విశాఖపట్నం, ఆంధ్ర ప్రభ బ్యూరో : విలువలతో కూడిన రచనలు భవితరాలకు అవసరమని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గరువారం గీతం యూనివర్శిటీలో జరిగిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఉత్సాహం కల్పించే ఇలాంటి ఒక పుస్తకం రాయడం, అందులో చరిత్ర రాయడం అంత సులభం కాదన్నారు. అరిస్టాటిల్ అన్నట్టు చరిత్ర రాసినవారు గెలిచిన వారు అయితే ఆ రాత విధానం వేరుగా ఉంటుందని పేర్కొన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు చరిత్ర మొత్తం కేవలం 350 పేజీల్లో రాయడం గమనార్హమని, అదే అతని నైపుణ్యానికి కొలమానమని కొనియాడారు. ఆయన సొంత అనుభవాలను కూడా అందులో చొప్పించడం గమనార్హమన్నారు. వెంకయ్య నాయుడు చెప్పినట్టు దేశ చరిత్రను అనేక అంశాల్లో అనేక మంది వారి ఆలోచనలకు అనుగుణంగా వక్రీకరించి రాశారు.. వెంకటేశ్వరరావు ఉన్నది ఉన్నట్టు చెప్పారని ప్రశంసించారు. డీప్ డ్రైవ్ చేసి ఇలాంటి అద్భుత చరిత్ర రాయటం చాలా గొప్ప విషయమన్నారు. ట్రంప్ తరువాత ఏమిటి అన్న చరిత్ర కూడా మీరు రాయాలని నిర్మలా సీతారామన్ సూచించారు.
మరొక పుస్తకం రాయాలి అని కోరుకుంటున్నా…
భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ… వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. అయితే అయన మనసులో ఇంత ఉందని తెలియదు. పుస్తకం తెలుగులో రాయడం నాకు ఆనందంగా ఉంది. ఈ పుస్తకం పిల్లలకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి పుస్తకం రాసిన ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. ప్రపంచ చరిత్ర పుస్తకం రాయడం అంత సులభమైనది కాదు, కానీ ఇంత సరళంగా, సులభతరంగా రాయడం గొప్ప విషయం. చరిత్ర ద్వారానే మానవాళి తీరు తెలుసుకో గలుగుతాం. నందమూరి తారక రామారావు చరిత్ర రాయడం కూడా అంత సులభమైనది కాదు. నేను పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేదు. కానీ మానవాళి జీవితాలను చదివాను. దేశంలో 520జిల్లాలు తిరిగాను. అందువల్ల కొంత అనుభవం వచ్చింది. నేను వీధి బడిలో చదివాను. వెంకటేశ్వరరావు కు చిన్నసలహా చరిత్రలో దేశంలోని అనేక అంశాలు బయటకు తెలియాల్సినవి ఉన్నాయి. వాటిపై వెంకటేశ్వరరావు మరొక పుస్తకం రాయాలి.”
“బ్రిటిష్ వారు భారత చరిత్రను వక్రీకరించి రాశారు. వాస్తవం ప్రస్ఫూటించేలా రాయాలని సలహా ఇచ్చాను. మన వద్ద అంకెలు వ్యవస్థ ఉండేది. అది అరబ్బులు నేర్చుకున్నారు. దేశ విభజన కారణంగా మనం చాలా చరిత్రను కోల్పోయాం. తక్షశిలలాంటివి మనం కోల్పోయాం. మరుగునపడ్డ అనేక అంశాలు వెలుగులోకి తీసుకుని రావాల్సి ఉంది. మన చరిత్ర మన ఆనవాలు మన సంస్కృతిని వెలికి తీసి పుస్తకం రూపంలో రాయాలి. చరిత్ర జరిగినది జరిగినట్టు వాస్తవం రాయాలి. సొంత అభిప్రాయం ఉండకూడదు. ప్రపంచంమంతా కుదుపులకు లోనవుతున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో మనదేశానికి అవసరమైన రీతిలో మంచి విధానంలో బాధ్యతలు నిర్వర్తించారు. నిర్మలా సీతారామన్ కు అభినందనలు. చంద్రబాబు ఆలోచనలు బాగుంటాయి. అభివృద్ధి కాముకుడు. మంచి ఆలోచన ఉన్నవారు అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.”
