హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మన దేశానికి యువతే గొప్ప బలమని, వారికి విద్య ఒక అద్భుతమైన బహుమతి, శక్తివంతమైన ఆయుధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అన్నారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని లక్ష్యంగా తెలంగాణలో ‘యంగ్ ఇండియా’ పేరిట పలు కార్యక్రమాలు ప్రారంభించామని ఆయన వెల్లడించారు.

కేరళలోని అలప్పుజలో జరిగిన ‘ఎంపీ మెరిట్ అవార్డు–2025(MP Merit Award–2025)’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ పాల్గొని విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(MP Merit Award-2025, MP, AICC General Secretary KC Venugopal) ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్.. పేదలు, అణగారిన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నకేసీ వేణుగోపాల్‌(KC Venugopal)ను ప్రశంసించారు. ఆయన ప్రారంభించిన మెరిట్ అవార్డులు విద్యార్థులను ప్రోత్సహించడానికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

కేరళ విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శమని, తెలంగాణలో కూడా విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్ర జీడీపీ(State GDP)ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల(3 trillion dollars)కు చేర్చడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.

కేవలం 55 రోజుల్లోనే 11,055 ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గుర్తుచేశారు. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్(Young India Residential Schools), యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభించినట్లు వివరించారు.

యువత రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే, 21 ఏళ్ల వయసు నుంచే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని అభిప్రాయపడ్డారు. యువతే దేశానికి, కాంగ్రెస్ పార్టీకి నిజమైన బలం, వారే బ్రాండ్ అంబాసిడర్లు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply