5thAprileditorial | ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ధరల భారం..

5thAprileditorial | ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ధరల భారం..
5thAprileditorial | ఔషధ కంపెనీలపై ముడి సరకు మరియు రవాణా ప్రభావం
ప్రాణరక్షణ మందుల ధరల పెరుగుదల
ఆహారధరలు మరియు నిత్యావసరాలపై యుద్ధ ప్రభావం
ద్రవ్యోల్బణం మరియు మార్కెట్ నిపుణుల హెచ్చరికలు
5thAprileditorial | ఇరాన్ యుద్ధం వల్ల ప్రజలపై ధరల భారం పడుతోంది. మొదట చమురు ధరలు పెరుగుతాయని భావించినప్పటికీ.. ఇప్పుడు ఆహారం, ఔషధాలు సహా అన్నిరంగాల పై ప్రభావం కన్పిస్తోంది. దీంతో ప్రజలు అల్లల్లాడుతున్నారు. నిజానికి పశ్చిమాసియా పరిణామాలవల్ల చమురు ధరల పై ప్రభావం ఎక్కువ ఉంటుందన్న ప్రచారం ముందు నుంచి జరుగుతుండటం వల్ల ఇటు ప్రభుత్వమూ, అటు ప్రజలు చమురు, గ్యాస్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం మొదలు పెట్టిన మాట నిజమే. కానీ, ఇప్పుడు ధరల పెరుగుదల అక్కడితో ఆగలేదు. తాజాగా ఔషధాల ధరలు పెరిగి పోవడం సామాన్యులు తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. ముడి సరకు ధరలు దాదాపు రెట్టింపు కావడం, రవాణా ఖర్చులు అధికం కావడం వల్ల గత నెలలో ఈ కంపెనీలు ఐదు వేల కోట్ల రూపాయిల నష్టానికి గురైనట్టు అంచనా. ఔషధాల ధరలు 25 శాతం పెరిగే ప్రమాదం ఉందని ఈ రంగానికి చెందిన వారు వాపోతున్నారు.

ప్రాణ రక్షణ మందుల ధరలు ఇప్పటికే చాలా పెరిగిపోయాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఔషధ కంపెనీలు గల్ఫ్ దేశాల నుంచి కెమికల్ సాల్వెంట్స్, కెమికల్ ఇంటర్‌మీడియట్స్, పాలిమర్స్ ను గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. ఔషధాల తయారీలో కీలకమైన ఐసో ప్రొఫైల్స్ వంటి వాటిని గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని ఈ రంగానికి చెందిన వాణిజ్యవేత్తలు తెలుపుతున్నారు. ఔషధ తయారీలో వినియోగించే మౌలిక రసాయనాల కోసం గల్ఫ్ దేశాల పైనే ఆధారపడుతున్నాయి. రవాణా చార్జీలు పెరిగిపోయి.. హైదరాబాద్‌కి చెందిన ఔషధ కంపెనీలు 400 కోట్లు పైగా నష్టాలను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. పారాసిట్‌మాల్ మందుల ధరలను 250 నుంచి 450 రూపాయిల వరకూ, నైమెసులైడ్ ధరను 425 నుంచి 650 రూపాయిల వరకూ పెంచారు. ఇన్స్యులిన్ వంటి మందుల వ్యయం భారంగా మారుతున్నదని ఆ కంపెనీల యజమానులు చెబుతున్నారు.
పాశ్చాత్యదేశాల నుంచి మన దేశానికి వైద్యం, చికిత్సల కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్నారు. యుద్ధం వల్ల ఔషధాల ధరలే కాకుండా, నిత్యావసరాల ధరలు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఆహార ధరలు ఫిబ్రవరితో పోలిస్తే, 2.4 శాతం పెరిగినట్టు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పేర్కొంది. చక్కెర ధరలు 7.2 శాతం, గోధుమల ధరలు 5.2శాతం, మొక్కజొన్న ధరలు కూడా బాగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలలో మొక్కజొన్న పంట అకాల వర్షాల వల్ల దెబ్బతింటున్నది. ఇథనాల్‌కి డిమాండ్ పెరిగింది. చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల రవాణా చార్జీలు బాగా పెరిగాయి. దాంతో వాటి ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి. యుద్ధం కొనసాగితే, సరఫరా గొలుసు దెబ్బతిని, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ ఆహారధరల సూచి ఆరునెలల గరిష్ఠ స్థాయికి పెరిగింది. రవాణా వ్యవస్థలో అంతరాయం వల్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే, బియ్యం ధరల పై ఆ ఖర్చుల ప్రభావం పడకపోవడం గమనార్హం. బ్యారల్ ధర వంద డాలర్లు కొనసాగితే వడ్డీ రేట్లు మరింత పెరగక తప్పదని అంటున్నారు. అలాగే, ఇంధనం ధరల ప్రభావం వల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గే ప్రమాదం ఉంది. మొత్తం మీద ఈ యుద్ధం ప్రభావం మన దేశంలో ధరల పై ఎక్కువగా ఉండవచ్చునని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

