29MarSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

29MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

29MarSunday2026
29MarSunday2026

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

29MarSunday2026 |ఈ సంచికలో…

1. ఏప్రిల్ ఫూల్స్ డే.. నవ్వుల మైండ్ గేమ్! (ముఖచిత్ర కథనం)

2. కబుర్లు (శీర్షిక)

3. సన్నిహితం(శీర్షిక)

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

5. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-

ఏప్రిల్ ఫూల్స్ డే.. నవ్వుల మైండ్ గేమ్!

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అందరికీ అమ్మో ఒకటో తారీఖు సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో సామాన్యుడు ప్రతి నెలా ఒకటో తారీఖుకి భయపడుతుంటాడు. అందరూ అన్ని నెలల ఒకటో తారీఖులకి భయపడినా, పడకపోయినా, ఏడాదిలో ఒక్కనెల…అదే రాబోయే ఏప్రిల్ నెల ఒకటో తారీఖుకి మాత్రం తప్పక భయపడతారు. ఆరోజు ఉదయం నుంచే కాస్త అప్రమత్తంగా ఉంటారు.

ఎంత అప్రమత్తంగా ఉన్నా, ఎవరో ఒకరి చేతిలో ఏప్రిల్ ఫూల్ అయిపోక తప్పదు….”అబ్బా, ఈసారి ఇలా కాదు, ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి” అనుకుంటారు…మళ్ళీ ఇంకోచోట, ఇంకోవిధంగా…మొత్తానికి ఆల్ ఫూల్స్ డే కేవలం మన వల్లే సార్థకం అయిపోయిందా అనిపించేట్లు.. అయినవాళ్ళందరి చేతిలోనో, కొందరి చేతిలోనో ఏప్రిల్ ఫూల్ అయిపోక తప్పదు….

ఏప్రిల్ 1 ఒక మైండ్ గేమ్ తో గడిచిపోతుంది. ఒక చిన్న అబద్ధం, ఒక పెద్ద నవ్వు, ఒక చిన్న మోసం,ఇవన్నీ కలిసిన రోజు ఇది.

ఈ పండుగ అసలు ఎక్కడ మొదలైందో ఖచ్చితంగా తెలియదు. కొందరు ఫ్రాన్స్‌లో మొదలైందంటారు, ఇంకొందరు రోమన్ల కాలంలో అంటారు. నిజానికి చూస్తే… ఈ పండుగను మొదటగా ఎవరు జరుపుకున్నారు అనేదే ఒక పెద్ద ఏప్రిల్ ఫూల్ కథలా అనిపిస్తుంది.

ఏదేమైనా, ప్రపంచం మొత్తం ఈ రోజున ఒకే విధంగా ఆలోచిస్తుందా అనిపిస్తుంది. ఎవరో ఒకరు ప్లాన్ చేస్తారు… మరెవరో అమాయకంగా నమ్ముతారు. ఆ నమ్మకమే ఈ పండుగకు అసలు పునాది.

ఇంట్లో చిన్న చిన్న ప్రాంక్స్‌తో మొదలయ్యే ఈ ఆట, ఆఫీస్‌లకు వెళ్లే సరికి మరింత కొత్తగా మారుతుంది. “ఈరోజు మీకు ప్రమోషన్ వచ్చింది” అని హెచ్ ఆర్ నుండి మెసేజ్ రావచ్చు. ఆనందంతో ఎగిరి గంతేసే లోపే “ఏప్రిల్ ఫూల్!” అని చివర్లో జోడించవచ్చు.

