159 Crores | పయనీర్ ఆధ్వర్యంలోభారీ ఎయిర్ క్రాఫ్ట్ హబ్

159 Crores | పయనీర్ ఆధ్వర్యంలో భారీ ఎయిర్ క్రాఫ్ట్ హబ్
- రామకుప్పం మండలం మునేంద్రంలో
- 159 కోట్ల పెట్టుబడి, 250 మందికి ఉపాధి
- ఆంధ్రప్రదేశ్‌కు విమానయాన పరిశ్రమ కొత్త దిశ
159 Crores | చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రూ.159 కోట్ల పెట్టుబడితో భారీ ఎయిర్ క్రాఫ్ట్ హబ్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 250 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, కుప్పానికి జాతీయ స్థాయిలో విమానయాన పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. రామకుప్పం మండలం మనెంద్రం గ్రామంలో పయనీర్ క్లీన్ యాంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Private Limited)సంస్థ సమగ్ర విమాన తయారీ, నిర్వహణ, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హంస–3 (ఎన్జీ) టూ సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ, నిర్వహణ, పైలట్ శిక్షణతో పాటు విమానయాన సంబంధిత అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని రూపొందిస్తున్నారు.
159 Crores | విమానాల తయారీలో సంస్థకు ప్రత్యేక అనుభవం
పయనీర్ క్లీన్ యాంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విమానయాన రంగంలో దేశవ్యాప్తంగా మంచి పేరుంది. విమానాల తయారీ, నిర్వహణ, సాంకేతిక శిక్షణ, ఏవియేషన్ సర్వీసుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థగా గుర్తింపు పొందింది. హంస 3 టూ సీటర్ ట్రైనర్ విమానాల తయారీలో (Aircraft Manufacturing) సంస్థకు ప్రత్యేక అనుభవం ఉంది. పైలట్ శిక్షణకు అనువైన రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన డిజైన్ ఈ సంస్థ ప్రత్యేకత. దేశీయంగా అనేక పైలట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్లు, ఏరో క్లబ్‌లు ఈ సంస్థ తయారు చేసిన ట్రైనర్ విమానాలను వినియోగిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ విమానాలకు డిమాండ్ పెరుగుతోంది. విమానాల తయారీతో పాటు నిర్వహణ సేవలు, విడిభాగాల సరఫరా, విక్రయానంతర సేవల్లో సంస్థ విశ్వసనీయతను సంపాదించింది. భద్రత, నాణ్యత, సమయపాలన వంటి అంశాల్లో రాజీ పడని సంస్థగా పేరుగాంచింది.

159 Crores | కుప్పంలో సమగ్ర విమాన తయారీ కేంద్రం
కుప్పంలో ఏర్పాటు కానున్న కేంద్రంలో విమానాల తయారీ, నిర్వహణ, పైలట్ శిక్షణ, సాంకేతిక సిబ్బంది శిక్షణ వంటి అన్ని విభాగాలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. ఏటా 108 టూ సీటర్ ట్రైనర్ (Trainer) విమానాలను తయారు చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ, అంతర్జాతీయ పైలట్ శిక్షణ సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నమూనాల విమానాలు, శిక్షణ పరికరాలు, సిమ్యులేటర్లు కూడా తయారు చేయనుంది. ఈ కేంద్రం ద్వారా స్థానిక యువతకు విమానయాన రంగంలో అవసరమైన నైపుణ్య శిక్షణ అందించాలన్నది సంస్థ లక్ష్యం. దీంతో జిల్లాలోని యువతకు దేశీయంగా, అంతర్జాతీయంగా ఉద్యోగ అవకాశాలు పెరుగనున్నాయి.

159 Crores | ప్రభుత్వ ఆమోదం, భూమి కేటాయింపు
ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. పారిశ్రామిక, వాణిజ్య శాఖ ఉత్తర్వుల మేరకు సంస్థకు 55.47 ఎకరాల భూమి కేటాయించారు. ఈ నెల 6న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ (Green Signal) లభించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.159 కోట్ల పెట్టుబడి రానుండగా, 250 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. మొత్తం ప్రాజెక్టు రెండు దశల్లో పూర్తికానుంది. మొదటి దశలో 28.30 ఎకరాల్లో రూ.61.11 కోట్ల వ్యయంతో 2027 ఏప్రిల్ నాటికి పనులు పూర్తవుతాయి. ఇందులో 100 మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో 27.17 ఎకరాల్లో రూ.95.04 కోట్లతో 2030 జూలై నాటికి పనులు పూర్తి చేస్తారు. మరో 150 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు.

159 Crores | కుప్పానికి పారిశ్రామిక ప్రాధాన్యం
గతంలో హిందాల్కో ఇండస్ట్రీస్ సంస్థ కుప్పంలో రూ.586 కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ హబ్ రావడంతో కుప్పం పారిశ్రామిక కేంద్రంగా మారే అవకాశాలు మరింత బలపడుతున్నాయి. ఈ ప్రాజెక్టుతో చిత్తూరు (Chittoor) జిల్లాకు విమానయాన పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయి.

