18th Jan 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

18th Jan 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్రభ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు..
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.
18th Jan 2026 ఈ సంచికలో…
1 ముఖపత్ర కథనం
2 మనసు-మాట (శీర్షిక)
3 కబుర్లు (శీర్షిక)
4.దూరపు కొండలు(కథ)
5.సన్నిహితం… శీర్షిక)
6.మెదడుకు మేత-సామెత.. శీర్షిక
7.వినరో భాగ్యము – శీర్షిక
18th Jan 2026
1 ముఖపత్ర కథనం
గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా అడవుల్లో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం..మేడారం… మేడారం అంటే, కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, గిరిజనుల చరిత్ర, వారి ఆత్మగౌరవం, దేవతలపై వారి తరతరాల అపారమైన విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యం. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి, ప్రపంచంలోనే అత్యధిక జనసందోహంతో సందడిగా, వేడుకగా జరిగే గిరిజన జాతరగా గుర్తింపు పొందింది, సమ్మక్క–సారలమ్మ జాతర. భారతీయ సంస్కృతిలో సమ్మక్క-సారలమ్మ జాతరది ప్రత్యేక స్థానం.
మేడారం చారిత్రక నేపథ్యం ఒక్కసారి పరిశీలిస్తే…
మేడారం జాతర వెనుక.. ఒక వీరగాథ, అంతకు మించిన త్యాగ చరిత్ర ఉంది. నాటి కాకతీయుల కాలం నాటి పాలనలో కాకతీయులు గిరిజనులపై విధించిన అన్యాయపు పన్నులపై తిరగబడి పోరాడిన గిరిజన నాయకుడు పగిడిద్దరాజు. ఆయన కుటుంబమే ఈ కథకు మూలం, అక్కడే ఈ కథ ఆరంభం.
పగిడిద్దరాజు భార్య సమ్మక్క, వారి కుమార్తె సారలమ్మ ఇద్దరూ అన్యాయానికి ఎదురు నిలిచి, వీరోచితంగా పోరాడి, తుదకు ప్రాణత్యాగం చేసిన వీరనారీమణులుగా నాటి నుంచీ గిరిజనుల దేవతలుగా మారారు. వారి ప్రాణాలు పోలేదనె, కేవలం వారు అడవుల్లో అదృశ్యమయ్యారని, కాలక్రమాన దేవతలుగా పూజింపబడుతున్నారని పురాణ కథనం తెలియజేస్తోంది.
అందుకే, నేటికీ ఈ మేడారం జాతర విగ్రహారాధన లేని అరుదైన జాతరగా ఖ్యాతినొందింది. ఇక్కడ దేవతలను బంగారం, వెండి, లోహపు విగ్రహాల రూపంలో కాకుండా చెక్కచీలల(బొత్తాలు)రూపంలో పూజిస్తారు భక్తులు.
ఇక మేడారం జాతర విశేషాలు గమనిస్తే,
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. దీనిని జాతర సంవత్సరం గా పిలుస్తారు.
ఈ జాతర సాధారణంగా మాఘ శుద్ధ పౌర్ణమి సమయంలో నిర్వహిస్తారు. మరొక విశేషమేమిటంటే, ఈ సమ్మక్క-సారలమ్మ జాతర, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఎలాంటి ఆగమశాస్త్ర పూజలు జరిపించబడవు.
బ్రాహ్మణ పూజలు అంటే అర్చనలూ, అభిషేకాలూ, అష్టోత్తరాలూ, సహస్రనామాలూ కాకుండా పూర్తిగా స్థానిక, గిరిజన సంప్రదాయ విధానంలోనే పూజలు జరిపించబడతాయి.
ఆ తల్లులకు తమ కోర్కెలు విన్నవించుకుని, అవి తీరిన తర్వాత
భక్తితో బెల్లం కట్టలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
అత్యంత వైభవంగా జరిగే ఈ సమ్మక-సారలమ్మ జాతరకు లక్షలాది మంది భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచీ తరలి వస్తారు. అనేక మైళ్ళ దూరం వరకూ భక్తజన సంద్రమైపోతుంది ఈ క్షేత్రం. చాలా దూరంలోనే వాహనాలు నిలిపి భక్తులు ఇక్కడికి కాలి నడకననే చేరుకోవాల్సి ఉంటుంది.
భక్తులు సమర్పించే బెల్లం, నగదు, కానుకలు, ప్రభుత్వ పర్యవేక్షణలో లెక్కలు నమోదు చేయబడతాయి. భక్తుల నుంచి వచ్చిన మొత్తాన్ని రాబోయే జాతర నిర్వహణ కొరకు, క్షేత్రంలో కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చడానికీ, భద్రత,
గిరిజన సంక్షేమానికి వినియోగిస్తారని స్థానికులు చెబుతారు. గిరిజన సంప్రదాయాల గౌరవార్థం పూర్తి వివరాలను పబ్లిక్ చేయకుండా జాగ్రత్త వహిస్తారు.
మేడారం జాతర పూజల బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నది గిరిజన పూజారులే.
వీరు తరతరాలుగా ఈ బాధ్యతను పరంపరగా కొనసాగిస్తున్నారు.
ఈ జాతరలోని ముఖ్య ఘట్టాలైన
దేవతల ఆహ్వానం, బొత్తాల స్వాగతం, పూజా విధానం అంతా గిరిజన పూజారుల
అర్యవేక్షణలోనే నిర్వహించబడుతాయి.
వీరిని స్థానికంగా ‘గిరిజన పూజారులు, మడుగుల వారు’ అని పిలుస్తారు…మరొక ముఖ్య విశేషమేమిటంటే, ప్రస్తుత కాలంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, వారి నుంచి ఎంత సహకారం వచ్చినా, స్థానిక ఆచారాల నియంత్రణ మాత్రం పూర్తిగా పూజారుల చేతుల్లోనే ఉండడం మేడారం జాతర ప్రత్యేకతగా నిలుస్తోందని చెప్పవచ్చు..
మేడారంకి రవాణా సౌకర్యాలు అన్నివైపుల నుండీ అందుబాటులో ఉన్నాయి.
రోడ్డు మార్గం హైదరాబాద్ నుండి వరంగల్ అక్కడి నుండి ములుగు నుండి మేడారం చేరుకోవచ్చు.
జాతర సమయంలో టీ.ఎస్.ఆర్.టీ.సీ. ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఏపీ, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు విరివిగా ఉంటాయి.
రైలు మార్గం విషయానికొస్తే, మేడారం కి వరంగల్ సమీప రైల్వే స్టేషన్ .
అక్కడి నుంచి కూడా మేడారం కి బస్సులు, జీపులు అందుబాటులో ఉంటాయి. విమాన మార్గంలో రావాలనుకునేవారికి మాత్రం సమీప విమానాశ్రయం: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి చేరుకోవాల్సిందే.
జాతర సమయంలో తాత్కాలిక రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, వైద్య శిబిరాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఒక మతపరమైన ఉత్సవం మాత్రమే కాదు. అది గిరిజనుల ఆత్మగౌరవ పోరాటానికి గుర్తు ప్రజాస్వామ్యానికి మూలమైన ప్రజల విశ్వాసానికి నిదర్శనం.
కాలమెంత గడిచినా, తరాలు మారినా, పాలకులు మారినా సమ్మక్క–సారలమ్మలపై భక్తుల విశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు సరికదా…నానాటికీ పెరుగుతున్నదనే చెప్పవచ్చు.