ఏప్రిల్ ఒకటిన సోషల్ మీడియా అయితే పూర్తిగా ఇదే పనిలో ఉంటుందా..అనిపిస్తుంది. “ఫ్రీ డేటా, ఫ్రీ పెట్రోల్, ఫ్రీ గోల్డ్” అంటూ ఎవరో పెట్టిన పోస్టులు తెగ వైరల్ అవుతాయి. చదివిన వాళ్లు రెండు సెకన్లు కూడా ఆలోచించకుండా షేర్ చేస్తారు. తర్వాత ఎవరో కామెంట్ చేస్తారు “బ్రో.. ఇది ఏప్రిల్ ఫూల్!” అని. అప్పుడు వైరల్ చేసిన వాళ్ళు కాస్తా గప్ చుప్ అయిపోవచ్చు…అయినా అప్పటికే ఏప్రిల్ ఫూల్ అయిపోయినట్టేగా?

ఇక ఈ విషయంలో మీడియా కూడా ఏమీ తక్కువ కాదు. కొన్ని వెబ్‌సైట్లు విచిత్రమైన వార్తలు పెడతాయి. “చంద్రుడిపై కొత్త నగరం” లేదా “రోజుకు పది గంటలు నిద్రపోతే జీతం పెరుగుతుంది” లాంటి హెడ్డింగ్స్ చూసి క్షణం పాటు నమ్మేసే వాళ్లు చాలా మంది ఉంటారు.

ఈ రోజున ఎవరు ఎవరి చేతిలో ఫూల్ అవుతారు అన్నది కచ్చితంగా చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో, ఏదో ఒకరికి ఫూల్ అవుతాం. కొందరు ఉదయాన్నే అవుతారు, కొందరు సాయంత్రం వరకు ఆగుతారు!

అసలు ఈ సరదా పండుగ మనకు చెప్పే విషయం చాలా సింపుల్. మనం వినాలనుకున్నదే నమ్ముతాం. నిజం కంటే ఆసక్తికరమైన అబద్ధం మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. అందుకే ఈ రోజున అబద్ధాలు కూడా సెలబ్రేట్ అవుతాయి.

మరో కోణంలో చూస్తే… ఇది సమాజానికి ఒక చిన్న హెచ్చరిక. ఫేక్ న్యూస్, అ(ర్ధ)సత్యాలు, సోషల్ మీడియాలో వచ్చే అపోహలు, ఇవి అన్నీ ఏప్రిల్ ఫూల్స్ డే లోనే కాదు, ప్రతిరోజూ మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ఒక్క రోజున మాత్రం మనం వాటిపై నవ్వుకుంటాం.

ఏ ఒక్కరో ఫూల్స్ కారు. అందుకే ఇది “ఆల్ ఫూల్స్ డే”

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

2 కబుర్లు (శీర్షిక)

DEC 2025

రావణాసురుడి మంచి లక్షణం

రామరావణ యుద్ధం చివరి దశకు చేరుకుంది. రాముడి బాణం తగిలి రావణుడు నేలకొరిగాడు. మరికొద్ది నిమిషాల్లో రావణుడు ప్రాణాలు విడవబోతున్నాడు. ఆ సమయంలో రాముడు లక్ష్మణుడిని పిలిచి “లక్ష్మణా! రావణుడు మహా పండితుడు, రాజనీతిజ్ఞుడు. అతను చనిపోతే ఆ విద్య అంతా అతనితోనే అంతమైపోతుంది. ఆయన దగ్గరకు వెళ్ళి , లోకానికి పనికొచ్చే ఏదైనా మంచి మాట నేర్చుకో.”అన్నాడు.

లక్ష్మణుడు వెళ్ళి రావణుడి తల వైపు నిలబడి, “ఓ రావణా! మా అన్నయ్య పంపారు, ఏదైనా నీతి వాక్యం ఉంటే చెప్పు” అన్నాడు.

రావణుడు కళ్ళు తెరిచి లక్ష్మణుడిని చూసి, ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు.

లక్ష్మణుడు కోపంతో తిరిగి వచ్చి, “అన్నయ్యా! ఆ రావణుడు అహంకారం ఇంకా తగ్గలేదు, నేనడిగితే సమాధానమే చెప్పలేదు” అన్నాడు.