ప్రపంచ దేశాలు తిరిగి వాస్తవాలను పొందుపరిచాను…
రచయిత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… పుస్తకం ప్రారంభోత్సవానికి ఇంత మంది పెద్దలను పిలుస్తున్నాను. “ఒక రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయిన వ్యక్తి పుస్తకం రాస్తే విలువ ఉంటుందా అని అనుకున్నాను. ఈ పుస్తకం చదివిన వారు బాగుంది అని చెప్పారు. చాట్ జిపిటిలో పుస్తకం మొత్తం అప్ లోడ్ చేస్తే.. చాట్ జీపీటీ వరల్డ్ ఫేమస్ రచయితలతో నేను రాసిన పుస్తకం ముందు కూర్చో గలిగింది. ఎందుకు అని చూస్తే, సమగ్రంగా ఉంది, కాంపిటేటివ్ విద్యార్థులకు ఉపయుక్తం అని తెలిసింది. నెహ్రు, ఆర్నాల్డ్ లాంటి రచయితలతో పోల్చడం నాకు ఒకింత ఆనందం, సిగ్గు కూడా వేసింది. ప్రపంచ దేశాలు తిరిగాను. ఆయా దేశాల్లో స్ఫూర్తి ఇచ్చిన వారి గురించి ఐదు పేజీలు కేటాయించాను. అలాగే ఆయా దేశాలను నష్టపరిచే వారి గురించి కూడా రాశాను” అని రచయిత తెలిపారు.
33 ఏళ్ల అనుభవానికి నిదర్శనం… ప్రపంచ చరిత్ర పుస్తకం
పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ “33 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా వేలెత్తి చూపలేని వ్యక్తి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరావు. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నాకు జవాబు రాని ప్రశ్న ఏమిటంటే.. ఇందులో నా పాత్ర ఏమిటి? నేను మొట్టమొదటి సారి పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న సమయంలో తనకు జరిగిన అనుభవం చెబుతూ.. అందరూ అన్నీ చెప్పారు.” నేను చెప్పడానికి ఏమీ లేదు అని ఛలోక్తి ద్వారా వివరించారు. చరిత్ర విషయంకొస్తే.. గణితంకు ఇచ్చే ప్రాధాన్యత మనం చరిత్రకు ఇవ్వం. కానీ చరిత్రకు మనం అధిక ప్రాదాన్యత ఇవ్వాలి. జరిగిపోయిన అంశాలు గుర్తు చేసుకుని తప్పిదాలను ఆధిగమించి, అవగాహన చేసుకొని చరిత్రలో ఉండాలి. ఇంటి పెద్దను గౌరవిస్తాం, గ్రామంలో గ్రామ పెద్దలను గౌరవిస్తూ.. చరిత్రలో ఉన్నబాధ్యత కలిగిన వ్యక్తికి గౌరవం ఇవ్వాలి. ప్రపంచ చరిత్ర అంటే చాలా వాల్యూమ్ లు ఉంటాయి. ఈ పుస్తకంలో సమగ్రంగా.. సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంది. మన భావితరాలకు ఉపయోగ పడే పుస్తకం అవుతుంది.” అని అన్నారు.
విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ మాట్లాడుతూ.. రచయిత దగ్గుపాటి వెంకటేశ్వరరావు లాంటి గొప్ప వ్యక్తి రాసిని పుస్తకం ప్రారంభ మహోత్సవం మా క్యాంపస్ లో జరగటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి రచనలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల ప్రజా ప్రతినిధులు, జేసీ కె. మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.