_-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-__-_-_-_-_
2 మనసు-మాట శీర్షిక

లిఖిత మనసు మాట: నా పేరు లిఖిత. నా వయసు 21 సంవత్సరాలు. మా కాలేజీ లో చదువుతున్న కిరణ్తో బాగా స్నేహం ఏర్పడింది. రోజులో చాలా సేపు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్లం. మా పరిచయం ఎప్పుడు ప్రేమగా మారిందో నాకు తెలీలేదు. అయితే తను లేకుండా నేను ఉండలేను, తను నా జీవితంలో ఉంటే నేను జీవితమంతా చాలా ఆనందంగా వుంటాను అని అనిపించింది. నాకు చిన్నప్పటి నించి ఇంట్లో ప్రేమ లభించలేదు. మా తల్లి తండ్రులు ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. నేను ఎప్పుడు ఇంటికి వచ్చిన అమ్మ బాధ పడడమో, ఏడవడమో లేదా నాన్న తాగుతూ ఉండడము, అమ్మని కొడ్తుండడమో చూసేదాన్న. ఇద్దరికీ ఓపిక ఉండకపోవడంతో నేను తప్పుచేస్తే తిట్టేవారు లేదా కొట్టేవారు. నా బాధ అమ్మకి చెప్పాలన్న లేదా నాన్నకి చెప్పాలన్న కుదిరేది కాదు. ఆలా వంటరిగా ఉన్న నాకు ఎదో ఒక రోజు నా భావాలు పూర్తిగా చెప్పుకోగలిగే జీవిత భాగస్వామి దొరుకుతాడని భావించేదాన్ని. ప్రేమ వున్నప్పుడు నేను వాళ్ళకి సులువుగా అర్థమవుతాను అనుకునేదాన్ని. ఆలా కిరణ్ పరిచయమవ్వగానే, తను నా పట్ల చూపించే శ్రద్దను ఆనందించాను. ఏదైనా మాట్లాడే స్వేచ్ఛను ప్రేమనుకున్నాను. మాది సోల్ మేట్ బంధం అనిపించింది. ఈ భావన నా ఆనందానికి అవధులు లేకుండా చేసింది. కిరణ్ కి నా ప్రేమ గురించి వెల్లడిఇంచాను. కానీ తను ఏది స్పష్టంగా చెప్పలేదు. నాకు తన ప్రవర్తన అర్థం కాలేదు. నాకు ఈ రిజెక్షన్ ఎలా తీసుకోవాలో తెలియలేదు. తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశా, సంవత్సరం వరకు టైం తీసుకొని మళ్ళీ చెప్పా అయినా మార్పులేదు. తను నా నుంచి దూరమయ్యి 4 సంవత్సరాలు అయ్యింది ఐన తన కోసమే ఎదురు చూస్తున్న. ఇంకెవరని స్వీకరించలేకపోతున్న. ఇంట్లో ఎప్పుడూ నేను వంటరినే కానీ కిరణ్ వలన తీరిన ఆ వంటరితనం తను నా నుండి దూరమవ్వడంతో ఇంకా రెట్టింపు అయ్యింది.
సైకాలజిస్ట్ మాట :
లిఖిత మీరు బాల్యంలో అనుభవించినది భావోద్వేగ నిర్లక్ష్యం – అంటే మీ భావోద్వేగ అవసరాలు తీరలేదు అని అర్థం. భావోద్వేగ అవసరాలు మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సుకు చాలా అవసరం. భావోద్వేగ అవసరాలను సంరక్షకులు(తల్లితండ్రులు) బాల్యంలో తీర్చనప్పుడు ఆ భావోద్వేగ నిర్లక్ష్యం పిల్లలలో ఒక వెలితిని(void/emptiness) సృష్టిస్తుంది. ఈ వెలితి వలన ప్రేమించిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము, మన భావాలని మరియు ఆలోచనల్ని విస్మరిస్తాము.

*బాల్యంలో సంరక్షకులు(తల్లితండ్రులు) తీర్చాల్సిన పిల్లల యొక్క భావోద్వేగవసరాలు:
- ప్రేమ మరియు అనుబంధం
- ధృవీకరణ మరియు గుర్తింపు
- భద్రత మరియు రక్షణ
- స్వాతంత్ర్యం మరియు నియంత్రణ
- ఆనందం మరియు ఉల్లాసం
బాల్యంలో భావోద్వేగ నిర్లక్ష్యం:
- భావోద్వేగ అవసరాలను తీర్చకపోవడం
- భావోద్వేగ మద్దతు లేకపోవడం
- భావోద్వేగాలను వ్యక్తపరచడానికి అనుమతి/ సరైన వాతావర్ణం లేకపోవడం
- అతిగా విమర్శించడం లేదా నిర్లక్ష్యం చేయడం
బాల్యంలో భావోద్వేగ నిర్లక్ష్యం వలన ఏర్పడిన వెలితి పెద్దయ్యాక బంధాలలో మన ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయి :
- ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం
- సంబంధాలలో సమస్యలు
- భావోద్వేగ నియంత్రణలో ఇబ్బంది
- ఆందోళన మరియు నిరాశ లిఖిత, సోల్‌మేట్ కనెక్షన్ నమ్మకం అనేది ఒక రొమాంటిక్ భావన. ఈ నమ్మకం మరియు భావన ఒక్కరికి ఒక పరిపూర్ణ వ్యక్తి ఉన్నాడని నమ్మడం ఆ వ్యక్తి కోసం అన్వేషించడం, నిరీక్షించడం అలవాటు చేస్తుంది. అయితే, పరిశోధనలు ఈ నమ్మకం బాల్యంలో భావోద్వేగ నిర్లక్ష్యానికి గురయిన వారిని ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నాయి. మీరు కిరణ్ ని ప్రేమించారు అన్నదాని కంటే ప్రేమ అన్న భావనని ఎక్కువ ప్రేమించారేమో ఒకసారి ప్రశ్నించుకోండి. కిరణ్ మీ పట్ల చూపించిన అటెన్షన్ అప్పటి వరకు ఎవరూ ఇవ్వకపోవడంతో దానిని ప్రేమ అనుకున్నారేమో దాని వలన ఆయన మీ ప్రేమను నిరకరించారన్నది స్వీకరించడానికి కష్టపడ్డారు. తద్వారా తనకి నచ్చజెప్పే ప్రయత్నంలో సంవత్సరాలు నిరీక్షిస్తున్నారు. ప్రేమ కంటే గౌరవం అన్నది చాలా ముఖ్యం ఒక బంధం నిలవడానికి. మీరు సంవత్సరాలు తనకోసం ఎదురుచూస్తూ ఉండడం వలన మీ మీద మీకు ఉన్న గౌరవం దెబ్బతింటుంది తద్వారా మిమ్మల్ని మీరు రిజెక్ట్ చేసుకుంటున్నారు అన్నది గ్రహించండి. లిఖిత కి సూచనలు: భావోద్వేగ నిర్లక్ష్యం బాల్యంలో అనుభవించినప్పుడు దానిని ఎలా అదిగమించాలో తెలుసుకోండి:
- స్వీయ-అవగాహన పెంచుకోవాలి
- భావోద్వేగ అవసరాలను గుర్తించాలి మరియు అవి భాగస్వామికి మరియు అవతలి వాళ్ళకి చెప్పగల్గాలి.
- స్వీయ-సంరక్షణ మరియు స్వీయ-ప్రేమ పెంపొందించుకోవాలి
- బాల్యంలో ప్రేమ రాహిత్యం వున్నప్పుడు బయట వాళ్ళు ఇచ్చే అటెన్షన్ని ప్రేమ అనుకుంటాము. ఈ నమ్మకాన్ని సవరించుకొని ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించుకోవాలి.
- చిన్నప్పటి నుంచి సంరక్షకుల ఆలోచనలకి, భావాలకి ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటైనప్పుడు, మన భావాలని మరియు ఆలోచనలను ఎవరైనా చెప్పకుండా అర్థం చేసుకుంటే బావుణ్ణు అని అనిపిస్తుంది. మన ఆలోచనలను మరియు భావాలను చెప్పకుండా ఎవరికీ అర్థం అవ్వదు అన్న సంగతిని గ్రహించాలి. బంధాలలో పరస్పర ఆలోచనలు మరియు భావాలు చెప్పగల్గినప్పుడే ఆరోగ్యవంతమైన బంధాలు ఏర్పడతాయి. అప్పుడే ఈ సోల్మేట్ కనెక్షన్ కావాలి అన్న అవసరం తగ్గుతుంది తద్వారా ఆ నమ్మకం కూడా మారుతుంది.
- భావ నియంత్రణ మరియు భావ ప్రకటన కష్టమయినప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ది మైండ్ వాయిస్:
లిఖిత ఈ మాటలు మీ మైండ్ వాయిస్ గా చేసుకోండి.
- మన భావాలను మరియు ఆలోచనలను బంధాలలో నిస్సంకోచంగా ఎదుటవారికి చెప్పడం నేర్చుకున్నాక సోల్మేట్ అవసరం మనకుండదు ఎందుకంటే మనతో మనకు సోల్ కనెక్షన్ ఏర్పడుతుంది కాబట్టి.
- ప్రేమ అన్నది నచ్చజెప్పడం వలన కలిగేది కాదు. మీ భావనలకు గౌరవం ఇచ్చుకొని కిరణ్ స్నేహానికి మరియు జ్ఞపకాలకు స్వస్తి చెప్పండి.
.
3 కబుర్లు (శీర్షిక)

‘తెలుగు తిండి
తెలుగువారు పాలిటిక్సులో ఎంత చురుకో పాకశాస్త్రంలో అంత కన్న చురుకు. తింటే గారెలే తినాలనే రకం. నలుడికి, భీముడికి నవగాయ వంటకాలు నేర్పింది మన తెలుగువాడే. పంచదార కన్న పాల మీగడ కన్న, జుంటు తేనియకన్న, జున్నుముక్క కన్న, వెన్న కన్న, దోరమాగిన మామిడి కన్న తెలుగు తియ్యగా ఉంటుందన్న ఓ భాషాభిమాని- తన పాకాభిమానం కూడా నిర్మొహమాటంగా చాటుకున్నాడు.
గొల్లపిల్లల వేళ్లసందు మాగాయ పసందు రుచి చూపించిన ఘనుడు మన పోతన . కర్పూర విడెమును గురించి కవిసార్వభౌముడెప్పుడూ గొప్పగా చెప్పుకునేవాడు .
‘భరత ఖండంబు చక్కని పాడియావు’ అన్నది చిలకమర్తివారి ఊహ. ‘చిక్కటి పాల మీద మిసమిసలాడే మీగడను పంచదారతో కలిపి తిన్నట్లు నీ అమృత రూపాన్ని ప్రేమతో దాస్యం దోసిలి బట్టి జుర్రుకుంటాన’ని కంచెర్ల గోపన్న ఆశపడ్డాడు.
అలంకారాలలో ఉప్మాలంకారం… పండగల్లో అట్లతదియ మన ప్రత్యేకత. బిడ్డ దుర్ముహూర్తంలో పుడితే మేనమామ మెడలో గారెలదండ వేస్తేనే అల్లుడిని చూడనిచ్చే ఆచారం మనది .
బందరులడ్డు, కాకినాడ కాజా, హైదరాబాదు బిర్యాని అంటూ ఊరుకో పాకం పేరు పెట్టేసుకుని మురిసిపోతాడు తెలుగువాడు.
పిల్లలక్కూడా కాకి-రొట్టె కథే ముందు చెప్పటం అనాదిగా వస్తోన్న వరవడి.
‘తిండి గలిగితె కండగలదోయ్. కండ గలవాడేను మనిషోయ్’ అని గురజాడవారు కూడా తిండిగోలతోనే దేశభక్తిని ముడిపెట్టారు. ‘రొట్టెముక్కా అరటితొక్కా’.. దేన్నీ పక్కన పెట్టద్దంటాడు ఋక్కల్లో మహాకవి శ్రీ శ్రీ . పరబ్రహ్మం దగ్గర్నుంచీ పకోడీ వరకు అనేక వంటకాలను గూర్చి అనర్గళంగా పద్యాలల్లారు తెలుగు అవధానం కవులు. ‘పీత్వా పీత్వా పున: పీత్వా స్వర్గలో కమవాప్నుయేత్’ అనేది ఓ కవి కాఫీ ప్రేమ.
తెలుగు మనిషి అల్పసంతోషి. గోంగూర పేరు చెబితే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పిల్లలు విదేశాలకు పోతుంటే ఏ పచ్చళ్ళు ప్యాక్ చేయించాలా అని తెలుగు తల్లి తల్లడిల్లిపోతుంది. సాష్ట్వేరంటే ఇప్పుడొచ్చింది కానీ. తెలుగువాడికి అంతర్జాతీయంగా అమోఘమైన పేరుతెచ్చింది అప్పట్లో ఘుమఘుమలాడే ఊరగాయలే.
గుత్తొంకాయ తెలుగువాడి సొత్తు. ఆ వంకాయ కూర వంక ఇంత వరకు పరిశోధకుల కన్నెందుకు పడింది కాదో..!
ఉల్లి చేసే మేలు తల్లయినా చేయదని తెలుగువాడి నీలుగు. తెలుగువాడి వెర్రి తిండి వేపాకునైక వదిలి పెట్టదు. ‘తినగ తినగ వేము తీయగనుండు’ అని దాని రుచుల మీదా రాగాలు తీయక వదలడు.
మాయాబజారు సినిమా మీద మనకి ఈనాటికీ అంత మోజెందుకో తెలుసా? మగ పెళ్ళివారికని చేసిన నవగాయవంటలన్నింటినీ వంటింటిలో చేరి ఘటోత్కచుడు అదేపనిగా పట్టు పట్టేస్తాడు! ఆ సీను చూసి ఎంజాయ్ చేయని వాడింత వరకూ తెలుగు భూమిపై పుట్టింది లేదు. ఆ ‘వివాహ భోజనంబు’ అనుపాకాల పేర్ల లిస్టు చదివితేనే తెలుగువాడికి చవులూరి పోతుంది.
పెళ్ళిని మనం పప్పన్నమని ముద్దుగా పిలుచుకుంటాం. అప్పుచేసైనా సరే పప్పు కూడు తినే వాడు తెలుగువాడు.
తిండి ఊసులేకుండా ఏ పండగా పబ్బమూ మనకు ఉండదు. ఒకానొకప్పుడు పెళ్ళిచూపుల్లో పిల్లను చూడవచ్చిన వాళ్లు అడిగే మొదటి క్వశ్చన్ ‘వంట వచ్చా? ‘ అని.
ఏ పాటు తప్పినా సాపాటు మాత్రం పొరపాటునైనా తప్పించబోడు తెలుగు పౌరుడు. క్షీరసాగరం మధించే గుంపులో మన తెలుగువాళ్లే ఉండుంటే అమృతానికి బదులు ఓ అర కప్పు కాఫీకి జగన్మోహినితో జగడాలకు దిగేవాళ్లు .
తిండిరాముడు పోటీలే కనుక ఒలింపిక్సులో ఉండుంటే.. సందేహ మెందుకు.. మన తెలుగు సందోహానికే అన్ని స్వర్ణాలూ!
ఆడటంలోనేనా.. తినడంలో కూడా తెలుగువాడి దిట్టతనం ముందు బకాసురుడు బలాదూర్.
తెలుగు దేశం ‘అన్న’ పూర్ణ. తెలుగు రైతు ‘అన్న’ దాత. ఇప్పుడంటే మందు పాతరలు.. నిన్న మొన్నటిదాకా ఆంధ్రా దేశం మొత్తానికి బియ్యం పాతర. ‘కిలో బియ్యం రెండు’ తెలుగువాడికి మాత్రమే సాధ్యం. తెలుగు దేవుళ్లకీ ప్రసాదాల పై పరమ ప్రీతి. తిరుపతి లడ్డు… తిరుపతి వెంకన్న కన్న ఫేమస్. రుద్రాక్ష మాల తిప్పేది తెలుగువాడే అయితే ‘ద్రాక్ష’ పేరు దగ్గర నుంచి ఒక పట్టాన ముందుకు కదలడు.
మన తెలుగు బాలకృష్ణుడి చేత వెన్నముద్ద కోసం పోతన చేయించిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇంతకీ ఈ తిండిగోల అసలెందుకంటారా?
కందిపప్పు కిలో యాభై ఆరు. ఎండుమిర్చి డెబ్బైయ్. వేరుసెనగ అరవయ్యదు. చెక్కర ఇరవై ఆరు. ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. అందని ద్రాక్షలాగయిపోయాయి అన్ని దినుసులూ! ఎండలకు మించి మండుతున్నాయి మండీలలో కూరగాయల ధరలు! నో స్టాకు బోర్డులు నొసళ్లతో వెక్కిరిస్తున్నాయి. సౌదీలో చుక్క కాఫీ పొయ్యకపోయినా కట్టుకున్నవాడు భార్యకు విడాకులిచ్చేయచ్చుట. ఇక్కడా అలాంటి దుస్థితి దాపురించక ముందే గోదాముల్లో అక్రమంగా దాచిన దొంగసరుకు మీద ఏలినవారు వెంటనే ఓ కన్నేయాలి!
_____________________________________
4.దూరపు కొండలు (కధ)
ఈ రోజు నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు.ఎందుకంటే ఇవాళ అమెరికా వెళ్ళడానికి నాకు వీసా వచ్చే రోజు.అందుకే నేను నా తల్లి తండ్రులతో కలిసి అమెరికన్ ఎంబసీకి ఉదయం ఏడు గంటలకే వెళ్ళాను.నా తల్లి తండ్రులకు నా చిన్నప్పట్నుంచి నన్ను అమెరికాలో ఇంజినీరింగు చదివించాలని కోరిక.వాళ్ళు నాతో ఎన్నో సార్లు అలా చెప్పటం వల్ల నాక్కూడా అమెరికా వెళ్లి ఏ స్టాంసుఫోర్డు విశ్వవిద్యాలయంలోనో,మెస చూట్స్ లోనో ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఇంటర్ కి వచ్చేసరికి బలపడింది.
కానీ అక్కడ ఇంజినీరింగు చదవాలంటే బోలెడు డబ్బు ఖర్చు అవుతుందని,అదే ఇక్కడ ఇంజినీరింగు చదివి అక్కడ ఎమ్మెస్ చదివితే తక్కువ డబ్బుతో చదువు పూర్తై ,ఉద్యోగాలు కూడా వెంటనే వచ్చే అవకాశం ఉంటుందని చాలా మంది చెప్పటంతో నేను ఎంసెట్ రాసి ఇంజినీరింగు చదివి అది పూర్తైన తరువాత జీఆర్యీ రాస్తే మంచి మార్కులు వచ్చాయి.నా కొచ్చిన మార్కులకు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ లో సీట్ వచ్చింది. ఇక నేను అమెరికా వెళ్లడమే తరువాయి.అందుకే ఈ రోజు అమెరికన్ ఎంబసీకి వచ్చాము.
ఈ రోజు చాలా పెద్ద క్యూ వుంది.ఆ క్యుని చూడగానే నాలో భయం మొదలైంది.నా పక్కనే ఉన్న మా నాన్న గారి కళ్ళల్లో ఆందోళన, మా అమ్మ కళ్లలో ఆనందం కనిపించాయి.నాకైతే సీట్ వచ్చింది కాబట్టి వీసా వస్తుందని ధైర్యం.కానీ ఎక్కడో చిన్న అనుమానం.అందుకే క్యూ ముందుకు కదులుతుంటే నాలో ఆందోళన పెరగసాగింది.పన్నెండు గంటలకు నా వంతు వచ్చింది.

అక్కడి ఆఫీసర్ “Why do you want to study in the US?” మీరు అమెరికా లో ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారు”అనీ అడిగాడు.
అతని ప్రశ్నకు నా గొంతు తడారిపోయింది.అయినా ధైర్యం తెచ్చుకొని “Sir, నాకు అమెరికాలో కంప్యూటర్ సైన్సు లో ఎమ్మెస్ చదవాలని కోరిక. I want to specialize in Artificial Intelligence. అమెరికా విశ్వ విద్యాలయాలు ప్రపంచంలో గొప్పవి కాబట్టి అక్కడ చదివితే నా భవిష్యత్తు బాగుంటుందని నేను అమెరికా లో చదవాలనుకుంటున్నాను “అనీ అతనితో ధైర్యంగా తడబాటు లేకుండా చెప్పాను.
అప్పుడు అతను “How will you fund your education?” అంటే నీ చదువుకి డబ్బులు ఉన్నాయా?”అని అడిగాడు.
అప్పుడు నేను మా నాన్న అప్పులు చేసి తెచ్చిన బ్యాంక్ లోన్ పేపర్లు చూపించాను . కొంత సేపు అక్కడ నిశ్శబ్దం; ఆ తరువాత అతను నా దరఖాస్తుని,అందులోని విషయాలను పరిశీలించిన తరువాత “Your visa is approved” అన్నాడు.
ఆ మాట వినగానే నా మనసు ఆనందంతో నిండిపోయింది.బయట ఉన్న మా అమ్మ నాన్న కళ్ళల్లో వాళ్ల కల నెరవేరబోతున్నందుకు వెలుగు కనిపించింది.
అమెరికా లోని కాలిఫోర్నియా ఎయిర్‌పోర్ట్ చేరుకున్న రోజున గాజు గోడలలోంచి చూసిన కొత్త లోకం నాకు స్వర్గంలా కనిపించింది. నాకు అక్కడ నాకు కాబోయే రూమ్ మేట్ రాహుల్ స్వాగతం పలికాడు. కానీ రెండు వారాల్లోనే అమెరికా కల ఎంత ఖరీదో నాకు అర్థమయ్యింది.
అక్కడి యూనివర్సిటీ ఫీజులు చాలా ఎక్కువ. ఒక్కో సెమిస్టర్‌కి 15,000 డాలర్లు.ఇంటి నుంచి తెచ్చిన డబ్బు సరిపోలేదు.ఆ ఫీజు కోసం నేను ఒక కాఫీ షాపులో పార్ట్ టైం ఉద్యోగంలో తప్పక చేరవలసి వచ్చింది.ఆ షాపు మేనేజర్ మొదటి రోజునాడు ” సిద్దార్ధ్ ,ఇక్కడ ప్రతీ కస్టమర్ ని నవ్వుతూ పలకరించాలి”అనీ చెప్పాడు. అక్కడ రాత్రి 12 వరకూ కౌంటర్ వెనుక నిలబడి, తరువాత మేముంటున్న గదికి వెళ్లి వండుకొని,ఆ తరువాత నోట్సులు రాసుకోవడం నా దిన చర్య.నెల తరువాత “ఇది చదువా? లేక కూలీ బతుకా?”అనీ నాకు అనిపించసాగింది.
ఎప్పుడో తొంభయ్యవ దశకంలో ప్రవేశించిన కంప్యూటర్లు,ఇంటర్నెట్ తన జీవితాన్ని శాసిస్తాయని మనిషి ఎప్పుడూ ఊహించలేదు.రెండువేల సంవత్సరం అంటే కొత్త సహస్రాబ్ది కి ముందు వచ్చిన వై 2 కే సమస్య వల్ల భారతీయులకు మరీ ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు, నిరుద్యోగులకు అమెరికా దేశం ద్వారాలు తెరిచి స్వాగతం పలికింది. అప్పటినుంచి భారతీయులకు అమెరికా గమ్యస్థానం అయింది.ఆ తరువాత చాలా మంది నా లాంటి భారతీయ విద్యార్థులు అమెరికా అనే ఊబిలో కూరుకుపోయారు.