రాముడు నవ్వి, “లక్ష్మణా! ఎవరి దగ్గరైనా విద్య నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వారి తల దగ్గర కాదు, పాదాల దగ్గర వినయంగా నిలబడాలి. జ్ఞాన సముపార్జనకు వినయం అవసరం !” అన్నాడు.

లక్ష్మణుడు తప్పు తెలుసుకుని, ఈసారి రావణుడి పాదాల దగ్గర వినయంగా నిలబడ్డాడు. అప్పుడు రావణుడు కళ్ళు తెరిచి ఒక అద్భుతమైన మాట చెప్పాడు:

“లక్ష్మణా! రాముడికి, నాకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? ఇద్దరం సమానమైన వీరులమే, సమానమైన బలం ఉన్నవాళ్ళమే. కానీ రాముడు తన మనసును గెలుచుకున్నాడు, నేను నా మనసుకి దాసుడినయ్యాను. అందుకే ఆయన గెలిచాడు, నేను ఓడాను.”

రావణాసురుడి వారసులు నేటికీ మన చుట్టూ కనిపిస్తుంటారు. చావు ముందైనా తన తప్పును గుర్తించి నిజాన్ని ఒప్పుకోవడం రావణుడి విజ్ఞత. రావణుడు నుంచి అహంకారాన్ని పుణికి పుచ్చుకున్న వారు ఆ అసురుడిలోని మంచి లక్షణాన్ని కూడా గుర్తించి అనుసరిస్తే చాలు.. ప్రపంచవ్యాప్తంగా పెచ్చరిల్లుతోన్న ఘర్షణలకు తావు ఉండదు.


———————————————————————-


3.సన్నిహితం… శీర్షిక

DEC 2025

సంతకం

మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఒక్కోసారి మనం నిందలు పడాల్సి వస్తుంది. అంతే కాకుండా వాళ్ళు మనమీదకు గొడవకు కూడా రావచ్చు. తీరా ఆ విషయాన్ని తరచి చూస్తే చివరకు మన తప్పు ఏమీ లేదని తేలుతుంది. అలాగే ఇతర సమస్యలు కూడా వస్తాయి.
దీనికి చిన్న ఉదాహరణ చెబుతాను. నా దగ్గర పని చేసే ఒక కాంట్రాక్ట్ కుర్రాడు ఏదో ఫైనాన్స్ సంస్థలో చిట్టీ కడుతున్నాడు. అప్పుడు ఏదో అవసరం అయితే కొన్ని నెలలు కట్టాక ఆ చిట్టీ పాడి మొత్తం డబ్బులు తీసుకున్నాడు. ఆ సందర్భంలో నేను , ఇంకో కొలీగ్ ష్యూరిటీ సంతకాలు పెట్టాము.


తీరా కొన్ని రోజుల తర్వాత ఆ కుర్రాడు పని మానేశాడు.పోనీలే అనుకున్నాము. మేము పెద్దగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత మా ఆఫీసు ఫైనాన్స్ గ్రూప్ నుండి నా కొలీగ్ కు ఫోన్ వచ్చింది. విషయం ఏమిటంటే జాబ్ మానేసిన ఆ కుర్రాడు ఇంతకు ముందు చిట్టీ పాడాడు కదా.అయితే ఆ తర్వాత నెల నెలా డబ్బులు కట్టడం లేదట. అందుకే ఆ ఫైనాన్స్ సంస్థ వాళ్ళు ష్యూరిటీ సంతకం పెట్టిన నా కొలీగ్ జీతం నుండి డబ్బులు రికవరీ పెట్టమని కోర్టు ఆర్డర్ మా ఆఫీస్ కు పంపారు .షాక్ అయ్యాం మేము ఆ లీగల్ లెటర్ చూసి. ఈ సందర్భంగా నా కొలీగ్ నన్ను అపార్థం కూడా చేసుకున్నాడు.

