22nd ward | పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

22nd ward | భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు పోలింగ్ స్టేషన్ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బుర్ర రమాదేవి సదానందం అనుచరులు ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నమునూరి హేమలత (రజనీకాంత్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బాగిర్తిపేటకు చెందిన ఓ బీఆర్ఎస్ నాయకుడు ఓటర్లకు నగదు పంచుతున్నట్లు గుర్తించారు.

అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో, కొంతదూరం పారిపోవడానికి యత్నించగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఆ వ్యక్తి వద్ద నుంచి సుమారు లక్షల్లో నగదును స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ, ఓటర్లను డబ్బులతో ప్రలోభపెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. సంబంధిత అభ్యర్థిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