అమెరికాలో చదువుతో పాటు ఒత్తిడి కూడా అంతే ఎక్కువ. ప్రతి వారం కొత్త అసైన్మెంట్స్, వాటికి గడువు ఇవ్వటం,అవి పూర్తి కాకపోతే హెచ్చరికలు,ఇలా మనిషి ఇక్కడ ఒక యంత్రంలా పనిచేయాలి.అప్పుడప్పుడు గ్రంధాలయంలో రాత్రంతా కూర్చుని నోట్స్ తయారుచేసుకునే వాడిని. అప్పుడు కూడా నా ఆలోచనలు ఇండియాలో ఉన్న మా అమ్మ నాన్నల చుట్టే తిరుగుతుండేవి.మా నాన్న నా చదువు కోసం చేసిన అప్పు తీర్చగలడా? నాకు ఉద్యోగం వస్తుందా?”అన్న ఆందోళనలు నన్ను భయపెడుతూ ఉండేవి.మా నాన్న గారు మాత్రం ఎప్పుడూ ఫోన్ చేసినా “డబ్బు గురించి ఆలోచించకు.ఆరోగ్యం జాగ్రత్త”అనీ చెప్పేవారు.కానీ డబ్బే పెద్ద సమస్య అనీ నాకు తెలుసు.దాన్ని సంపాదించడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది.
ఇక మేము చదువుకున్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా బయట కిరాణా దుకాణాల్లో పని చేసినప్పుడు మాకు నల్ల జాతి వాళ్ళతో ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి.వాళ్ళు అప్పుడప్పుడు మమ్మల్ని తుపాకీలతో బెదిరించి డబ్బులు ఇవ్వకుండా సామాన్లు పట్టుకుపోతూ ఉండేవారు.ఒక సారి మా దుకాణంలో ఒక నల్ల జాతి వాడితో డబ్బు విషయంలో గొడవ జరిగినప్పుడు వాడు తుపాకీ పేల్చడంతో నాతో పాటు పనిచేస్తున్న తెలుగు అమ్మాయి నీరజ గాయపడింది.అప్పుడు జరిగిన పోలీసు కేసులో ఆ అమ్మాయి కేంపస్ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నందుకు ఆమె మీద కేసు పెట్టారు. అప్పుడు నేను కూడా ఆ ఉద్యోగాన్ని మానివేయ వలసి వచ్చింది.
నేను రెండవ సంవత్సరంలో వున్నప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం నా లాంటి విదేశీ విద్యార్థుల మీద ఆంక్షలను మరింత కట్టు దిట్టం చేసింది.దాని వల్ల మేమంతా కేంపస్ లోపల తప్ప బయట ఉద్యోగం చెయ్యడానికి వీలులేని పరిస్థితి ఏర్పడింది.దాంతో మేము చదువుకుంటున్నప్పుడు పార్ట్ టైం ఉద్యోగాలు దొరకక చాలా ఇబ్బందులు పడ్డాము.
ఇక నా డిగ్రీ పూర్తి అయిన తరువాత కొత్త సమస్య ఉద్యోగం రూపంలో ఎదురైంది.అప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) నా లాంటి అంతర్జాతీయ విద్యార్థులకు డిగ్రీ తర్వాత మూడు సంవత్సరాల వరకు అమెరికా లో పని చేయడానికి అనుమతిస్తుంది. అలా నేను ఒక చిన్న స్టార్ట్ అప్ కంపెనీలో తక్కువ జీతానికి చేరాను.
ప్రతీ సంవత్సరం మన దేశం నుంచి అమెరికా వచ్చే విద్యార్థులు ఎక్కువైపోవడంతో అమెరికా లో నిరసనలు మొదలయ్యాయి.మన భారతీయుల వల్ల వాళ్ళకు ఉద్యోగాలు దొరకటం లేదని వాళ్ళ కోపం.అందువల్ల కొత్త ప్రభుత్వం వీసాలను తగ్గించి వెయ్యడం,H1B వీసాలకు లక్ష డాలర్లు ఫీజు పెంచడం లాంటివి చేసి మన అవకాశాలకు గండి కొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో మాకు ఉద్యోగాలు దొరకడం కష్టమైపోసాగింది.దానికి తోడు మన విద్యార్థుల మీద దాడులు ఎక్కువయ్యాయి.
ఒకరోజు మా విశ్వ విద్యాలయం దగ్గరే తుపాకీ కాల్పులు జరిగి ఇద్దరు మన భారతీయ విద్యార్థినిలు చనిపోయారు.దాని వల్ల మేము వారం రోజుల పాటు బయటకు వెళ్లలేక పోయాము.అమెరికాలో ఆధునికత ఎంత ఎక్కువో విచ్చలవిడితనం కూడా అంతే ఎక్కువ. దాంతో చాలామంది మన భారతీయులు పెళ్లిళ్లు చేసుకోకుండా సహ జీవనానికి అంటే లివ్-ఇన్-రిలేషన్ షిప్ కి అలవాటు పడ్డారు.దాంతో విడాకుల కేసులు,సహజీవనాలు పెరిగాయి.ఒకప్పుడు అమెరికా అబ్బాయి అంటే విపరీతమైన మోజు చూపించే మన భారతీయ తల్లి తండ్రులు ఇప్పుడు వాళ్ళను చూస్తే భయపడిపోవడం మొదలైంది.
దాంతో నాకు అమెరికా మీద విముఖత పెరగడం మొదలైంది.ఒక రోజు నేను లైబ్రరీ లో కూర్చున్నప్పుడు నా డైరీలో “ఒకప్పుడు అమెరికా అంటే స్వేచ్చకు,స్వాతంత్ర్యానికి ప్రతీక.కానీ ఇప్పుడు అది విచ్చల విడితనానికి,విశృంఖలత్వానికి ఆలవాలం”అనీ రాసుకున్నాను. అప్పుడు గీతలోని “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి” అంటే నీ కర్తవ్యం చేయి. ఫలితాలు నీ చేతిలో లేవు. ఫలితం కోసం పరిగెత్తొద్దు. కర్తవ్యాన్ని వదులుకోకు”అన్న శ్లోకం గుర్తుకు వచ్చింది.
నేను ఆఖరి సంవత్సరంలో ఉన్నప్పుడు నాకు లహరి పరిచయం అయింది.ఆమెది కూడా మా ఉత్తరాంధ్ర ప్రాంతమే.ఇద్దరిది ఒకే క్లాసు కావటంతో మా పరిచయం స్నేహంగా ,అది తరువాత ప్రేమగా పరిణామం చెందింది.లహరి అందమైనదే కాకుండా చాలా తెలివైనది కావడంతో నేను ఆమెను ఇష్టపడ్డాను.కానీ చాలా మంది మన భారతీయ విద్యార్థుల్లా మేము హద్దులు మీరలేదు.
ఇప్పుడు మేమిద్దరం ఉద్యోగం వేటలో ఉన్నాము.ఉద్యోగాలు వస్తే తల్లి తండ్రులకు చెప్పి పెళ్లి చేసుకోవాలని మా ఇద్దరి ఆలోచన.ఆ రోజు శనివారం కావడంతో మేమిద్దరం అక్కడికి దగ్గరలోని ఒక జలపాతం దగ్గరకు కారులో పిక్నిక్ కి బయలుదేరాము. వెళుతున్నంత సేపు హాయిగా పాటలు వింటూ,ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ మా ప్రయాణం సాగింది. కానీ ఒక్కసారిగా రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన ట్రక్కును తప్పించబోయే క్రమంలో మా కారు పక్కనే ఉన్న ఒక చెట్టుని ఢీకొట్టి పెద్ద శబ్దంతో బోల్తా పడింది.ఆ ప్రమాదంలో లహరికి బాగా గాయాలయ్యాయి.నేను కళ్ళు తెరిచేసరికి లహరి ముఖం రక్తంతో తడిసి ఉంది. ఆమె గాజు పెంకులతో గాయపడి, నొప్పితో నిట్టూరుస్తోంది.