నాకు కాకుండా కోర్టు ఆర్డర్ అతనికి మాత్రమే రావడంలో ఏదో కుట్ర ఉందని , నేను ఆ జాబ్ మానేసిన కుర్రాడు కలిసి ప్లాన్ చేసి ఇలా డబ్బులు కొట్టేశాం అని నా మీద గొడవకు వచ్చాడు.హతాశుడనయ్యాను నేను.
మంచి కోసం ఆలోచించి ఆ కుర్రాడికి సంతకం పెట్టడం నా తప్పు అని అర్థం అయింది. నమ్మకం గా ఉన్నాడు కదా అని సంతకం పెడితే అది మా పీకల మీదకు వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా నాకు కూడా కోర్ట్ ఆర్డర్ రావడంతో నా కొలీగ్ శాంతించాడు. కుట్ర లేదని నమ్మాడు.తర్వాత ఏవో తంటాలు పడి ఆ సొమ్ము చెల్లించాం ఇద్దరం. కానీ జన్మలో ఎవరికీ ష్యూరిటీ సంతకం చెయ్యకూడదు అన్న జీవిత పాఠం నేర్చుకున్నాం ఈ దెబ్బతో .మీరు కూడా ఇలా సంతకాలు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ !!!

====================================

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

పిల్లల ఆటలా ఏమిటి ఈ యుద్ధం?!

మనిషి తన చేతలతోనే గొప్పవాడవుతాడు. జన్మత: కాదు! – చాణక్యుడు

ఈ పొడుపు కథ విప్పండి! ఎంత కురిసినా వరదలు రావు! ఏమిటిది? కన్నీళ్లు!

ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల ఎంత కన్నీరు ఈ భూమిపై ఇంకుతోందో! కనిపించని రక్త సముద్రాలు సృష్టి….! రాక్షస నీడల గొడుగులు! ఏ దేశం జీవితం భద్రం ఇప్పుడు? శాంతి ఎక్కడ?

పిల్లలు పెద్దలు ఏమిటి వ్యత్యాసం! Gen Z and Gen Alpha, or Millennials?!

ఒక సరదా మాటతో మొదలు పెడితే….,

అప్పట్లో పెద్దలను గౌరవించడం అంటే లేచి నుంచోవడం. ఇప్పుడు ఇయర్ ఫోన్స్ చెవుల్లోంచి తీస్తే చాలు గౌరవించినట్టే!

పిల్లలు సిల్లీ గా కొట్టుకుంటారు! ఆటల్లో, పాటల్లో, మాటల్లో వారి సమస్యలు, complaints చాలా చిన్నవి, విలువ లేనివి అని మన ఉద్దేశ్యం!

పిల్లల యుద్ధాలు దెబ్బలాటలు వారి వరకు అవి నిజం. సీరియస్! ఒక పిల్లవాడు ఇంకో పిల్లవాడి బొమ్మ పగలగొడితే, వీడు ఆ పిల్లవాడు బొమ్మ నేలకేసి విసిరి కొడతాడు! వారి కోపం, ఉడుకుమోతు తనం అంత తీవ్రంగా ఉంటాయి!

ఒక మెచ్యూరిటీ వచ్చాకా, ఆ చిన్నప్పటి తగాదాలు గుర్తుకు వస్తే మనం నవుకుంటాము! కొన్నిటికి ఆశ్చర్య పోతాము! మరీ అంత దిగజారుడు తనంతో ప్రవర్తించామా?! కొన్నిటికి సిగ్గు పడతాము! టచ్ లో ఉన్న స్నేహితులకు క్షమాపణలు చెబుతాము!

అన్నా చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు…, కజిన్స్ అందరి మధ్య చిన్నప్పుడు ఈ గిల్లికజ్జాలు ఉంటాయి! పెద్దలకు పితూరీలు చెప్పుకుంటారు! ఎన్నో పిల్లల గొడవలు ఉంటాయి!

