AP | విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు బాధాక‌ర‌మే… నారా లోకేష్

వెల‌గ‌పూడి – ఆంధ్ర‌ప్ర‌భ : విద్యాసంస్థల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు మంత్రి నారా లోకేష్. పలు సమస్యలతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చ‌నిపోవ‌డం ఎప్ప‌టికీ చివ‌రి ప‌రిష్కారం కాద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. కళాశాల విద్యార్థుల ఆత్మహత్యలపై శాసనమండలిలో ఇవాళ‌ వైసీపీ ఎమ్మెల్సీలు వేసిన ప్రశ్నలకు ఆయ‌న స‌మాధానం చెబుతూ ర్యాగింగ్, ఒత్తిడి, ఫీజుల చెల్లింపు వల్ల ఎక్కువగా పిల్లలు ఆత్మహత్యలకు కారణాలవుతున్నాయన్నారు. పాఠశాల విద్యలోనూ మానసికంగా వేధిస్తున్నారనే అంశాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

కౌన్సెలింగ్ ఇస్తాం …
విద్యా వ‌త్తిడి తొల‌గించేందుకు, ఆత్మ‌హ‌త్య భావ‌న క‌లుగ‌కుండా ఉండేందుకు స్కూళ్లలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పిల్లల్లో విద్యాపరంగా ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలిపారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటుందన్నారు.

ఆత్మహత్యలపై నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపైనా ఉందని చెప్పారు. ఆత్మహత్యల విషయమై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందన్నారు. ప్రభుత్వం కంటే ప్రైవేటు విద్యాసంస్థలు బాగుంటాయనే ప్రచారం బయట ఉందని.. ఇది సరైనది కాదని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు 12లక్షల మంది పిల్లలు దూరమయ్యారని అన్నారు. చాలా మంది ప్రైవేటు విద్యా సంస్థల వైపు వెళ్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *