Youtube | వ్యూస్ కీ ఆశపడి అశ్లీల కంటెంట్ పెట్టారో…

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇంట‌ర్నెట్ ఓపెన్ చేయ‌గానే గూగుల్ (Google) త‌ర్వాత ఎక్కువ‌మంది ఉప‌యోగించేది యూట్యూబ్ (Youtube ) అంటే అతిశ‌యోక్తి కాదు. ఏం వీడియో కావాల‌న్నా మ‌నం యూట్యూబ్‌లో సెర్చ్ (Search) చేస్తాం. రోజూ కొన్ని కోట్ల వీడియోల‌ను ఇంట‌ర్నెట్ యూజ‌ర్లు (Internet users) చూస్తున్నారు. నెట్ బాగా అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత యూట్యూబ్ వాడ‌కం కూడా బాగా పెరిగిపోయింది. అయితే యూట్యూబ్‌లు చూడ‌డం మాత్ర‌మే కాదు యూట్యూబ్‌లో వీడియోలు పెట్ట‌డం ద్వారా పెద్ద ఎత్తున సంపాదించేవాళ్లు మ‌న మ‌ధ్యేనే చాలామంది ఉన్నారు. అయితే ప‌లు యూట్యూట్ ఛాన‌ళ్ల‌కు గూగుల్ తీసుకున్న నిర్ణయం షాకింగ్ న్యూస్ (Shocking news) అనే చెప్పవచ్చు. సోషల్ మీడియా వేదికల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా, అశ్లీల కంటెంట్ ను అరికట్టేందుకు టెక్ దిగ్గజాలు ఈ చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ (Google)కు చెందిన వీడియో ప్లాట్ ఫామ్ యాప్ యూట్యూబ్ (Youtube) నుంచి దాదాపు 11 వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. వాస్తవాలను వక్రీకరిస్తూ వివిధ దేశాలపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను దారి తప్పించేలా కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. తొలగించిన ఛానళ్లలో అత్యధికంగా చైనా (సుమారు 7,700), రష్యా (2,000 పైగా) దేశాలకు చెందినవే ఉన్నాయి. చైనాకు చెందిన ఛానళ్లలో భారత్‌లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ కంటెంట్‌ ప్రసారం చేసినట్లు గూగుల్ వివరించింది. ఇక రష్యా యూట్యూబ్‌ ఛానళ్లు ఉక్రెయిన్‌-నాటోలను విమర్శిస్తూ, రష్యాకు మద్దతుగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించింది.

చైనా, రష్యాలతో పాటు ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్, రొమేనియా, అజర్‌బైజాన్, ఘనాలకు చెందిన యూట్యూబ్‌ ఛానళ్లను కూడా గూగుల్ తొలగించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను గూగుల్‌ ఉద్దేశపూర్వకంగా నిలిపివేసింది. కాగా, 2025 తొలి త్రైమాసికంలోనే మొత్తం 23,000కు పైగా ఖాతాలను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది. మరోవైపు, మెటా (Meta) కూడా డిజిటల్ భద్రతపై దృష్టి పెడుతూ, ఇటీవలే దాదాపు 10 మిలియన్ల నకిలీ ప్రొఫైల్‌లను తొలగించినట్లు ప్రకటించింది.

Leave a Reply