అంటే చిన్నప్పుడు కొన్ని విషయాలలో విజ్ఞత ఉండదు! పెద్దయ్యాకా విజ్ఞత, పరిపక్వత వస్తాయి అని లోకం నమ్మకం! మన నమ్మకం! కొందరు మనుషులు ఎదగరు! మరికొందరు మానసికంగా ఎదగరు!

దేశాధినేతలే మానసికంగా ఎదగకపోతే, వారి చేతుల్లో క్షిపణులు, మారణాయుధాలు, అణ్వస్త్రాలు ఉంటే?!

పిల్లలు టెడ్డిబేర్స్, బొమ్మల కారులను, Toys ను విరగగొట్టుకుని, పగలగొట్టుకున్నట్లు…., ఒక దేశం ఇంకో దేశం ఆస్తులను, చమురు శుద్ధి కేంద్రాలను, పెద్ద పెద్ద బిల్డింగ్స్, skyscrapers వీటి మీద డ్రోన్స్, ప్రయోగించి నాశనం చేసుకుంటున్నారు అంటే…ఏం అనాలి!

మతం మూర్ఖత్వంతో ఎందరో, జాత్యహంకారంతో కొందరు, వయసులు పెరిగాయి! కానీ బుద్ధి లేదు, రాలేదు!

మతం మత్తుతో, ఇంకో మతం, నమ్మకాలపై ద్వేషం, చిన్న చూపు! ఐదు వందల ఏళ్ల క్రితమే, కాశీ విశ్వనాథుడు గుడి పక్కన మసీదు కట్టారు అంటే ఎంత ఘోరం, దాని వెనుక ఉద్దేశాలు!? ఎంత హీనపరిచారు ఇంకో మతాన్ని! ఎవరిని రెచ్చగొట్టడానికి! ఇంకా ఇప్పటికీ కాశీలో గుడి పక్కన మసీదు అలాగే ఉంది! ఇంచుమించు గుడి క్షేత్రంలోనే!

ఒకప్పుడు చేతిలో అధికారం ఉంటే, తాను నమ్మిన మతాన్ని జనంపై రుద్దారు! ఆశ చూపి, ప్రలోభ పెట్టీ, లేదా భయపెట్టి….!

సైన్యం, అధికారం ఈ భూమి పై చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు! గతమంతా తడిచే రక్తమున, కాకుంటే కన్నీలులతో…కవిత్వం, చరిత్ర చదివాము!

Barbarien culture, అనాగరిక సంస్కృతి! మనం ఎదిగాము, ఒక నాగరిక ప్రపంచంలో ఉంటున్నాము అనుకుంటున్నాము!

కానీ నేడు చూడండి! కొన్ని లక్షల మంది కార్మికుల శ్రమ, ఈ మధ్య ప్రాచ్య దేశాలు, ద్వీపాలలో చమురు సంపద! అక్కడ ఉన్న Logistics, చమురు శుద్ధి చేసే యంత్రాలు, అది ప్రపంచ ఆస్తి!

అలాగే అడవి ఎక్కడ ఉన్నా అది ప్రపంచ ప్రజల సొంతం! ఇది నా దేశంలో ఉంది కాబట్టి నేను ఈ లక్ష ఎకరాల అడవులను నరికి కాక్రీటు నగరం కట్టుకుంటాను అంటే కుదరదు! ఇది అన్ని ప్రకృతి వనరులకు వర్తిస్తుంది! భూమిపై గీతాలు గీసి విడగొట్టుకుని దేశాల పేర్లు, సైన్యం, ఆంక్షలు, వీసాలు, అని దూరం జరిగారు!

గాలి, మబ్బు, ఆకాశం, అడవుల నుంచి కదిలే ఆక్సీజన్….వీటిని ఆపగలరా?!