ఆ తరువాత నేను పోలీసుల సాయంతో ఆమెను హాస్పిటల్ కి తీసికెళ్ళాను.డాక్టర్లు ఆమెకు చికిత్స మొదలుపెట్టి రెండు రోజులు ఆగితే గాని పరిస్థితి చెప్పలేమని చెప్పారు.ఆ తరువాత పోలీసులు నన్ను పొలిసు స్టేషనుకి తీసికెళ్లారు.
“నువ్వు వేగంగా నడపబట్టే కారు ప్రమాదానికి గురైంది.ఇంత వేగంగా ఎందుకు డ్రైవ్ చేశావు? డ్రింక్ చేసి ఉన్నావా?”అనీ నన్ను పోలీసులు అడిగారు.
నేను లేదని ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా కేసు బుక్ చేస్తామని చెప్పారు.ఈ ప్రమాదం గురించి ఆమె తల్లి తండ్రులకు తెలిస్తే వాళ్ళు గాబరా పడతారని నా భయం.అందుకే వాళ్ళను కేసు పెట్టవద్దని బతిమలాడేను.అదృష్టవశాత్తు లహరి కోలుకుంది.ఆమెను పది రోజుల తరువాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసారు.పోలీసులు కేసు పెట్టినా ఆమె కోలుకుంది కాబట్టి పెద్దగా పట్టించుకోక వదిలేసారు.
ఒక రోజు నేను లహరి ప్రమాదం కేసు విషయమై పోలీసు స్టేషనుకి వెళితే అక్కడ నాకు నా స్నేహితుడు రాజేష్ కలిసాడు.అక్కడ వాడు ఎందుకున్నాడో అనీ నేను ఆశ్చర్య పోయాను.వాడు నాలాగే ఐదేళ్ల క్రితం అమెరికా వచ్చి టీసీఎస్ లో చేరాడు.అక్కడే అతనికి అనుపమ అనే అమ్మాయి పరిచయమైంది.తరువాత ఆ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
“నా మీద నా భార్య అనుపమ ఇండియాలో గృహ హింస కేసు పెట్టింది.ఆ విషయం మా లాయర్ తో మాట్లాడటానికి వెళితే అతను ఇక్కడ ఉన్నాడని తెలిసి వచ్చాను.ఇప్పుడు నేను మన దేశం వెళితే నన్ను అరెస్టు చేస్తారట.మా అమ్మ నాన్నల్ని ఇద్దర్నీ పది రోజుల క్రితం అరెస్టు చేసారు.అనుపమ విషయంలో నేను ఘోరంగా మోసపోయాను.ఆమె నన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది.నా చేత ఇల్లు తన పేరు మీద కొనిపించి ఇప్పుడు నా మీద కేసు పెట్టింది.ఇప్పుడు నాకు విడాకులే శరణ్యం.నేను సంపాదించిన డబ్బు అంతా లాగేసుకొని మోసం చేసింది”అనీ చెప్పాడు రాజేష్.
వాడికి ఏం చెప్పాలో అర్ధం కాక బయటకు వచ్చేసాను.
వారం తరువాత ఒకప్పటి నా రూమ్ మేట్ రాహుల్ ని పోలీసులు అరెస్టు చేసారని తెలిసి పోలీసు స్టేషన్ కి వెళ్ళాను.వాడు రెండేళ్ల క్రితం నుంచి ఒక మెక్సికన్ అమ్మాయితో సహజీవనం చెయ్యడం మొదలుపెట్టాడు.అప్పుడు వాడు నేనుంటున్న గదిని ఖాళీ చేసి ఆమె ఇంటికి మారిపోయాడు.వాళ్లకు ఒకమ్మాయి కూడా పుట్టింది.ఇప్పుడు ఆ అమ్మాయి వాడికి బ్రేక్ అప్ చెప్పి వాడి మీద తనను,పిల్లను హింసిస్తున్నాడని కేసు పెట్టిందిట.ఈ కేసు ఇప్పట్లో తేలదు.ఇక పోలీసుల చుట్టూ ,కోర్టుల చుట్టూ తిరగవలసిందే.చదువు కోసం,వుద్యోగం కోసం కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి వచ్చిన రాహుల్ దారి తప్పాడు.అది గాడిలో పడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది.రాహుల్ వాళ్ళది బీహార్.అతని తల్లి తండ్రులు ఇతను ఎప్పుడు వస్తాడా అనీ ఇండియాలో ఎదురు చూస్తున్నారు.కానీ వాళ్లకు ఇతని పరిస్థితి తెలియదు.
ఒక రోజు నేను,లహరి ఒక ఉద్యోగ కోసం ఒక కంపెనీకి వెళితే అక్కడ నాకు శంకర్ కలిసాడు.అతను నా కన్నా బాగా సీనియర్.అతను అమెరికా వచ్చి పదేళ్లు అయింది.శంకర్ వాళ్ళ నాన్న గారు అనారోగ్యంతో హైదరాబాద్ లో నిన్న రాత్రి చనిపోయారట.ఇప్పుడు అతను కుటుంబంతో కలిసి ఇండియాకి వెళ్లే హడావుడిలో వున్నాడు.అతని భార్యకు వాడి తల్లి తండ్రులతో గొడవల వల్ల ఆమె రానని చెప్పిందిట.ఆ బాధలన్నీ నాతో చెప్పి వాడు వెళ్ళిపోయాడు.
అప్పుడు లహరి బాధ పడుతుంటే “మనం అమెరికాను చూసి మోసపోయాము.మన దేశంలో కులాలు,మతాల గొడవలు,ఇక్కడేమో వర్ణ వివక్షత;దానికి తోడు మన వాళ్ళు తమ అవలక్షణాలన్నిటినీ ఇక్కడికి తెచ్చి ఇక్కడి వాతావరణాన్ని కూడా పాడు చేసారు.పూర్వం విజ్ఞానం కోసం,విద్య కోసం తెలివైన వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు.ఇప్పుడు అందరూ డబ్బు కోసం వస్తుండటంతో ఇక్కడి వాతావరణం కూడా కలుషితం అయిపోతునాది.అమెరికా అంటే మనకు దూరపు కొండలు.అవి నునుపుగా ఉన్నట్లు కనిపిస్తాయి కానీ అది నిజం కాదు.మనం ఈ అమెరికా అనే కొండల దగ్గరకు వచ్చి చూస్తే మనకు నిజం తెలిసింది ” అనీ చెప్పాను.
ఆ తరువాత నాలో అంతర్మధనం మొదలైంది. మనిషికి డబ్బు ముఖ్యమే కానీ అదే జీవితం కాదు.దాని వెంట పడరాదు.మనిషికి శాంతి డబ్బు,డాల్లర్లతో రాదు. మానసిక శాంతి వల్ల వస్తుంది.
ఒక రోజు నేను లహరి ఇండియా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాము.మన దేశంలో,మన తల్లి తండ్రుల సమక్షంలో,మనం పుట్టిన నేలలో కలో గంజో తాగినా హాయిగా ఉంటుంది.వారం తరువాత నేను మా నాన్నతో” “నాన్నా, నాకు ఇక్కడ ఉద్యోగం లేకపోయినా,డబ్బు సంపాదించక పోయినా ఇక్కడ గడించిన అనుభవం చాలా విలువైనది. అమెరికా నాకు ఒక పాఠం చెప్పింది.మనిషికి శాంతి డబ్బు కన్నా ముఖ్యం”అనీ తెలుసుకున్నాను,కాబట్టి నేను అక్కడికి వచ్చేద్దామనుకు అంటున్నాను”అనీ చెప్పాను.
