21 zones | చలిలోనూ ఓటర్ల ఉత్సహం!
- పల్లె పోరులో ఓటెత్తారు!
- ఆదిలాబాద్ లో 69.10 శాతం పోలింగ్
- మంచిర్యాలలో 77.34 %
- గడ్డకట్టే చలిలోనూ ఉత్సాహంగా ఓటర్లు
21 zones | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా 21 మండలాల్లో(21 zones)ని 492 పంచాయతీలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. హిమపాతాన్ని తలపించే గడ్డకట్టి చలిలోనూ పల్లె ప్రజలు గజగజ వణుకుతూనే పోలింగ్ కేంద్రాల(polling stations) వద్ద ఉదయం ఏడు గంటలకే బారులు తీరారు. ఉట్నూర్ ఏజెన్సీ తో పాటు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊపిరి తీసుకున్నారు.
మునుపెన్నడూ లేని రీతిలో ఈసారి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నెట్వర్క్ లేని మారుమూల గ్రామాల్లో పోలీసు భద్రత వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా(District Collector Rajarshi Shah) ఇచ్చోడ జెడ్పిఎస్ఎస్ పోలింగ్ కేంద్రాన్ని, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మామడ కేంద్రాన్ని, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఇచ్చోడ, సిరి చల్మ, గుండాల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
మంచిర్యాలలో 77.34 శాతం పోలింగ్..

మంచిర్యాల జిల్లాలో తొలివిడతగా ఈ రోజు పల్లెపోరు ప్రశాంతంగా సాగింది. ఈ జిల్లాలో నీ దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షట్ పేట మండలాల్లోని 81 సర్పంచ్, 514 వార్డు మెంబర్ల(ward members) స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 9 గంటలకు 16.19 శాతం పోలింగ్ జరగక ఆ తర్వాత ఓటర్లు బారులుతీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ జిల్లాలో తొలివిడతగా మొత్తం 1,29,019 మంది ఓటర్లకు గాను మధ్యాహ్నం పోలింగ్ ముగిసే సమయం ఒంటిగంట వరకు 95,920 మంది ఓటర్లు 77.34 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. హాజీపూర్ మండలంలో 84.79 శాతం పోలింగ్ జరగడం విశేషం.
ఆదిలాబాద్ జిల్లాలో 69.10 శాతం ఓటింగ్..!

బ్యాలెట్ పద్ధతిన ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన పులి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, గాదిగూడ, ఇంద్రవెల్లి, నార్నూర్, సిరికొండ, ఉట్నూర్ ఏజెన్సీ మండలాల్లో 166 పంచాయతీలు (166 panchayats), 1,390 వార్డులకు ఎన్నికలు జరగగా ఏజెన్సీ గిరిజనులు కాలినడకన దూర ప్రాంతాల నుండి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు సైతం వీల్ చైర్లలో వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 16.59 శాతం పోలింగ్ జరగగా, పోలింగ్(polling) ముగిసే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 69.10% ఓటింగ్ జరిగింది. మారుమూల సిరికొండ మండలంలో ఓటర్ల చైతన్యం వెలివేరిసింది. ఇక్కడ అత్యధికంగా 85.12 శాతం పోలింగ్ జరగగా, ఇంద్రవెల్లి మండలంలో అతి తక్కువగా 57.60 శాతం ఓటింగ్ జరిగింది. ఇచ్చోడలో పోలింగ్ ముగిసే సమయానికి ఓటర్లు క్యూ కట్టి ఉండడంతో వారికి ఓటు హక్కు కోసం అవకాశం కల్పించారు. ఇక్కడ మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరిగింది.
ఆసిఫాబాద్ జిల్లాలో 77.07 శాతం

ఆసిఫాబాద్ జిల్లాలోని ఐదు మండలాల్లో 109 పంచాయతీలకు ఈరోజు పోలింగ్ జరిగింది. మొత్తం 97,046 మంది ఓటర్లకు గాను 74, 791 మంది ఓటర్లు అంటే 77.07% మంది ఓటు హక్కు(voting rights) వినియోగించుకున్నారు. ఏజెన్సీ ఆదివాసి గిరిజనులు చలికి భయపడకుండా నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకొని ఓటు విలువను అందరికీ చాటిచెప్పారు.
నిర్మల్ జిల్లాలో 80.28 శాతం పోలింగ్..
నిర్మల్ జిల్లాలోని ఆరు మండలాల పరిధిలోని 136 పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగింది. ఈ జిల్లాలో తొలి విడతగా మొత్తం 80.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఈసారి అసాధారణ రీతిలో పోలీసు బలగాలను మోహరించారు. ఆదిలాబాద్ జిల్లాలో 1048 పోలింగ్ కేంద్రాలు(1048 polling stations) ఏర్పాటు చేయగా, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షణలో నలుగురు ఏఎస్పీలు, ముగ్గురు డిఎస్పీలు, 21 మంది సిఐలు, 938 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు.