ప్రపంచ నీతి సూత్రాలు మారాలి! మతం, దేవుడు, మూఢ నమ్మకాలు, మితి మీరిన అజ్ఞానం…అన్నీ పునంసమీక్షించాలి! మొహమాటం లేకుండా!

లేకపోతే ఏమిటిది?

చిన్న పిల్లలు ఆట వస్తువులను విరుచుకుంటున్నట్టు, పాడు చేసుకుంటున్నట్టు…, ఇలా ఎలా పాడు చేసుకుంటున్నారు!

కసి, కచ్చి, కోపం, పగ, పంతం, అంతం, నా సొంతం, అది నీది కాదు నాది, నువ్వు నా మాట వినాలి, విని తీరాలి…ఇలాగా మానవ ప్రగతి ప్రయాణం! ఎంత దారుణం, ఎంత హీనం!

ఎలా దిగజారిపోయాయి? దేశం చరిత్రలు, మతం మత్తు చరిత్రలు! విశాల దృక్పథం వైపు మానవ జాతి ఎదగదా? నడవదా?

మరీ ఇంత … మరగుజ్జులమై ఉన్నామా! సిగ్గు లేని బ్రతుకులు కావా మనవి!?

ఈ యుద్ధం వల్ల, జరిగే ఐదు ప్రధాన నష్టాలు, 1. మానవ ప్రాణ నష్టం, మానవ విలువలు, మానవతా సంక్షోభం, 2. ప్రపంచ ఆర్థిక అస్థిరత, 3. ఇంధన సంక్షోభం, 4. మౌళిక సదుపాయాలు, పర్యావరణం నష్టం, భవనాలు, రహదారులు, ఆసుపత్రులు ధ్వంస మవుతున్నాయి, పర్యావరణం కాలుష్యం పెరుగుతోంది! 5. ప్రపంచ భద్రతకు ముప్పు(యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది).

మరి పరిష్కారం?!

చర్చలు, యుద్ధ విరమణ(Ceasefire), అన్నిటినీ మించి పరస్పర గౌరవం, ఇచ్చిపుచ్చుకునే ధోరణికి దూరమైన దేశాలు…, మళ్ళీ వాటిని ప్రేమతో కొనసాగించాలి!

వెంటనే యుద్ధం ఆగాలి! పిల్లల ఆటలా ఏమిటి ఈ యుద్ధం? వీడియో గేమ్, తెరపై సరదాగా జి జి జి …అంటూ తుపాకులు కాల్చుకుంటూ…పిల్లలు లెవెల్ వన్, లెవెల్ టూ, Points & Immunity అని కొందరు చోద్యం చూస్తున్నారు! ఇంకొందరు WWF Fight అనుకుంటున్నారు! యుద్ధం మీ ఇంటికి వచ్చేసి చాలా కాలం అయ్యింది మిత్రమా! పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగానే నువ్వు ఇప్పుడు యుద్ధంలో ఉన్నావు! పక్క ఇల్లు కాలుతుంటే కొందరు చుట్ట వెలిగించుకుంటారు! ఇప్పుడు కాలుతున్న, కలుస్తున్న చుట్ట రెండూ ఒక్కటే అయిపోయాయి!

జరగబోయేది అల్లకల్లోలం, యుద్ధం ఆగక పోతే! ఈ క్షణమే ఆగాలి!

మన దేశంలో రాష్ట్రాల ఎన్నికలు అయ్యాకా, అప్పుడు తెలుస్తాయి అసలు నిజాలు! ఇప్పటికే తీవ్ర వేడితో, గ్యాస్ సంక్షోభం….! ముందుంది ముసళ్ల పండగ! పండగ అనే పదం వాడడం నేరం కూడా!