లహరి కూడా ఆమె తల్లి తండ్రులకు చెబితే వాళ్ళు కూడా ఆమెను వెంటనే వచ్చేయమని చెప్పారు.ఎన్నో కలలతో ఈ దూరపు కొండల నునుపుని చూసి వచ్చిన మాకు అమెరికా ఒక మంచి పాఠాన్ని,గుణపాఠాన్ని నేర్పింది. వారం తరువాత నేను,లహరి కలిసి ఇండియాకి వెళ్ళిపోయాము.మేము ముందే అనుకున్నట్లు మేమిద్దరం మా తల్లి తండ్రులతో చెప్పి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాము.ఇప్పుడు మేమిద్దరం మా వూళ్ళో మా అమ్మ నాన్నలతో ఉంటూ ఇంటర్వ్యూలకు వెళుతున్నాము.లహరి కొందరి పిల్లలకు ట్యూషన్స్ చెప్పటం మొదలుపెట్టింది.నేను కూడా వ్యవసాయం చెయ్యడం మొదలుపెట్టాను.ఇప్పుడు జీవితం మీద మాకు బెంగ పోయింది.ఏం జరిగితే అది జరుగుతుందన్న ధీమా మాలో ప్రవేశించింది. ఎందుకంటే ఇప్పుడు మాకు దూరపు కొండల మీద భ్రమలు తొలగిపోయాయి.(
5.సన్నిహితం… శీర్షిక

కొందరు అంతే
ఆఫీసులో మాకు హెల్పర్ గా పని చేస్తున్న ” సాయి ” ను గమనిస్తున్నాను నేను. పొద్దున్న రాగానే మంచినీళ్లు పెట్టీ , తర్వాత టీ ఇచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత మధ్యాహ్నం దాకా కనబడలేదు. అవసరం అయి ఫోన్ చేస్తే వస్తాడు.
” ఎక్కడున్నావు సాయి..జెరాక్స్ పని ఉంది ” అని అడిగితే ” ఇక్కడే బయట చెట్టుకింద ఉన్నాను సార్ ” అని చెప్పాడు.
పాతికేళ్ల క్రితం , అతను నేను ఒకసారే జాబ్ లో జాయిన్ అయ్యాము. నేను పర్మినెంట్ ఆఫీసర్ ను అయితే అతని కాంట్రాక్ట్ హెల్పర్. మొదట్లో బాగానే పనిచేసేవాడు.రాను రాను పని తగ్గించడం మొదలు పెట్టాడు.అతన్ని తీసేద్దాం అని ఎన్నోసార్లు అనుకున్నా పోనీలే పెళ్లయి పిల్లలున్నవాడు అని జాలిపడి వదిలేసే వాళ్ళం. ఇప్పుడు కూడా నీళ్లు పెట్టీ ఎటో పోయాడు. ఫోన్ చేసిన అరగంట తర్వాత వచ్చాడు. మొహం అంతా నిద్రమత్తుతో ఉన్నాడు. చిరాకేసింది నాకు.
తొలిరోజుల్లో అతనికి కొత్త పని ఏదైనా నేర్పించాలని ఎంతో ప్రయత్నించాను. ఒక కంప్యూటర్ ఇచ్చి పని నేర్చుకోమన్నాను . కుదురుగా కూర్చోలేక ఆ పని మానేశాడు. బయటకు పోయి వేరే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునే వాడు.
ఇంకోసారి , ఏదైనా టెక్నికల్ పని నేర్చుకో అని సలహా ఇచ్చాను. ఏమీ మాటాడకుండా మౌనంగా ఉండిపోయాడు.
ఇంకోసారి పోనీ నా దగ్గర పియ్యే లాగ పని చేయి. ఫోన్ లు ఆన్సర్ చెయ్యడమే కదా బాగుంటుంది అని చెప్పాను. ” నా వల్ల కాదు సార్ ” అని తప్పించుకున్నాడు.
కాలం గడిచిపోయింది.ఇప్పుడు ముసలాడు అవుతున్నాడు .కానీ అదే హెల్పర్ పని.
ఒకరోజు అడిగాను ” ఈ తక్కువ జీతంతో ఎలా బతుకుతున్నావు ? ” అని.
” నాకు ఇంటిదగ్గర కూరగాయల షాప్ ఉంది సార్.నా భార్య చూసుకుంటుంది. ప్రభుత్వం ఈ మధ్యనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చింది. ఇంకా ఉచిత పథకాలు బోలెడు వస్తాయి.” అని ధీమా గా చెప్పాడు.
అప్పుడు అర్థం అయింది నాకు వాడు ఎందుకు తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడం లేదో అని.
అయినా తప్పు నాది , ‘ ఇలాంటి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించడం వృథా ‘ అని అర్థం చేసుకున్నాను.
కొందరు అంతే .కంఫర్ట్ జోన్ కి అలవాటు పడిపోతారు.ఎదిగే ప్రయత్నం చేయరు.ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు.ఏమీ చేయలేం.. అంతే వాళ్ళని అలా వదిలేద్దాం.మన పని మనం చేసుకుందాం !!!!!
6.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

చంకలబంటి దిగినవానికి చలేంది..?
బంటి ‘ అంటే ‘ వరకు ” అని అర్థం. ఈ సామెతనే “నిండా మునిగినవానికి చలేమిటి?” అని కూడా వ్యవహరిస్తారు. ఒక విషయంలో, లేదా వ్యవహారంలో అప్పటికే నిమగ్నమైనవానికి, అందులోని ఇబ్బంది అంతగా బాధించదు. ఇప్పుడు, చలికాలం నడుస్తుంది కదా! దీనినే “చెలికాలం” అని ఒక చిలిపి కవి చమత్కరించాడు. అంటే అర్థమైంది కదా! చల్లనీటితో స్నానం చేయాలంటే ఈ వింటర్ లో చచ్చేచావు. ఒక్కోసారి వేడినీళ్ళు దొరకవు. మొదటి రెండు చెంబులు (ఇప్పుడు మగ్గులు) ఒంటిమీద పోసుకున్నప్పుడు చలి వణికిస్తుంది. మూడో మగ్గు నుంచి శరీరం అలవాటు పడిపోతుంది. మిగతా స్నానం అంత బాధనిపించదు. ఈ చలికాలాన్ని, హేమంతాన్ని, పోతన్నగారు తమ భాగవతంలో చక్కగా అభివర్ణించారు, దశమస్కందంలో.
కం. అహములు సన్నములయ్యెను
దహనము హితమయ్యె, దీర్ఘదశలయ్యెనిశల్
బహుశీతోపేతంబయి
ఉహుహూయనివడకెలోకముర్వీనాథా !
భగవంతుని సృష్టిలోని విచిత్రమేమంటే, నూతుల్లో, జలాశయాల్లో, నీరు చలికాలం గోరువెచ్చగా, వేసవిలో చల్లగా ఉంటుంది. ఫరెవర్ కన్వీనియన్స్ అన్నమాట !
మన జీవితంలో కూడా, కష్టాలు, ఇబ్బందులు, వస్తాయి. మొదట్లో సహించలేం. కానీ పూర్తిగా దాంట్లో దిగింతర్వాత, అలవాటయిపోతుంది. పేదరికాన్ని ఎంజాయ్ చేసిన మహనీయులు ఎంతమంది లేరు? సత్యహరిశ్చంద్ర చక్రవర్తికి వచ్చినన్ని కష్టాలు ఎవరికీ వచ్చి ఉండవు. అయినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. నిజం కోసం నిలబడ్డాడంతే.
