కార్మిక హక్కులు కాపాడేది ఐఎన్టియుసీ…

కార్మిక హక్కులు కాపాడేది ఐఎన్టియుసీ…
- ఏఐటీయూసీ పై మండిపడ్డ ఐఎన్టియుసి నాయకులు..
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని సమర్థంగా కాపాడగల సామర్థ్యం కేవలం ఐఎన్టియుసికే ఉందని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పసునూటి రాజేందర్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్యలు పేర్కొన్నారు. ఆదివారం యూనియన్ కార్యాలయంలో బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించగా నాయకులు హాజరై మాట్లాడారు.కార్మికుల సంక్షేమం కోసం పర్క్స్‌పై ఆదాయపన్ను మాఫీ, కార్మికులకు సొంత ఇంటి పథకం, మెడికల్ బోర్డు పునరుద్ధరణ వంటి కీలక అంశాలను ఐఎన్టియుసి నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తోందని తెలిపారు.
ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఈ సమస్యల పరిష్కారానికి కృషి కొనసాగుతోందని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తయినా కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఏఐటీయూసీ రాజకీయ ప్రయోజనాలకే పరిమితమైందని విమర్శించారు. గుర్తింపు సంఘంగా విఫలమైన ఏఐటీయూసీ ఇప్పుడు ధర్నాలు, దొంగ దీక్షల పేరుతో కార్మికులను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ సహకారంతో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కూనంనేని ఆధారంగా సింగరేణిలో రాజకీయ జోక్యం చేస్తూ, అదే సమయంలో కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమ పొత్తులు, స్ట్రక్చర్ మీటింగ్ బహిష్కరణ వంటి చర్యలు కార్మిక సంఘ బాధ్యతలకు విరుద్ధమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో చర్చల ద్వారా సింగరేణి కార్మికుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.
ఉద్యోగాల వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడం, కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ అమలు, రూ.1 కోటి ప్రమాద బీమా, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, నైని బొగ్గు గని ఉత్పత్తి ప్రారంభం వంటి చర్యలను అమలు చేసినట్లు తెలిపారు. గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ చేత కానితనాన్ని కార్మికులు ఎండగట్టాలని ఐఎన్టియుసి నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ రత్నం సమ్మీ రెడ్డి, బ్రాంచ్ నాయకులు శంకర్, నవీన్ కుమార్, శ్రీనివాస్, సంతోష్ కుమార్, ఫిట్ సెక్రెటరీ శ్రీనివాస్ , రాజు,రాములు పాల్గొన్నారు.
