1000 Yrs | వెయ్యేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం… కంగుంది కోట

1000 Yrs | అరణ్యంలో వెలసిన రాజదుర్గం

  • కంగుంది కోట చారిత్రక నేపథ్యం
  • నాటి శిల్పకళకు అద్దం పడుతున్న నిర్మాణం
  • మల్లేశ్వర స్వామి ఆలయం – కోటలో ఆధ్యాత్మిక కేంద్రం
  • గుహలు, రహస్య మార్గాలు – ఆసక్తికర కథలు
  • ప్రకృతి రమణీయతతో పర్యాటక ఆకర్షణ
  • పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చర్యలు
  • ఒక యుగానికి ప్రతీక అయిన కంగుంది కోట

1000 Yrs | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో తమిళనాడు (Tamilnadu) సరిహద్దు అటవీ ప్రాంతంలో ఉన్న కంగుంది కోట వెయ్యేళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీ.శ. 1066 నుంచి 1950 వరకూ దాదాపు 28 తరాల పాటు కంగుంది జమీందారులు ఈ కోట నుంచే పరిపాలన సాగించారు. బలమైన గోడలు, ఎత్తైన బురుజులు, స్వాగత ద్వారాలు, ఆలయాలు, గుహలతో కూడిన ఈ కోట నాటి పాలెగాళ్ల వైభవాన్ని నేటి తరానికి గుర్తు చేస్తోంది. కుప్పం, రామకుప్పం మండలాల మధ్య విస్తరించిన ఈ ప్రాంతం పూర్వకాలంలో దట్టమైన అరణ్యంగా ఉండేది. మానవ సంచారానికి కూడా వీలులేని అడవుల్లో ఎరుకలు, యానాది కులాలకు చెందిన బందిపోటు దొంగలు అక్కడక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించేవారు. ఈ అరణ్యంలోనే సుమారు వెయ్యి అడుగుల ఎత్తైన సహజ సిద్ధమైన కొండపై కంగి–కంగడు అనే దంపతులు తమ రాజధానిగా కంగుంది కోటను నిర్మించారు.

1000 Yrs

1000 Yrs | కోట నిర్మాణం నాటి శిల్పకళ

1066 నుంచి 1132 మధ్య కాలంలో కంగి కంగడు దంపతులు కుప్పం ప్రాంతానికి అధిపతులుగా పాలించారు. నాటి పాలకుల పేరును చిరస్థాయిగా నిలిపే విధంగా ఈ ప్రాంతానికి కంగుంది దుర్గం అనే పేరు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. ఆ తర్వాత జమీందారీల పాలన కొనసాగుతూ 1950 వరకు ఈ కోట పాలనా కేంద్రంగా ఉపయోగంలో ఉండింది. కోట నిర్మాణం (Fort construction) నాటి శిల్పకళకు అద్దం పడుతోంది. బలిష్టమైన రాళ్లతో నిర్మించిన బురుజులు, ఎత్తైన గోడలు, ప్రవేశ ద్వారాలు, మండపాలు, పాతకాలపు ఫిరంగి, నీటి బావులు ఇప్పటికీ చెక్కుచెదరని స్థితిలో ఉన్నాయి. శత్రు దాడులను తిప్పికొట్టేందుకు వ్యూహాత్మకంగా ఈ కోటను నిర్మించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కోటపై ఉన్న మల్లేశ్వర స్వామి శివాలయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కోట పరిసరాల్లో ఉన్న గుహలు మరో ఆసక్తికర అంశం. కొన్ని గుహల్లో పశువుల ఎముకలు, కొమ్ములు కనిపించడంతో వీటిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నాటి కాలంలో దాచిన నిధులు, రహస్య మార్గాలు ఉండేవని గ్రామ పెద్దలు చెబుతుంటారు.

1000 Yrs

1000 Yrs | రమణీయమైన ప్రకృతి

కోట చుట్టూ విస్తరించిన కొండలు, అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఎత్తైన ప్రదేశం నుంచి కనిపించే దృశ్యాలు పర్యాటకులను మైమరపిస్తాయి. ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి కార్యక్రమాలకు ఈ ప్రాంతం అనువైన కేంద్రంగా మారుతోంది. చిత్తూరుకు పడమరగా సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంగుంది గ్రామం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. నాటి పాలెగాళ్ల పాలన, జమీందారీల పరిపాలన, అటవీ జీవనం అన్నింటికీ ఈ కోట మౌన సాక్షిగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు చొరవతో కంగుంది కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటకుల సౌకర్యార్థం మెట్లు, తాగునీటి వసతి,(Drinking water facility) విశ్రాంతి స్థలాలు, మార్గదర్శక బోర్డులు ఏర్పాటు చేశారు. తదేకా ఫౌండేషన్ వంటి సంస్థలు కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నాయి. కోట పరిసర ప్రాంతాలు స్థానిక కళలకు, వీధి నాటకాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా మారుతున్నాయి. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయ కళలు, చారిత్రక కథనాలు ఇక్కడ ప్రదర్శితమవుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

1000 Yrs

1000 Yrs | ఒక చారిత్రక సాక్ష్యం

కంగుంది కోట (Kangundi Fort) కేవలం రాళ్లతో నిర్మించిన కట్టడమే కాదు. అది ఒక యుగానికి చెందిన చరిత్ర, ఒక ప్రాంతానికి చెందిన సంస్కృతి, ఒక తరానికి చెందిన వారసత్వం. నాటి పాలకుల పాలనా శైలి, ప్రజల జీవన విధానం, అటవీ జీవితం అన్నింటినీ ఈ కోట మనకు గుర్తు చేస్తోంది. ఆధునిక కాలంలో కూడా ఈ చారిత్రక కట్టడాన్ని కాపాడుకుంటూ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని అందించడం అవసరం. చరిత్ర, సంస్కృతి, ప్రకృతి సౌందర్యం అన్నింటి సమ్మేళనంగా కంగుంది కోట చిత్తూరు జిల్లాకు గర్వకారణంగా నిలుస్తోంది.

1000 Yrs
1000 Yrs

CLICK HERE TO READ యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

CLICK HERE TO READ MORE

Leave a Reply