పైగా అంటాడూ..” ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుండు గతించిన పిదప , అయ్యో ఈ కష్టములకు తావెక్కడిది?” తాను చనిపోతే పాపం ఈ కష్టాలేమైపోతాయో అని బాధపడుతున్నాడు. ‘ చంకలబంటి ‘ కాదు, నిండా మునిగిన వానికి చలి ఉండకపోవడం అంటే ఇదేమరి !
ఏకాదశిలాంటి పర్వదినాల్లో ఉపవాసాలు చేస్తుంటారు. ఉదయం ఎనిమిదిన్నరకల్లా ఫాస్టింగ్ బ్రేక అవ్వకపోతే, కడుపులో ప్రేగులు అరుస్తాయి. అరుస్తాయి. మామూలుగా అయితే. కాని పది గంటల తర్వాత ఆకలికి అలవాటు పడతారు. దైవికమైన సపోర్టు ఎలాగూ ఉంటుందనుకోండి. అన్నం, పప్పు, కూర తప్ప అన్నీ తినే ఉపవాసులకు ఇది వర్తించదు సుమండీ!
ఈ ముంగడంలో స్థాయిలున్నాయి. మోకాళ్ళవరకు, నడుము వరకు, సామెతలో చెప్పినట్టు ‘ చంకల బంటి చివరిదే నిండా…మన నిగ్రహాలను, సహనాలను బట్టి చలి ఉంటుంది. అంటే వచ్చిన సమస్యను స్వీకరించడం, దాన్ని అనుకూలంగా మార్చుకోవడం. ఇట్లా ఇది వ్యక్తిత్వ వికాసానికి కూడ రెలెవెంట్ అవుతుంది మరి ! మా నాన్నగారు , బ్రహ్మశ్రీ, శతావధాని, పౌరాణిక రత్న, పాణ్యం లక్ష్మీనరసిం హ శాస్త్రి గారు తరచుగా ఒకమాట అనేవారు. “ఇంతకంటే చెడిపొయ్యేదేముంది! కానీ!” చెడిపోవడం అంటే ఆయన దృష్టిలో సమస్యలో కూరుకుపోవడం. దాన్ని వేదాంత పరిభాషలో కాకుండా, అట్లా చెప్పేవారాయన.
చక్కని ఉపన్యాసాలు చెప్పేవారు, ప్రవచనాలు చేసేవారు, మధ్యలో చక్కని సామెతలు సందర్భోచితంగా వాడి, శ్రోతలనలరింపజేస్తుంటారు. సామెతలు పాయసంలో జీడిపప్పు పలుకుల్లాంటివి. ఒక పండితుడు పురాణం చెబుతున్నాడట. ఏకధాటిగా, మధ్యలో పద్యాలు, చమత్కారాలు, చివర్లో ఒకాయన అడిగాడట. “స్వామీ! ఇంతసేపు అలా అరుస్తున్నారే! మీకు గొంతునొప్పి రాదా?” ఆయన పాండిత్యం, అతనికి అరవడం లా అనిపించింది. పౌరాణికుడు నవ్వి, ఇట్లా అన్నాడట. “నాయనా! నిండా మునిగిన వానికి చలి ఉండదు. మధ్యలో గాత్రం ఇబ్బంది పెడుతుంది. కానీ మిమ్మల్ని రంజింపచేయాలన్న వ్యగ్రత వల్ల ఏకాగ్రత వల్ల అంత బాధించదు. ” అదీ కళాకారుడంటే!
‘ కృష్ణమాయ ‘ సినిమాలో నారదుడు పరమాత్మను సంసారసాగరంలో పడ్డావని పరిహసించి, తాను దానికి అతీతంగా హాపీగా ఉన్నానంటాడు. కృష్ణయ్య, తనమాయతో, నారదుడికి, ప్రేమ, పెళ్ళి, సంసార జంఝాటం అంతా కల్పిస్తాడు. నిండా అందులో మునిగిపోతాడు నారదుడు. మాయ అని తెలియదు కాబట్టి చలివెయ్యదు. హాయిగా ఉంటుంది పైగా! నారదునిగా అక్కినేని వారి నటన చూసి తీరవలసిందే! కృష్ణుడేమో ఈలపాట రఘురామయ్య గారు. యూట్యూబ్ లో చూడండి.
దీనికి రివర్స్ సామెతలున్నాయండోయ్.! “పోనుపోను భుజం మీది చద్దిమూట కూడ బరువవుతుంది. “తినగ తినగ వేము తియ్యనుండు” ఐతే ఈ సామెతకు చెల్లెలే! దీన్నే షేక్ స్పియర్ గారు “స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ” అన్నారు. కష్టాల ఫలితాలు మధురాలట ! ఏమైనా, కొంచెం ఓర్పు, రాజీ ధోరణి ఉంటే, బ్రతికెయ్యవచ్చు. నీటిలో దిగడానికే భయపడేవాళ్ళనేం చేయలేం మరి !
ఇంకో సామెతతో వచ్చేవారం…
7.వినరో భాగ్యము – శీర్షిక

సంపంగి ప్రాకారంలో నాలుగు కాళ్ల మండపాలు
తిరుమలేశుని ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసిన విజయనగర రాజవంశీకులలో ఆ ఆలయ ప్రాంగణంలోనే నాలుగు మూలల్లో తన కుటుంబ సభ్యుల పేరున నాలుగు కాళ్ళ మండపాలను నిర్మించుకున్న ఘనత మాత్రం సాళువ నరసింహరాయలు కు దక్కుతుంది. ఇప్పటి మహాప్రాకారానికి గర్భాలయానికి మధ్య ఇప్పటి వెండివాకిలికి అనుబంధంగా నిర్మించిన సంపంగి ప్రాకారంలోనే ఒకప్పుడు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఊరేగింపులు నిర్వహించేవారు.
ఆ సందర్భంగా ఊరేగింపునకు వచ్చే స్వామివారు సేద తీరడం కోసమని సాళువ నరసింహరాయలు సంపంగి ప్రాకార మార్గంలో 1470 లో నాలుగు మూలల్లో తన పేరున, తన భార్య, ఇద్దరు కుమారుల పేరున నాలుగు మూలల్లో నాలుగు కాళ్ళ మండపాలను నిర్మించినట్టు శాసనాధారాలు పేర్కొంటున్నాయి . అందుకు తగినట్టుగానే చూసేందుకు ఒకే విధంగా కనిపించే ఆ మండపాలు నైరుతి వాయవ్య దిశలోని మండపాలు 8 అడుగుల 6 అడుగుల పొడవు వెడల్పుల కొలతలతో ఉంటే ఆగ్నేయ దిశలోని మండపం 11 అడుగుల చతురశ్రంలో, ఈశాన్య దిశలోని మండపం 12 . 3 , 11. 6 పొడవు వెడల్పుల కొలతలతో ఉండటం విశేషం.
ఆ కాలంలో ఆ మండపాలలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు వేంచేసినప్పుడు అర్చనలు, ప్రసాద నివేదనలు నిర్వహించేవారు. కాలక్రమంలో ధ్వజస్తంభానికి కుడివైపు గా ఉన్న మండపం ఒక్కటే వినియోగంలో ఉంది . అక్కడ ప్రస్తుతం తిరుమల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ వంటి విశేష కార్యక్రమాల సందర్భంలో మాత్రమే తిరుమలేశుని ఉత్సవమూర్తులు వేంచేపు కొలువు కొనసాగుతోంది . ఆ మండపానికి ముందే భక్తులు స్వామి వారికి తులాభారం మొక్కుబడి తీర్చుకునే వ్యవస్థను ఇటీవలి దశకాల మధ్యకాలంలో ఏర్పాటు చేశారు.
ఓం నమో వెంకటేశాయ
మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@gmail.com

