కాంగ్రెస్ అభ్యర్థులను బారీ మెజార్టీతో గెలిపించండి

కాంగ్రెస్ అభ్యర్థులను బారీ మెజార్టీతో గెలిపించండి

ఓటర్లకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పిలుపు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం..
పట్టణాన్ని అన్ని విధాలా డెవలప్ చేసే బాధ్యత నాది

బెల్లంపల్లి – (ఆంధ్రప్రభ): బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి కోరారు. సోమవారం ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా పలు వార్డుల్లో చేపట్టిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులతో కలిసి ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలోని 34 వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్యే ప్రసంగించారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచార సభల్లో ఆయన పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ప్రచార సభల్లో ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. గత పదేళ్ల కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు బెల్లంపల్లి అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని దుయ్యబట్టారు. పట్టణంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలను కూడా పట్టించుకోకుండా, ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన బీఆర్ఎస్ నాయకులకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. “కాంగ్రెస్ వస్తేనే బెల్లంపల్లి డెవలప్ అవుతుంది.. బీఆర్ఎస్ పాలనలో పట్టణం పదేళ్లు వెనక్కి వెళ్లింది” అని ఆయన ఘాటుగా విమర్శించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజల సంక్షేమం కోసం అనేక మార్పులు చేపడుతోందని వినోద్ గుర్తు చేశారు. బెల్లంపల్లి పట్టణ రూపురేఖలు మారాలంటే, మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. 34 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి.. బెల్లంపల్లిని అన్ని విధాలా అభివృద్ధి చేసి, రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను” అని ఓటర్లకు హృదయపూర్వక హామీ ఇచ్చారు. ముఖ్యంగా 3వ వార్డు అభ్యర్థి పొరండ్ల సత్యవతి, 17వ వార్డు అభ్యర్థి రాగం శెట్టి సత్యనారాయణ, 18వ వార్డు అభ్యర్థి తస్లీనా సుల్తానా బేగంలను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు. . వార్డుల వారీగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కావాలంటే ‘చేతి గుర్తు’కు ఓటు వేయడం ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వినోద్ కోరారు. ఫిబ్రవరి 13న వెలువడే ఫలితాల్లో బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులుముచ్చర్ల మల్లయ్యతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, లీడర్లు పాల్గొన్నారు.

Leave a Reply