ఎన్నికలు అయ్యాకా, అంతర్యుద్ధం మొదలు అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు! ఆకాశ క్షేత్రాలు, విమానాలు, డ్రోన్లు, అణుబాంబులు…, ఏమో బయో వెపన్స్ వాడినా ఆశ్చర్య పోనక్కర్లేదు! జీవాయుధాలు బయటకు వస్తే, అణుబాంబు కన్నా ప్రమాదం! కళ్ళు మూసుకుని, ముక్కు మూసుకుని జపం చేసుకునే సమయం, సందర్భం కాదు ఇది!

ఈ యుద్ధం వల్ల కరోనాను మించిన లాక్డౌన్ రాబోతోంది! ఇన్నాళ్లు పేదలు, ధనికులు మధ్య ఎంతో తేడా ఉన్నా కూడా, పేదలకు తిండి బట్ట దొరికి ఏదో షో రన్ అవుతోంది ఈ భూమి మీద!

ధనవంతుల దౌర్జన్యాలు, బలవంతుల పన్నాగాలు…, తెర వెనుక, చాప కింద నీరులా, గోడ వెనుక గప్ చుప్ గా నడిచి పోయింది! మాఫియా, కార్పొరేట్ క్రౌర్యం ఎంత ఉన్నా సామాన్యుల కూడా బ్రతుకుతున్నారు! ఐదు రూపాయల అన్నం, ఒకప్పుడు గంజి కేంద్రాలు!

ఆరు నెలలు లేదా సంవత్సరం తర్వాత దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో…., దెబ్బ తిన్న దేశాల ప్రజల ప్రతీకారం…., ఎన్ని అంతర్యుద్ధాలకు దారి తీస్తుందో కొందరే ఊహించ గలరు!

All is well with the world అనుకుని నిద్ర పోవాలంటే…, ఇంకో వందేళ్లు పడుతుందేమో, అదీ ప్రపంచం సరైన దారిలో నడిస్తేనే సుమా!

లేదా….

మా దేవుడు నిజం దేవుడు, మీ దేవుడు అబద్దం, సైతాను, మీరు కాఫిర్ లోగ్, ఇలా దేవుడు అనే వ్యక్తిగత, లేదా సామూహిక నమ్మకాన్ని ఒక అమ్మకం వస్తువులా, లేదా ఒక బ్రాండ్ లా చేసేసి ఆడుకుంటే, అమ్ముకుంటే……, అజ్ఞానం, అహంకారం, మూర్ఖత్వం … ద్వైతం నాశనం వైపే ప్రయాణం చేస్తాయి!

Cure is better than disease అంటారు కదా! ఈ అక్షరాలను ఒక హెచ్చరిక లా చూసి మేలు కుందాము! అహంకారం, మతం కుళ్ళు లెక్కలు ఇప్పుడు వద్దు! మాట్లాడుకుందాం! శాంతి చర్చలు జరగాలి! బాంబులు కొన్నాళ్ళు మీ పెరడులో దాయండి! ప్రతీకారంతో ఒకరి మీద ఒకరు వేసుకునే పని ఆపండి! యుద్ధం పేరుతో చలి కాచుకునే రాక్షస క్రీడ వొద్దు!

వెంటనే యుద్ధం ఆగాలి! ఈ అక్షరాలు శాంతి సందేశం! ప్రపంచం అంతా పంపించండి! భూమి అంతా ఒకే మానవ జాతిగా ఐక్యం అయ్యి శాంతి శాంతి శాంతి అంటూ సంస్కారంతో ఏకం అవుదాము! Actions speak louder than words, చేతలతో దేశాధినేతలు గొప్ప వాళ్ళు కావాలి! శాంతి, క్షమ, ప్రేమను పంచాలి!

