లా భావిస్తారు. వారిని ఈజీగా ఓడించొచ్చు అనే భావ‌న‌లో ఉంటారు. నిజానికి ఒక‌ప్పుడు ఆ జ‌ట్టులో హేమాహేమీలుండేవారు. ఫ్లవర్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్, అలిస్టర్ క్యాంపెబెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కలకలలాడిన ఆ జట్టు గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో అర్హత సాధించలేకపోయిన జింబాబ్వే.. 2026 టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతోంది. పెద్ద‌పెద్ద జ‌ట్ల‌కు ద‌డ పుట్టిస్తోంది.

టీ20 ప్రపంచకప్‌ గ్రూప్ ద‌శ‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించి జింబాబ్వే జ‌ట్టు తొలి సంచలనం నమోదు చేసింది. ఆస్ట్రేలియాపై విజయం కేవలం గాలివాటం కాదని జింబాబ్వే వెంటనే నిరూపించింది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన అదే కొలంబో మ్యాచ్‌‌లో 179 పరుగుల లక్ష్యాన్ని అద్భుతంగా ఛేదించింది. శ్రీ‌లంక‌పై ఆరు వికెట్ల తేడాతో జింబాబ్వేకు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ విజయాలతో టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఓటమి ఎరుగని నాలుగు జట్లలో ఒకటిగా జింబాబ్వే రికార్డ్ సృష్టించింది.

అయితే సూపర్ 8లో భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉన్న కఠినమైన గ్రూప్‌లోకి జింబాబ్వే చేరింది. కాగితంపై ఈ జట్లు బలంగా ఉన్నప్పటికీ, జింబాబ్వే ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఏ జట్టునైనా ఓడించే సత్తా ఉందని స్పష్టమవుతోంది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, తమకున్న ఊపుతో పెద్ద జట్ల సెమీఫైనల్ ఆశలపై నీళ్లు చల్లడానికి జింబాబ్వే సిద్ధంగా ఉందని ఆ పెద్ద జ‌ట్లు భ‌య‌ప‌డుతున్నాయి. ఈ నేపథ్యంలో, జింబాబ్వేను ఎదుర్కోవడానికి ఆ మూడు జ‌ట్లు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈనెల 22వ తేదీన అహ్మదాబాద్‌లో సౌత్ ఆఫ్రికాతో టీం ఇండియా తలపడనుంది. ఆ తర్వాత, ఈనెల 26వ తేదీన చెన్నై వేదికగా జింబాబ్వేతో టీం ఇండియా మ్యాచ్ ఆడనుంది.

Leave a Reply