1350 cusecs | పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి..

1350 cusecs | పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి..
- దాములూరు మేజర్‌కు 350 క్యూసెక్కులు ఇవ్వాలి..
- అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్
1350 cusecs | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట నియోజకవర్గంలో తీవ్రంగా నెలకొన్న సాగునీటి సమస్యపై ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ శాసనసభలో జీరో అవర్ సందర్భంగా గళం విప్పారు. బోనకల్లు బ్రాంచ్ కాల్వ పరిధిలోని వత్సవాయి, వీర్లపాడు, నందిగామ మండలాలకు చెందిన వేలాది ఎకరాల భూములు పూర్తిగా ఈ కాల్వపైనే ఆధారపడి ఉన్నాయని, అయితే అవసరమైన స్థాయిలో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు.
బోనకల్లు బ్రాంచ్ కాల్వ సామర్థ్యం 1350 క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం కేవలం 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో బోనకల్లు మండలం దాటిన తర్వాత కాల్వలో నీరు ముందుకు వెళ్లడం లేదని, వత్సవాయి మండలానికి 30 క్యూసెక్కులకు మించి నీరు రావడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఈ సమస్యకు తక్షణ పరిష్కారంగా బీబీసీకి పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని, దాములూరు మేజర్‌కు కనీసం 350 క్యూసెక్కుల నీటిని కేటాయించాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి కొరత కారణంగా వరి, ఇతర వాణిజ్య పంటలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సాగునీరు లేకపోతే రైతుల జీవనం పూర్తిగా కుదేలవుతుందని, వ్యవసాయమే ఆధారంగా ఉన్న ప్రాంతాల్లో నీటి సమస్యను నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని శ్రీరామ్ రాజగోపాల్ ప్రకటించారు. బోనకల్లు బ్రాంచ్ కాల్వకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేసి, దాములూరు మేజర్‌కు అవసరమైన క్యూసెక్కుల నీటిని అందిస్తేనే వేలాది ఎకరాల పంటలు రక్షించబడతాయని ఆయన స్పష్టం చేశారు.
