AP | నేత్ర పర్వంగా శ్రీ లక్ష్మీనృసింహుని కళ్యాణం..!

  • తిలకించిన వేలాది మంది భక్తజనం..
  • ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన నారా లోకేష్ దంప‌తులు


మంగళగిరి ఆంధ్రప్రభ – మంగళాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేలాది మంది భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అఖిలాండ బ్రహ్మాండకోటి నాయకుడు అచ్యుతుడు, అనంతుడు, సనాతనుడు, అయిన శ్రీ నృసింహుని కళ్యాణాన్ని తిలకించి భక్తకోటి తరించి పోయింది. దేవస్థానానికి ఉత్తర దిశగా ఉన్న ప్రాంగణంలో సర్వ పరిమళాలను వెదజల్లుతూ సకల పుష్పాలంకరణల తో దీదీప్యమానంగా వెలిగిపోతున్న కళ్యాణ మండపం పై వేద పండితుల, పురోహితుల, సర్వమంగళ వాయిద్యాలు, నడుము నరసింహుని కళ్యాణo వైఖానస, ఆగమ శాస్త్రానుసారం అత్యంత రమణియంగా నేత్రపర్వంగా సాగింది.

బ్రహ్మోత్సవాలలో మధుర ఘట్టమైన కళ్యాణానికి కొద్దిగా ముందు అనగా గురువారం రాత్రి శ్రీవారు పెళ్లి కుమారుని శోభతో చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవానికి వెళ్లి వస్తూ రాత్రి సమయాన రథసాల మలుపు వద్ద పుష్పక విమానంపై తనకు ఎదురొచ్చిన నూతన పెండ్లి కుమార్తెలు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో సాంప్రదాయంగా ఎదురు కోల ఉత్సవంలో పాల్గొన్నారు. తమ కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వేచి ఉన్న భక్తజనుల హృదయాలను పరవశింపజేస్తూ శ్రీవారు అమ్మవార్లు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అప్పటికి సమయం గురువారం అర్ధరాత్రి అయింది.

ఆలయ అర్చకులు మండపంపై విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం శ్రవణానంద కరమైన మంగళ వాయిద్యాలు వైఖాన స్తోత్రాల వేద పఠనం, భక్తజనుల గోవింద నామ స్మరణలతో మండపం మారుమోగుతుండగా కళ్యాణ యాగ్నీకులు ప్రధాన అర్చకులు శ్రీమాన్ దీవి అనంతపద్మ నాభచార్యులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఉత్సవమూర్తులను పెళ్లి పీటల మీద ఆశీలను గావించారు. కళ్యాణ వ్యాఖ్యాతగా గుంటూరు హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమాన్ దీవి నరసింహ దీక్షితులు వ్యవహరించారు.

వివాహ వేడుకలు గురువారం అర్ధరాత్రి దాటి శుక్రవారం వేకువజామున ప్రారంభ‌మైంది. ముందుగా శ్రీవారికి పాదుకులను కడిగి మధుపర్క నివేదన చేశారు. అనంతరం శ్రీ స్వామివారికి ఉభయ దేవీరులకు రక్షాబంధనం గావించారు. శుభప్రద్యుడు స్వభావ, లావణ్య రత్నాకరుడు అఖిల లోక పవిత్ర గోత్రుడు అయిన శ్రీ మహా విష్ణువు కోసం బృగు మహర్షి సంకల్ప తనయ భార్గవ గోత్రజ అయిన శ్రీదేవిని, కశ్యప ప్రజాపతి సంకల్పత తనయి కాశ్యపస గోత్రమైన భూదేవిని పెళ్లి కుమార్తెలుగా సంకల్పించి కన్యావరణాలు జరిపించారు.

తదుపరి స్వామి వారి కర కమలములతో అమ్మవార్లకు, అమ్మవార్ల కరకమలములతో స్వామివారి శిరస్సుపై జీలకర్ర, బెల్లం ఉంచారు. కన్యాం కనక సంపన్నo అంటూ పురోహితా చార్యులు మహా సంకల్పాన్ని పటిస్తూ కన్యాదానం చేశారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన మహిళలందరికీ జన్మజన్మలకు సువాసినీ జన్మ కలగాలని కోరుతూ మాంగల్య పూజలు నిర్వహించారు. అనంతరం భక్త కోటి కరతాల ధ్వనుల నడుమ వేదఘోష జరుగుతుండగా లోక కళ్యాణం కోసం శ్రీవారి తరుపున అర్చక స్వాములు అమ్మవార్లకు మాంగల్య ధారణ గావింప చేశారు. ఆ వెంటనే శ్రీ స్వామివారికి యజ్ఞోపవీత ధారణ చేశారు. శ్రీ స్వామి వారి తరఫున శేకూరు గ్రామ వాస్తవులు వాసిరెడ్డి జయ దత్తు, ప్రభునాథ్ లు కళ్యాణ మహోత్సవానికి శాశ్వత కైంకర్య పరులుగా వ్యవహరించారు.

అమ్మవార్ల తరఫున మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సేవా సంఘం ప్రతినిధులు అవ్వారు శరత్ బాబు నూతన వధూవరులకు మధుపర్కాలు మంగళ సూత్రాలను సమర్పించారు. యాగ్నిక బ్రహ్మగా దేవి తిరుమల సత్యప్రసాద్ వ్యవహరించారు మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు. దీంతో కళ్యాణ వేదిక ప్రాంగణం భక్తులతో క్రిక్కిరిసిపోయింది.

కళ్యాణ మహోత్సవానికి నారా లోకేష్ దంపతులు ….

ఈ శ్రీ లక్ష్మీనరసింహుని పుణ్యక్షేత్రంలో ప్రధాన ఘట్టమైన కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మిని దంపతులు హాజరై తిలకించారు. లోకేష్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ , బ్రాహ్మణి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వాళ్లకు పట్టు వస్త్రాలను సమర్పించి కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.

కళ్యాణ మహోత్సవంలో పట్టణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుత్తికొండ ధనుంజయరావు సహాయ కార్యదర్శి మునగపాటి వెంకటేశ్వరరావు సభ్యులు తిరువీధుల కిరణ్ దామర్ల మోహన్ తదితరులు కూర్చున్నారు. చివరగా అక్షత రూపనలు ఉత్సాహ పూరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు, అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, పరాశరం బలరామ కృష్ణమాచార్యులు వేదాంతం వేణుగోపాల వాసుదేవా భట్టర్ తదితరులు సహకరించారు. కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కార్య నిర్వహణ అధికారి సహాయ కమిషనర్ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్ల ను పర్య వేక్షించారు. ఇంకా ఈ కళ్యాణ మహోత్సవానికి టిడిపి నేతలు నందo, అబద్దయ్య, పోతినేని శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకి దేవి, గోవాడ రవి ఇంకా పలువురు కూటమి నేతలు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐలు ఎస్సైలు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *