Crime News | కర్నులులో దారుణం..

Crime News | కర్నులులో దారుణం..
Crime News, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : సినిమాల్లోనే కనిపిస్తాయనుకున్న క్రూరమైన ప్రతీకార కథలు వాస్తవ జీవితంలోనూ ఎలా చోటుచేసుకుంటున్నాయో కర్నూలు నగరంలో ఇటీవల జరిగిన ఈ ఘటన తీవ్రంగా చాటిచెప్పింది. ప్రేమ విఫలమైందన్న కక్షతో, మాజీ ప్రియుడి పై కోపాన్ని అతడి భార్య(ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ )పై తీర్చుకునే ప్రయత్నంగా మారిన ఈ దాడి సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కర్నూల్ డి.ఎస్.పి బాబు ప్రసాద్ వెల్లడించిన మేరకు .. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన ఓ వైద్యులు మాజీ ప్రియురాలు బి. బోయా వసుంధర (34) తన మాజీ ప్రేమికుడి భార్య పై వైద్యం పేరుతో హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడించారు. ఈ కేసులో వసుంధరతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ప్రేమ నుంచి ప్రతీకారం దాకా..
పోలీసుల వివరాల ప్రకారం, వసుంధర గత తొమ్మిదేళ్లుగా తన మాజీ ప్రియుడి (డాక్టర్ )తో ప్రేమలో ఉన్నప్పటికీ, అతడు మరో మహిళను వివాహం చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ప్రేమ విఫలమైతే విడిపోవడం సహజమే అయినా, దానిని ద్వేషంగా, ప్రతీకారంగా మార్చుకోవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తిగత విభేదాలు చివరికి నేర ప్రపంచంలోకి వెళ్లేలా చేయడం సమాజానికి ఆందోళనకరంగా మారుతోంది.
ప్లాన్ చేసిన దాడి..
ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో, ప్రైవేటు మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బాధితురాలు స్కూటీ పై వెళ్తుండగా, ముందుగా పథకం ప్రకారం ఆటోతో ఢీ కొట్టించారు. ప్రమాదం జరిగిన వెంటనే వసుంధర అక్కడికి చేరుకుని సహాయం చేస్తున్నట్టు నటించింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళ్తామంటూ ఆటోలో ఎక్కించిన సమయంలో, వైద్య సహాయం పేరుతో హెచ్ఐవి వైరస్ కలిగిన ఇంజెక్షన్‌ను సూది ద్వారా ఇచ్చినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. మానవత్వాన్ని ముసుగుగా ధరించి, నమ్మకాన్ని ఆయుధంగా మార్చిన ఈ చర్య పోలీసుల దృష్టిలో అత్యంత ఘోర నేరంగా మారింది.
వైరస్ ఇంజెక్షన్ వెనుక అసలు కథ..
విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల నుంచి ‘రిసెర్చ్ అవసరం’ పేరుతో హెచ్ఐవి-ఇన్ఫెక్టెడ్ రక్త నమూనాలు సేకరించి, వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ రక్తాన్ని టీకా రూపంలో ఉపయోగించి బాధితురాలి పై దాడి చేయాలని నిందితులు పథకం రచించినట్టు వెల్లడైంది. ఇది కేవలం వ్యక్తిగత ప్రతీకారం మాత్రమే కాకుండా, ప్రజారోగ్యానికి కూడా తీవ్రమైన ముప్పుగా మారే చర్యగా పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితి – వైద్యుల అభిప్రాయం..
వైద్యుల అభిప్రాయం ప్రకారం, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన రక్త నమూనాల్లో వైరస్ పూర్తిగా సజీవంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, సూది ద్వారా శరీరంలోకి ఏ జీవి భాగమైనా ప్రవేశిస్తే.. ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందని తెలిపారు. బాధితురాలికి తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందిస్తున్నట్టు అధికారులు చెప్పారు.
పోలీసుల విచారణ..
ఈ ఘటన పై బాధితురాలి భర్త (డాక్టర్) కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో నలుగురు నిందితులు అక్కడ ఉన్నట్లుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కర్నూలు చెందిన (డాక్టర్ మాజీ ప్రియురాలు )బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి, ఆదోనికి చెందిన కొంగె జ్యోతి, మంత్రాలయంకు చెందిన భూమా జశ్వంత్, భూమా శృతిలను నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకు న్నారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల్లో వసుంధర అనే మహిళ నర్సుగా పని చేస్తోంది. ఆమె గతంలో ఓ డాక్టర్‌ను ప్రేమించింది. అయితే ఆ డాక్టర్ వసుంధరను కాదని వైద్యురాలిని పెళ్లి చేసుకున్నాడు.
దీంతో వసుంధర తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న వైద్యురాలి పై ద్వేషం పెంచుకుంది. ఆ వైద్యురాలికి హెచ్ఐవీ ఇంజెక్షన్ చేయాలని ప్లాన్ వేసింది. ఇందుకు ఆమె ఇతర నిందితుల సహకారం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్ఐవీ పేషెంట్ల నుంచి ఇతర నర్సుల సహకారంతో హెచ్ఐవీ వైరస్‌తో కూడిన రక్తాన్ని సేకరిం చింది. ఆ రక్తాన్ని సదరు వైద్యురాలి పై ఇంజెక్షన్ రూపంలో ప్రయోగించింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హెచ్ఐవీ పేషెంట్ల రక్తాన్ని ఇచ్చిన నర్సుల పైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ వెల్లడించారు. కేసు విచారణలో కర్నూలు త్రీటౌన్ సీఐ శేషయ్య, ఎస్ఐలు బాలనరసింహులు, ఆశాలత తదితరులు ఉన్నారు. అనంతరం నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. భారతీయ న్యాయ సంహితలోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, మరింత లోతైన విచారణ కొనసాగుతోంది.
సమాజానికి హెచ్చరిక.
ఈ ఘటన ప్రేమ అనే భావన ఎంత సున్నితమైనదో, అదే సమయంలో అది నియంత్రణ కోల్పోతే ఎంత కఠినంగా మారుతుందో చూపిస్తోంది. ప్రేమ విఫలమైతే ద్వేషంగా మారడం, ప్రతీకారంగా నేరాలకు దారి తీస్తే.. దాని పరిణామాలు కేవలం వ్యక్తులకే కాదు, సమాజానికీ ప్రమాదకరంగా మారతాయి. న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉంచి సమస్యలకు పరిష్కారం వెతకాల్సిన చోట, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వినాశనానికి దారి తీస్తుందన్న సందేశాన్ని ఈ ఘటన స్పష్టంగా ఇస్తోంది.
