హైదరాబాద్ – ఏప్రిల్ నెలలో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు చెప్పారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘గద్దర్ అవార్డులకు సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యాయి. పైడి జయరాజ్, కాంతారావు పేరుతో గౌరవ పురస్కారాలు అందించనున్నాం. తెలుగుతోపాటు ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ సినిమాకు బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వనున్నాం. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకూ విడుదలైన చిత్రాల్లో ప్రతి ఏడాది ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. 2024కు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులతో పాత రోజుల్లోని అవార్డుల ప్రక్రియనే కొనసాగించనున్నాం. ఏప్రిల్‌లో ఈ కార్యక్రమాన్ని వైభవంగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. గతంలో సింహా అవార్డుల కోసం దరఖాస్తుదారులు ఎఫ్డీసీకి కొంత డబ్బు పంపించినట్లు తెలిసింది. ఆ డబ్బును వారికి ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తాం. సినిమా అవార్డుల విషయాన్ని వివాదం చేయొద్దు. దీనిని ప్రతి ఒక్కరూ పాజిటివ్‌గా అనుకుని విజయవంతం చేయాలి. అప్పుడే ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకోగలం’’ అని ఆయన కోరారు
Cinema Awards | ఏప్రిల్ లో గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవం – దిల్ రాజు
