బెదిరింపు సంసృతి సరైనది కాదు..!

బెదిరింపు సంసృతి సరైనది కాదు..!
క్యాతన్ పల్లి, ఫిబ్రవరి 08, (ఆంధ్రప్రభ) : క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను బెదిరించే ప్రక్రియ, సంస్కృతి సరైనది కాదని బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి, సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్ మండిపడ్డారు. పట్టణంలోని 14వ వార్డులో పార్టీ కౌన్సిలర్ కు కొప్పి రాజశేఖర్ కు చెందిన వాల్ పోస్టర్లను చింపి వేయడం పనికి మాలిన చర్య అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు కాకా వెంకటస్వామి ఆదర్శప్రాయం రాజకీయాలు నెరిపారని, ఆయన్ను మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అంతేతప్ప గూండా రాజకీయాలు పనికి రావని హితవు పలికారు. తమ పార్టీ అభ్యర్థులను ఫోన్లు చేసి బెదిరించడం లేదంటే ఇక్కడి నుండి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేయడం హేయమైన చర్యగా రాజా రమేష్ అభివర్ణించారు.
మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఆరు గ్యారెంటీ ల పైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపైన దృష్టి సారించాలని ఓటమి భయంతో ఇలాంటి వాతావరణాన్ని సృష్టించడం సమంజసం కాదన్నారు. ఇకనైనా ఈ వాతావరణానికి స్వస్తి చెప్పి, ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి ఇచ్చిన సొంత మేనిఫెస్టో అమలు చేయడానికి కృషి చేయాలి తప్ప ఇతర పార్టీల నాయకులను బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలని చెప్పారు. ఎంత బెదిరింపు ధోరణి అవలంభించినప్పటికీ క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల విజయం తథ్యమని.. తమ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరని రాజా రమేష్ స్పష్టం చేశారు.ఇక్కడ ప్రజలు చాలా స్పష్టంగా బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా వెల్లడించారు.