___________________________________________________________

5.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

తిరుమలక్షేత్రంలో పూజ్య రామానుజాచార్యుల ముద్ర 


ఆది నుంచి వైఖానస ఆగమోక్త కైంకర్యాలు కొనసాగుతున్న తిరుమల క్షేత్ర విధివిధానాలు భంగం వాటిల్లకుండా సంప్రదాయాలను క్రమబద్ధీకరించి తిరుమల పరమ విష్ణు క్షేత్రమని చాటి చెప్పిన భాగవతోత్తముడు సుప్రసిద్ధ  వైష్ణవ మతాచార్యులైన  పూజ్య రామానుజాచార్యులే. 120 ఏళ్ల (1017-1137) సంపూర్ణ కాలం జీవించిన పూజ్య రామానుజాచార్యులు తన గురువైన తిరుమలనంబి, శిష్యుడైన అనంతాళ్వార్ ల ద్వారా తెలిసిన సమాచారం మేరకు 11వ శతాబ్దంలో తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. వేంకటాచల పర్వతం సకల సాలగ్రామ మయమైనదని తెలిసినందున మోకాళ్ళతో తిరుమల మెట్లు ఎక్కి వెళ్లారు.

అప్పటివరకు ఉన్న వివాదాలన్నిటికి ముగింపు పలుకుతూ ఆయన నిర్ధేశించిన తిరుమల క్షేత్ర నిత్య పూజా సేవా కైంకర్యాలు , విధివిధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అంతేకాక   తిరుమలేశుని మూలమూర్తి కి శంకు చక్రాలను, హృదయ స్థానంలో వ్యూహ లక్ష్మి ని ప్రతిష్టించారు. తాను  పాంచరాత్ర ఆగమ సంప్రదాయ ప్రతినిధి అయినా  తరతరాలుగా అమలులో ఉన్న వైఖానస ఆగమోక్తంగానే నిత్యా పూజా కైంకర్యాలు జరగాలని నిర్ధేశించారు. నిత్య సేవాకైంకర్యాలలో ఎటువంటి లోపాలు లేకుండా చూసే బాధ్యతలను విష్వక్సేన ఏకాంగి అనే బ్రహ్మచారి కి అప్పగించారు.

ఆయనే తరువాత కాలంలో  సన్యసించి వెంకట శఠగోపయతి అనే పేరుతో తిరుమలక్షేత్ర జీయర్ అయ్యారు. ఆ పరంపరలో కొనసాగుతున్న జీయర్ వ్యవస్థ  నేతృత్వంలోనే  తిరుమల క్షేత్ర నిత్య పూజా, సేవా కైంకర్యాలన్నీ నేటికీ కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం సన్నిధి గొల్ల తిరుమల ఆలయ బంగారువాకిలి  తాళాలను తీసి దివిటీ తో లోనికి వెళ్ళగానే రామానుజ ప్రతినిధి అయిన ఏకాంగి అర్చకులతో కలిసి లోనికి వెళ్తారు. సన్నిధి గొల్ల నుంచి దివిటీ ని తీసుకుని అర్చకులతో పాటు కులశేఖర పడి దాటి వెళ్లి  జ్యోతులను వెలిగించడంతో మొదలయ్యే వారి నిత్య సేవ రాత్రి ఏకాంత సేవ వరకు ప్రతి సేవలో, ఉత్సవంలో కొనసాగుతుంది.

తిరుమల క్షేత్రంలో పూజ్య రామానుజాచార్యులకు ఉన్న అనుబంధానికి గుర్తుగా కాలినడక దారిలోని మోకాలి మిట్ట వద్ద ఉన్న మందిరంలో  ద్రోవభాష్యకారులుగా , తిరుమలేశుని హుండీ ఎదురుగా మందిరంలో  సన్నిధి భాష్యకారులుగా కొలువై పూజలందుకుంటున్నాడు. ఆయన నిర్ధేశకత్వంతో శతాబ్దాల క్రితం  ఏర్పాటైన జీయర్ మఠం పర్యవేక్షణలో తిరుమలేశుని నిత్య సేవా కైంకర్యాలన్నీ  వైఖానస ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి.

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@
gmail.com

click here for more

Leave a Reply