YOUTH | పంచాయతీ ఎన్నికల్లో యువతరం సత్తా

YOUTH | పంచాయతీ ఎన్నికల్లో యువతరం సత్తా
- మారుతున్న గ్రామ రాజకీయాలు
YOUTH | బీబీనగర్, ఆంధ్రప్రభ : పంచాయతీ ఎన్నికల ఫలితాలు గ్రామ రాజకీయాల్లో స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. ఇప్పటివరకు అనుభవం, కుల సమీకరణలు, ఆర్థిక బలం ఆధారంగా సాగిన రాజకీయాలకు చెక్ పెడుతూ యువతరం ప్రజా సమస్యలను అజెండాగా మార్చింది. ఈ ఎన్నికలు “యువతరం రాజకీయ ప్రవేశం”కు మైలురాయిగా మారాయి.
బట్టుగూడెం గ్రామానికి చెందిన బీజేవైఎం రాష్ట్ర నాయకులు అంబటి తరుణ్ రెడ్డి నాయకత్వంలో సాగిన ప్రచారం, సంస్థాగత బలం ఎలా ఫలితాలుగా మారుతుందో చూపించింది. ఒక్క గ్రామానికే పరిమితం కాకుండా చిన్నరావులపల్లి, లక్ష్మీదేవిగూడెం, పెద్దపలుగు తండల వరకు ప్రభావం విస్తరించడం యువ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి నిదర్శనం.
పడమటిసోమారం గ్రామంలో తంతరపల్లి ప్రదీప్ గౌడ్ తీసుకున్న రాజకీయ నిర్ణయం ఈ ఎన్నికల్లో కీలక మలుపు తిరిగింది. పార్టీ మార్పు మాత్రమే కాదు, ప్రజల మనోభావాలను సరిగ్గా అంచనా వేసిన వ్యూహమే “క్లీన్ స్వీప్”కు కారణమైంది. కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా ఉన్న ఓటు బ్యాంక్ పూర్తిగా చేజారడం, గ్రామస్థాయిలో పార్టీ పట్ల అసంతృప్తి ఎంత లోతుగా ఉందో బయటపెట్టింది.
ఇక కొండమడుగు గ్రామంలో బీజేపీ యువ నాయకుడు కడెం పాండురంగం సాధించిన విజయం రాజకీయంగా మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా పేరున్న గ్రామంలో బీజేపీ జెండా ఎగరడం, రాష్ట్ర రాజకీయాల ప్రభావం గ్రామస్థాయికి చేరిందని సూచిస్తోంది. ఇది భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చూస్తే, ఈ పంచాయతీ ఎన్నికలు వ్యక్తుల కంటే పార్టీలు కాదు, పార్టీ కంటే పనితీరు అనే కొత్త రాజకీయ సంస్కృతి వైపు గ్రామాలను నడిపిస్తున్నాయని స్పష్టమవుతోంది. యువతరం రాజకీయాల్లోకి రావడం కేవలం నాయకుల మార్పు మాత్రమే కాకుండా, పాలనపై ప్రజల అంచనాల మార్పునకు సంకేతంగా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
